Literary Conference : మళ్లీ తెలుగు వెలుగులు
ABN, Publish Date - Dec 30 , 2024 | 05:26 AM
భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్టుగా రాష్ట్రంలో అన్ని విద్యాలయాల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
అన్ని బడుల్లో త్వరలో తెలుగు మాధ్యమం
ప్రాథమిక స్థాయి నుంచి అమలుకు చర్యలు
ఆ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ప్రారంభం
తెలుగు భాష పరిరక్షణ, ప్రోత్సాహానికి సిద్ధం
రాష్ట్రంలో సాహితీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం
ప్రకటించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
‘తెలుగు’ కోసం కలసి కదులుదాం: మంత్రి సత్యకుమార్
ముగిసిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
విజయవాడ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్టుగా రాష్ట్రంలో అన్ని విద్యాలయాల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజమహేంద్రవరంలోని బేతిని గ్రంథాలయం, విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయం మన భాషా వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పాటును అందించాయని, వాటిని సాహితీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే నేటితరం పిల్లలకు భాషపై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఎకో టూరిజం, వైల్డ్‌లైఫ్ టూరిజంతో పాటు సాహితీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలు మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యం మనం ఇవ్వలేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భాషను పరిరక్షించడానికి ప్రభుత్వాలే కాకుండా పౌరసమాజం తగిన పాత్ర పోషించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో మునిగిపోతున్న విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. మాతృభాషను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
మహాసభల్లో ఆమోదించిన తీర్మానాలతో పాటు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో తెలుగు భాష ఔన్నత్యాన్ని కోల్పోతోందన్నారు. అమృత భాషగా భావించే తెలుగుకు వైసీపీ తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష వికాసాన్ని నాశనం చేశారని ఆరోపించారు. మాతృభాషకు, పరాయి భాషకు తల్లిపాలు తాగి ఎదిగిన బిడ్డకు, పోత పాలు తాగి పెరిగిన బిడ్డకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుందని వ్యాఖ్యానించారు. మాతృభాషలో విద్యా బోధన జరిగినప్పుడు విద్యార్థుల్లో సంపూర్ణ మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తే తెలుగు భాష పరిస్థితి ఏమిటని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు.
నేతల పిల్లలు సర్కారీ బడులకు
రాజకీయ నేతల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపినప్పుడు భాష దానికదే ఎదుగుతుంది. మనం, మన కుటుంబాలు ఎదిగి మిగిలిన వారంతా తెలుగు భాషం కోసం పనిచేయండని కూర్చుంటే పరిరక్షణ సాధ్యం కాదు. రాజకీయ నాయకులే తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు. తెలుగును జగన్ నాశనం చేశారు. ప్రపంచంతో పోటీ పడాలంటే తెలుగు పనికిరాదని నేరుగా చెబుతున్నారు. ప్రపంచంలో 15కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు భాష ఎలా నశిస్తుంది? తమిళనాడు, కర్ణాటక తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
తెలుగు భాషకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసింది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి తెలుగు మాధ్యమం ఉండాలని మేధావులు కోరుతున్నారు. దీనిపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.
- కొలనుకొండ శివాజీ, పీసీసీ ఉపాధ్యక్షుడు
ఏ భాషకూ రాని ప్రమాదం వచ్చింది
దేశంలో ఏ భాషకూ రాని ప్రమాదం తెలుగుకు వచ్చింది. అంతరించే స్థాయికి చేరింది. తెలుగులో మాట్లాడిన వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే స్థితికి సమాజం చేరుకుంది. దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో ఇంగ్లిష్ మీడియం బిల్లును అసెంబ్లీలో ఆమోదించి శాసన మండలికి పంపారు. నాడు మండలిలో నేను అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ సమాధానం చెప్పలేకపోయారు.
