Tungabhadra Dam: ప్రాజెక్టులకు జల కళ..
ABN, Publish Date - Jul 26 , 2024 | 06:25 AM
తుంగ, భద్ర నదులపై ఉన్న కర్ణాటక-ఏపీ-తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర ప్రాజెక్టుకు గురువారం వరద మళ్లీ పెరిగింది. తుంగ, వార్దా నదుల నుంచి ప్రవాహంతో.. లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కులు విడుదల కావచ్చని తుంగభద్ర బోర్డు తెలిపింది.
తుంగభద్రలోకి లక్ష క్యూసెక్కులు.. 28 గేట్లు ఎత్తివేత
ఆల్మట్టి, జూరాలకు 2 లక్షల క్యూసెక్కులు మించి..
శ్రీశైలం 2.57 లక్షలు, సాగర్‌కు 29125 క్యూసెక్కులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
తుంగ, భద్ర నదులపై ఉన్న కర్ణాటక-ఏపీ-తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర ప్రాజెక్టుకు గురువారం వరద మళ్లీ పెరిగింది. తుంగ, వార్దా నదుల నుంచి ప్రవాహంతో.. లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కులు విడుదల కావచ్చని తుంగభద్ర బోర్డు తెలిపింది. తుంగభద్ర డ్యాం గరిష్ఠ నీటిమట్టం 1,633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. గురువారం ఉదయం 8 గంటలకు నీటి మట్టం 1631.91 అడుగులకు, నీటి నిల్వ 101.91 టీఎంసీలకు చేరింది. 28 గేట్లను ఎత్తారు. బేసిన్‌తో పాటు సబ్ బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు నిండడంతో వచ్చిన నీరంతటినీ శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. గురువారం ఆల్మట్టికి 2,04,167 క్యూసెక్కులు వస్తుండగా 2,75,000 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 2.70 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 25 గేట్లు ఎత్తి 2,70,120 క్యూసెక్కులను వదులుతున్నారు.
నారాయణపూర్ ప్రాజెక్టుకు 2.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఔట్‌ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయానికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరువస్తుండగా 46 గేట్లు ఎత్తి 2,25,354 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19,516 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలంలోకి 2.54 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, జల విద్యుదుత్పత్తితో 31,784 క్యూసెక్కులు సాగర్‌కు విడిచిపెడుతున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన వరద కూడా రెండు రోజుల్లో శ్రీశైలం చేరే అవకాశం ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా 855.20 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా 85.75 టీఎంసీల నీరు ఉంది. రోజుకు 16.50 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరుతోంది. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో జలాశయం నిండే అవకాశం ఉంది. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల, ఏపీ మధ్య కృష్ణా నదిలో ఉన్న సంగమేశ్వరాలయం శుక్రవారం ఉదయానికి జలదివాసం కానుంది.
సాగర్‌కు 29,125 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఈ ఏడాది తొలిసారి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద రాక మొదలైంది. వారం రోజుల్లో 50 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో బుధవారం నుంచే విద్యుదుత్పత్తి ప్రారంభించగా, సాగర్‌కు గురువారం సాయంత్రానికి 29,125 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సాగర్ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 503.50 అడుగులుండగా గురువారం సాయంత్రానికి 504.20 అడుగులకు (122.08 టీఎంసీలు) చేరుకుంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 5,700క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
గోదావరి తగ్గుతూ.. పెరుగుతూ..
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి క్రమంగా పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 48.60 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీకి 9.50లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం)కు 11.47 లక్షలు, మేడిగడ్డకు 7.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీరాం సాగర్‌కు 21,650 క్యూసెక్కుల వరద చేరుతోంది.
విద్యార్థులను భుజాలపై ఎత్తుకుని..
ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం జైహింద్‌పూర్‌లో ఒర్రె పొంగడంతో 26 మంది విద్యార్థులు ఒక్కొక్కరిని ఉపాధ్యాయుడు సంతోష్ భుజాలపై ఎత్తుకుని అవతలి ఒడ్డు న ఉన్న బడికి చేర్చారు. అలాగే, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ప్రాణహిత బ్యాక్ వాటర్ రోడ్డుపైకి భారీగా చేరింది. దీంతో జాజులపేటకు చెందిన గర్భిణి భారతిని ఆమె భర్త, ఆశా కార్యకర్త వరద నీటిలో ఆమెను అర కి.మీ. నడిపించుకుని వెళ్లి ఆస్పత్రికి చేర్చారు.
హైదరాబాద్‌లో రోజంతా వాన
రాష్ట్రంలో గురువారం ముసురు కమ్మేసింది. హైదరాబాద్‌లో బుధవారం అర్థరాత్రి మొదలైన వర్షం గురువారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో 1 సెంటీమీటర్‌పైనే వాన పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షం తెరిపినివ్వలేదు. సగటున 2.6 సెం.మీ. పైనే వర్షం కురిసింది. పెన్ గంగా, ప్రాణహిత, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత ధాటికి బెజ్జూర్ మండలంలో 12 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి.
Updated Date - Jul 26 , 2024 | 06:25 AM