Hyderabad: ఆర్‌అండ్‌బీకి త్వరలో కొత్త కార్యదర్శి
ABN, Publish Date - May 28 , 2024 | 06:07 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు త్వరలో కొత్త ముఖ్య కార్యదర్శి రానున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న అధికారి కొద్ది రోజుల్లో రిలీవ్ కానున్నారు. ఆర్ అండ్ బీకి 2021 అక్టోబర్ 13వ తేదీన ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సదరు అధికారి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందినవారు.
రిలీవ్ కానున్న ప్రస్తుత ప్రిన్సిపల్ సెక్రటరీ
మార్చి 31నే ఇంటర్ కేడర్ డిప్యూటేషన్ పూర్తి అయినా పదవిలో కొనసాగిన వైనం
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు త్వరలో కొత్త ముఖ్య కార్యదర్శి రానున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న అధికారి కొద్ది రోజుల్లో రిలీవ్ కానున్నారు. ఆర్ అండ్ బీకి 2021 అక్టోబర్ 13వ తేదీన ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సదరు అధికారి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందినవారు. ఆయనను ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ విధానంపై తెలంగాణకు తీసుకునేందుకు, ఏపీ నుంచి రిలీవ్ చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పట్లో అనుమతి ఇచ్చాయి. దీంతో 2020 మే 5వ తేదీ నుంచి ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ విధానంలో ఆయన తెలంగాణలో పనిచేస్తున్నారు. నిజానికి ఈ విధానంలో పని చేసేందుకు ఐఏఎస్ అధికారుల నిబంధనల మేరకు మూడేళ్లు మాత్రమే అవకాశం ఉండగా, ప్రత్యేక అనుమతులు ఉంటే మరో రెండేళ్లు పొడిగించే వెసులుబాటు ఉంటుంది. ఇందులో భాగంగానే సదరు అధికారికి 2020 మే 5 నుంచి 2023 మే 4 వరకు పని చేసేందుకు అవకాశం లభించింది.
2023 మే 4న డిప్యుటేషన్ పూర్తయ్యే సమయానికి, మరో రెండేళ్లు పొడిగించాలంటూ ఇరు ప్రభుత్వాలను కోరగా.. అందుకు అంగీకరించాయి. అయితే, దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో అధికారి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. క్యాట్ కూడా డిప్యుటేషన్ పొడిగింపు విషయంలో అభ్యంతరం తెలిపినప్పటికీ, అధికారి తన పిటిషన్‌లో పేర్కొన్న పలు కారణాలను పరిగణనలోకి తీసుకొని, మానవతా దృక్ఫథంతో 2024 మార్చి 31 వరకు ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ విధానంలోనే తెలంగాణలో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ఆ అధికారి పదవి నుంచి రిలీవై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖలో ఏప్రిల్ 1వ తేదీన రిపోర్టు చేయాల్సి ఉంది. కానీ ఆయన పదవిలోనే కొనసాగటం విశేషం. ఏప్రిల్ నుంచి కూడా రోజూ సచివాలయానికి రావడంతో పాటు, అధికారులతో పలు అంశాలపై మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడిది ఆర్ అండ్ బీలో చర్చనీయాంశమైంది. కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయం పనులన్నీ ఈ అధికారి పర్యవేక్షణలోనే జరిగాయి. మొత్తానికి సదరు అధికారి రిలీవ్ అవుతుండటంతో ఆర్ అండ్ బీకి రాబోయే కొత్త కార్యదర్శి ఎవరనే దానిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Updated Date - May 28 , 2024 | 06:07 AM