- పి.అశోక్‌బాబు, ఎమ్మెల్సీ
న్యాయవ్యవస్థలో తెలుగు తీర్పులకు ‘ఏఐ’
జస్టిస్ కృష్ణమోహనరావు
న్యాయవ్యవస్థలో తీర్పులను మాతృభాషలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) పరంగా ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.కృష్ణమోహనరావు తెలిపారు. ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో భాగంగా ‘తెలుగులో న్యాయపాలన’ అంశంపై ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు ఆంగ్ల పదాలకు సరిపోయే సమానార్థక పద సంపదను సృష్టించుకుని స్థిరీకరించుకోవాలని సూచించారు. తెలుగులో తీర్పును వెలువరించాలంటే ఇంగ్లిష్ తీర్పులను అనువదించడానికి అనువాదకులను నియమించుకోవాల్సి ఉంటుందని, ఈ స్థానాల్లో తెలుగుపై పట్టున్న వారిని ఎంపిక చేయాలని కోరారు. మాతృభాషను పరిరక్షించడానికి ఇళ్లల్లో వాడుక భాషను ఉపయోగిస్తే సరిపోదని, మాతృభాష మాధుర్యాన్ని పిల్లలకు చూపించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. తెలుగును ఒక పాఠ్యాంశంగా అమలు చేయడం కాదని, తెలుగు మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని జస్టిస్ కృష్ణమోహనరావు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఆదేశాలు తెలుగులో..: సత్యకుమార్
రాజకీయంగా సిద్ధాంతాలు వేరైనప్పటికీ, వాటిని పక్కనపెట్టి మాతృభాష పరిరక్షణ కోసం కలసికట్టుగా ప్రయాణం చేద్దామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ‘తెలుగు భాషాభివృద్ధి- తెలుగు భాష పరిరక్షణ- రాజకీయ నాయకుల పాత్ర’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణ యజ్ఞంలో తానూ భాగస్వామినవుతానని చెప్పారు. అధికారుల కోసం తెలుగు భాషపై ఓ సదస్సు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఆదేశాలు తెలుగులో వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మాతృభాష పరిరక్షణ కోసం త్యాగాలకు సిద్ధం కావాలి
సభకు అధ్యక్షత వహించిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణ కోసం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసి భాషను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నేతలు ఉపయోగిస్తున్న భాషపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. భాష సంస్కృతిని పాటించని నేతలపై ఆయా పార్టీల అధినేతలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంట్లో చందమామ, బంతి అని నేర్చుకున్న పిల్లలకు బడికి వెళ్లాక మూన్, బాల్ అన్న పదాలు నేర్పిస్తున్నారని, ఒకవిధంగా ఇది భ్రూణహత్య వంటిందని వ్యాఖ్యానించారు. పసితనంలోనే భాషను చంపేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. అండమాన్‌లోని ఒక దీవిలో నివసించే తెగలో 75మంది జనాభా మాత్రమే ఉంటారని తెలిపారు. సముద్రపు అల అనే పదానికి వారు 60 పర్యాయపదాలు సృష్టించుకున్నారని వివరించారు.
పదసంపద లేకే పరాయి పదాలు
తెలుగు భాషకు తగినంత పదసంపద లేదు. అందుకే ఆంగ్ల పదాలను తెలుగులోకి జోడిస్తున్నారు. తెలుగు పదసంపదను పెంచుకోవడానికి భాషా పండితులు నిఘంటువును తయారు చేయాలి. ఆ పదాలను పాటలు, కవిత్వాలు రాసే రచయితలకు పరిచయం చేయాలి. క్రియ, నామవాచకాల్లో ప్రస్తుత నేపథ్యానికి కావాల్సిన తెలుగు పదాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నాటినుంచి నేటి వరకు తెలుగులో ఎలాంటి మార్పులు రాలేదు. ఆదికావ్యం పుట్టిన గోదావరి ఒడ్డు నా సాహిత్యానికి ప్రేరణ. పండిత, పామరులకు రంజకంగా ఉండేలా రాయాలన్నది రచయితల అభిప్రాయం. పండితులను కాకపోయినా పామరులను రంజింప చేస్తే చాలన్న ధోరణి పెరిగింది.
- అనంతశ్రీరాం, సినీ గేయ రచయిత
ఆ ప్రేమ మనకెందుకు లేదు?
అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ పిల్లలను వారానికి ఒకసారి తెలుగు బడులకు పంపుతారు. తెలుగు భాషను పరిచయం చేస్తారు. అమెరికాలో ఉన్నవారికి భాషపై అంత ప్రేమ ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనకు ఎందుకు లేదు? తల్లిదండ్రులు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే ఎందుకు చేర్పిస్తున్నారు? ఈ ధోరణి మారాలి.
- అంబికా కృష్ణ, సినీ నిర్మాత
18 తీర్మానాలు ఆమోదం
ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో 18 తీర్మానాలను మహాసభల కార్యదర్శి జీవీ పూర్ణచందు ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అవి... ఇంటా, బయట అన్ని సామాజిక జీవన ప్రామాణికాల్లో తెలుగును ఉపయోగించాలి. కనుమరుగైన పదాలను వెలికి తీసే బాధ్యతను రచయితలు తీసుకోవాలి. ఆంగ్ల పదాలకు సమానమైన పదాలను సృష్టించాలి. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో బోధన జరగాలి. డిగ్రీలో తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంజనీరింగ్, వైద్య విద్యను మాతృభాషలో బోధించాలనే కేంద్ర ప్రభుత్వ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జీవో 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. హైకోర్టుల్లో వాద ప్రతివాదనలు, తీర్పులు తెలుగులో జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తెలుగు భాషాఽభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్టంగా నిర్మించి నిఽధులు కేటాయించాలి. పాలనావ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరిగేలా చర్యలు తీసుకోవాలి. వైసీపీ తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చి, దిగజార్చిన దాని ఔన్నత్యాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్రంలో తెలుగు వర్సిటీని, కళల పరిశోధన, పరిరక్షణ కోసం సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. సమగ్ర లక్ష్యాలు, విధులు, నిధులతో వివిధ అకాడమీలను పటిష్టం చేయాలి. గ్రంథాలయ సంస్థలను పటిష్టం చేసి, పుస్తకాలు కొనుగోలు చేయాలి. రాష్ట్ర గ్రంథాలయం, రాష్ట్ర మ్యూజియం ఏర్పాటు చేయాలి. తెలుగులో చదివినవారికి ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలుగు భాషను పరిరక్షించడానికి, సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టడానికి, కళారూపాలను, దృశ్యకళలను కాపాడడానికి తెలుగు ప్రభుత్వాలు సాంస్కృతిక, భాషా విధానాలను రూపొందించి ప్రకటించాలి.
