YCP Jagan: ప్రాణం పోతోందన్నా దారివ్వలేదు
ABN, Publish Date - Jun 24 , 2025 | 06:34 AM
పోలీసుల హెచ్చరికలు, నిబంధనలను బేఖాతరు చేసి పల్నాడులో బల ప్రదర్శనకు దిగిన వైసీపీ అధినేత జగన్ కారణంగా మరొకరు బలయ్యారు.
జగన్ పర్యటనలో మరొకరు బలి
రెంటపాళ్లకు వెళ్లిన సమయంలో వైసీపీ ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్
వైద్యం అందక టీడీపీ నేత కుమారుడి మృతి.. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తెల్లజర్ల మధు
40 నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్తే బతికే చాన్స్.. కానీ వైసీపీ ర్యాలీతో నిలిచిన అంబులెన్స్
2 గంటలు ఆలస్యంగా ఆసుపత్రికి, అప్పటికే మృతి.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
గుంటూరు, జూన్ 23(ఆంధ్రజ్యోతి): పోలీసుల హెచ్చరికలు, నిబంధనలను బేఖాతరు చేసి పల్నాడులో బల ప్రదర్శనకు దిగిన వైసీపీ అధినేత జగన్ కారణంగా మరొకరు బలయ్యారు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ తెల్లజర్ల వెంకటేశ్వర్లు కుమారుడు తెల్లజర్ల మధు.. అదేరోజు తన మిత్రుడికి బైక్ ఇవ్వడానికి వెళ్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సాయి కృష్ణ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యు లు బ్రెయిన్ స్ర్టోక్ వచ్చినట్లు నిర్థారించి, 40 నిమిషాల్లో గుంటూరులోని పెద్ద హాస్పిటల్‌కు తరలిస్తే ప్రాణం నిలిపే అవకాశం ఉందని తెలిపారు.
కుటుంబ సభ్యులు మధును తీసుకుని సత్తెనపల్లి నుంచి అంబులెన్స్‌లో గుంటూరుకు బయలుదేరారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల గ్రామానికి వస్తున్నారు. ఈ సందర్భంగా రహదారులు మొత్తం ట్రాఫిక్‌తో నిలిచిపోయాయి. మధు తల్లిదండ్రులు వాహనం దిగి వైసీపీ నాయకులను దారివ్వాలంటూ వేడుకున్నారు. అయినా వారు కనికరించలేదు. దీంతో అంబులెన్సు 2 గంటలు ఆలస్యంగా గుంటూరుకు చేరింది. అప్పటికే మధు మృతి చెందాడు. ఈ ఆలస్యమే మధు మృతికి ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. అంబులెన్సుకు దారివ్వని జగన్ దీనికి నైతిక బాధ్యత వహించాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Updated Date - Jun 24 , 2025 | 06:52 AM