Operation Kagar: సహజ సంపద దోపిడీకే బూటకపు ఎన్‌కౌంటర్లు
ABN, Publish Date - May 31 , 2025 | 04:55 AM
సహజ సంపదను కార్పొరేట్‌లకు అప్పగించేందుకు మావోయిస్టు నేతలను ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నారని పౌర హక్కుల సంఘం మండిపడింది. చీరాలలో మావోయిస్టు నేత సజ్జా నాగేశ్వరరావుకు నివాళులర్పిస్తూ సమావేశం జరిగింది.
మావోయిస్టు అగ్రనేత సజ్జా సంస్మరణ సభలో వక్తలు
చీరాల, మే30(ఆంధ్రజ్యోతి): రానున్న అతి కొద్దిరోజుల్లో సహజ సంపద కార్పొరేట్ల చేతుల్లోకి మారుతుందని, దీనిని అడ్డుకుంటున్నందుకే మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావు తదితరులను దారుణంగా హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని రాష్ట్ర పౌర హక్కుల సంఘం కార్యదర్శి చిలక చంద్రశేఖర్ ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని జాండ్రపేటలో శుక్రవారం మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, ‘అవాన్-ఇ-జంగ్’ పత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జా నాగేశ్వరరావు(61) అలియాస్ ఏసన్న సంస్మరణ సభను రాష్ట్ర చేనేత జనసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి పలు విప్లవ సంఘాలు, ప్రజాసంఘాలు, పౌర హక్కుల సంఘాల నాయకులు హాజరై సజ్జాకు నివాళులర్పించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దండకారణ్యంలో హత్యలకు పాల్పడుతోందని తెలిపారు. బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్ ప్రాంతాల్లోని సహజ సంపద దోపిడీదారుల వశమవుతుందని చెప్పారు. వాటిని రక్షించేందుకు మావోయిస్టు పార్టీలు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. 1988-90 మధ్య గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 200 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వివరించారు. చేనేతల కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు ఆ సమయంలో పోరాట బాట పట్టారని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం సుమారు 470 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో దారుణంగా కాల్చి చంపిందన్నారు. వారిలో 200కు పైగా మహిళలు ఉన్నట్లు చెప్పారు. ఇది అప్రజాస్వామికమన్నారు. వారి కుటుంబసభ్యులు కనీసం చివరి చూపునకు కూడా నోచుకోలేక పోయారన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 04:55 AM