ఇంగ్లిష్‌కు 6 రోజులు.. తెలుగుకు 40 రోజులు
ఆంగ్లంలో తీర్పులు రాయడానికి 6 రోజుల సమయం పడితే, తెలుగులో తీర్పును రాయడానికి 40 రోజులు పట్టింది. నేను ఇప్పటి వరకు 2 తీర్పులు తెలుగులో ఇచ్చాను. ఆ సమయంలో అనేక వ్యయప్రయాసలు ఎదురయ్యాయి. తెలుగు విభాగాధిపతిగా ఉన్న నా మిత్రుడిని పిలిపించుకుని సమానార్థక పదాలతో ఇంగ్లిష్ తీర్పును తెలుగులోకి అనువదించాను.
- జస్టిస్ కె.మన్మథరావు, హైకోర్టు న్యాయమూర్తి
చట్టాలను తెలుగులోకి అనువదించాలి
తెలంగాణ హైకోర్టులో ఇప్పటి వరకు 1,100 తీర్పులను, సుప్రీంకోర్టుకు సంబంధించి 2,500 తీర్పులను తెలుగులోకి తర్జుమా చేశాం. ఏపీలో 547 హైకోర్టు, 860 సుప్రీంకోర్టు తీర్పులను తెలుగులోకి అనువదించారు. దీనికోసం సుప్రీంకోర్టు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తేనే అనువాదం చేసిన తీర్పులకు నిధులు విడుదల చేస్తుంది. తీర్పులు మాతృభాషలో వెలువరించాలంటే ముందుగా ప్రభుత్వాలు చట్టాలను తెలుగులోకి అనువదించాలి. ఇది న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆంగ్ల పదాలకు.. తెలుగులో సమానార్థక పదాలు 90వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎన్ని తీర్పులను మాతృభాషలో ఇవ్వగలం?
- జస్టిస్ కె.లక్ష్మణ్, టీ. హైకోర్టు న్యాయమూర్తి
తెలుగు వల్లే న్యాయవాదినయ్యా
నేను న్యాయ విద్యను అభ్యసించడానికి, న్యాయవాదిగా మారడానికి తెలుగే కారణం రోబోలు ఒక కమాండ్ ఇస్తే సొంత భాషను తయారు చేసుకుని సంభాషించుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మాభిమానం ఉన్న తెలుగువారు పరాయి భాషలో సంభాషించడం ఆలోచించాల్సిన విషయం. న్యాయవ్యవస్థలో 95శాతం మంది తెలుగులోనే మాట్లాడతారు. కాగితాలు తెలుగులో ఉన్నప్పటికీ ఇంగ్లి్‌షలో మాట్లాడుతున్నామంటే మనం ఏ స్థాయికి దిగజారిపోయామో ఆత్మపరిశీలన చేసుకోవాలి.
- జస్టిస్ భీమపాక నగేష్, టీ-హైకోర్టు న్యాయమూర్తి
ఆంగ్లేయుల పాలనలోనే తెలుగు తీర్పులు
బ్రిటిషర్లు పరిపాలించేటప్పుడు న్యాయస్థానాల్లో తీర్పులు తెలుగులో వెలువరించేవారు. అప్పటి బ్రిటిష్ న్యాయమూర్తులు తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించుకుని ఉత్తర్వులు ఇచ్చేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రం ఆంగ్లంలో తీర్పులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లో ఇప్పటికీ అక్కడి మాతృభాషల్లోనే తీర్పులు ఇస్తున్నారు. మాతృభాషను వదులుకుంటే కన్నతల్లిని వదులుకున్నట్టే. మాతృభాషపై పట్టు లేకపోతే ఇతర భాషల్లోనూ నైపుణ్యం సాధించలేం. తెలుగు పదిలంగా ఉండాలంటే విద్యావిధానంలో మార్పులు రావాలి. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
- జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి
Updated Date - Dec 30 , 2024 | 05:52 AM