Wind Energy Sector : పవన విద్యుత్‌పై 12 వేల మందికి శిక్షణ
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:24 AM
ఇంధన రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది.
కాలేజీల్లో ల్యాబ్‌లు, ఎక్స్‌లెన్స్ సెంటర్లు
సుజ్లాన్, స్వనీతి కంపెనీలతో ఒప్పందాలు
మంత్రి లోకేశ్ సమక్షంలో సంతకాలు
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఇంధన రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రం లో భారీగా పవన విద్యుత్‌పై నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్‌తో, గ్రీన్ ఎనర్జీ లో యువతకు ఉపాధి కల్పన కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందాలు చేసుకుంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మంగళవారం ఈ ఒప్పందాలు జరిగాయి. పవన విద్యుత్ రంగంలో యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా సుజ్లాన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని లోకేశ్ అన్నా రు. ఈ ఒప్పందం ద్వారా మెకానికల్, ఎలక్ర్టికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైజనింగ్ రంగాల్లో 12 వేల మందికి శిక్షణ ఇస్తారు. 3 నుంచి 12 నెలల కాల వ్యవధితో శిక్షణ కార్యక్రమాలు చేపడతారు. పవన విద్యుత్ రంగం అవసరాలకు తగ్గట్టుగా ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ కాలేజీల్లో వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెడతారు. కాలేజీల్లో స్కిల్ ల్యాబ్‌లు ఏర్పాటుచేసి పరిశోధన, ఆవిష్కరణ, శిక్షణ కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్లు నిర్వహిస్తారు. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. రాష్ట్రంలో పవన విద్యుత్ కార్యక్రమాలు చేపట్టే సుజ్లాన్ కంపెనీకి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారం అందిస్తుంది.
స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ గ్రీన్ స్కిల్లింగ్ డెవల్‌పమెంట్ కార్యక్రమాలు చేపడుతుంది. వచ్చే 4 నెలల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధికి ముసాయిదా ప్రణాళికను సిద్ధంచేస్తుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్వనీతి బృందానికి సహకారం అందిస్తుంది. నైపుణ్య గణన, ఇన్‌సైట్ సమాచారం, గ్రీన్ స్కిల్లింగ్‌పై సమాచారం ఆ కంపెనీకి అందజేస్తుంది. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసి, ఇతరత్రా సమాచారం ఇస్తుంది. ఇందులో భాగంగా స్వనీతి సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతుంది. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో గ్రీన్ ఉద్యోగాల కల్పనకు అవకాశాలను అంచనా వేసేందుకు బేస్‌లైన్ సర్వే చేపడుతుంది. కార్యక్రమంలో సుజ్లాన్ కం పెనీ సీఈవో జేపీ చలసాని, సీహెచ్‌ఆర్ ఒ.రాజేంద్ర మెహ తా, స్వనీతి కంపెనీ ట్రస్టీ ఉమా భట్టాచార్య పాల్గొన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 05:25 AM