Swachh Andhra: ఏపీలో ఈ-వ్యర్థాల సేకరణకు లైన్ క్లియర్! స్వచ్ఛ ఆంధ్ర, రీ సస్టెయినబిలిటీల ఒప్పందం
ABN, Publish Date - May 11 , 2025 | 04:54 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. వ్యర్థాల నిర్వహణ, ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన రీ సస్టెయినబిలిటీ రెల్డాన్‌తో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ (ఎస్ఏసీ) కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. వ్యర్థాల నిర్వహణ, ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన రీ సస్టెయినబిలిటీ రెల్డాన్‌తో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ (ఎస్ఏసీ) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. స్థానిక సమాజాలకు అధికారం ఇస్తూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల్ని శాస్త్రీయంగా సేకరించి, వేరు చేసి, పర్యావరణానికి హాని కలగని విధంగా వినియోగిస్తారు. బాధ్యతాయుత ఈ-వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఎస్ఏసీ 5,000 చదరపు అడుగుల గిడ్డంగి వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సమన్వయం చేస్తుంది. సేకరణ కోసం స్వయం సహాయక సంఘాల్ని ప్రోత్సహిస్తుంది. రీ సస్టెయినబిలిటీ రెల్డాన్ తన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సమర్థవంతమైన వనరుల పునరుద్ధరణ పద్ధతుల ద్వారా ఈ-వ్యర్థాల్ని నియమాల ప్రకారం, పారదర్శకంగా, సమర్థంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం తొలుత విజయవాడలో ప్రత్యేక ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రంతో మొదలవుతుంది.
ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంస్థలతో కలిసి సమగ్ర ప్రణాళికతో ఈ-వ్యర్థాల్ని సేకరిస్తారు. ఎస్ఏసీ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కమిషనర్ & డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, "సర్క్యులర్ ఎకానమీ, పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే మార్గదర్శకంగా నిలిపేందుకు ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన ముందడుగు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కేవలం మౌలిక వసతులే కాకుండా పర్యావరణ బాధ్యత, కొత్త ఆవిష్కరణల ఆలోచనల్ని ప్రోత్సహిస్తున్నాం" అని అన్నారు. రీ సస్టెయినబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో మసూద్ మాలిక్ స్పందిస్తూ.. "విసిరేసిన ఎలక్ట్రానిక్స్‌ను వ్యర్థాలుగా కాకుండా సంపదగా భావించే పర్యావరణహిత భవిష్యత్తు కోసం ఈ సహకారం ఒక ప్రారంభం. బాధ్యతాయుత రీసైక్లింగ్, సమర్థవంత వనరుల పునరుద్ధరణ ద్వారా సహజ వనరుల వెలికితీతపై ఒత్తిడిని తగ్గించి, తక్కువ కాలుష్యంతో కూడిన ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు. పర్యావరణాన్ని రక్షించేందుకు, వనరుల్ని తిరిగి ఉపయోగంలోకి తెచ్చేందుకు ఎస్ఏసీతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు.
Updated Date - May 11 , 2025 | 04:54 AM