Seethakka: సెర్ప్ ద్వారా ఎస్‌హెచ్‌జీలకు చేపల విక్రయ వాహనాలు
ABN, Publish Date - Dec 31 , 2024 | 05:28 AM
మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆర్థిక పురోభివృద్ధి కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వివిధ వ్యాపారాల్లో శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.
మొదటి విడతగా జిల్లాకు ఒకటి
3న మంత్రి సీతక్క చేతుల మీదుగా 32 వాహనాల ప్రారంభం
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆర్థిక పురోభివృద్ధి కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వివిధ వ్యాపారాల్లో శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఆసక్తి ఉన్న మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను సమకూర్చబోతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సూచనతో జిల్లాకు ఒకటిచొప్పున ఎస్‌హెచ్‌జీలకు మొదటి విడత అందించేందుకు 32 వాహనాలను తయారు చేయించారు. రూ.10లక్షల విలువైన ఒక్కో వాహనాన్ని ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి 60శాతం సబ్సిడీతో రూ.4లక్షలకే మహిళా సంఘాలకు కేటాయించనున్నారు.
ఈ మొత్తాన్ని వడ్డీలేని రుణ పథకం కింద బ్యాంకుల ద్వారా ఇప్పించనున్నారు. సంచార వాహనాలతో చేపల విక్రయంతోపాటు చేపల వంటకాల తయారీపై మహిళా సంఘాలకు ఇప్పటికే శిక్షణ ఇప్పించామని, దీంతో వారు రెండు రకాలుగా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుందని సెర్ప్ ప్రతినిధులు పేర్కొన్నారు. జనవరి 3న ఈ 32 వాహనాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వారు వెల్లడించారు.
Updated Date - Dec 31 , 2024 | 05:28 AM