Mega Parent-Teacher Meeting : పండగలా..!
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:56 AM
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా శనివారం ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు.
ఉత్సాహంగా పేరెంట్-టీచర్ మీటింగ్
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సందడి వాతావరణం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు గులాబీ ఇచ్చి ఆహ్వానం. ఆహ్వానితులకు పూలు చల్లి వందనం. తల్లులకు ముగ్గుల పోటీలు. తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీ. విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారుల మమేకం. పిల్లలతో కలిసి అంతా సహపంక్తి భోజనాలు. ఇవీ మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా పాఠశాలల్లో కనిపించిన దృశ్యాలు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా.. పండుగ వాతావరణంలో జరిగాయి.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా శనివారం ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు, పూర్వ విద్యార్థులు, దాతలు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొని విద్యార్థులతోనూ, తల్లిదండ్రులతోనూ మమేకమయ్యారు. పాఠశాలల్లో వసతులు, విద్యాప్రమాణాలు, మధ్యాహ్న బోజనాలు తదితర అంశాలపై చర్చించారు. బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, కడపలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
పీటీజీ విశేషాలు ఇవీ..
విశాఖ జిల్లా చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్‌లో 4,000 మంది విద్యార్థులు ఉండగా, సుమారు వెయ్యిమంది తల్లిదండ్రులు పేరెంట్-టీచర్ మీటింగ్‌కు హాజరయ్యారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో మలిచర్ల(సుంకరిపేట) జడ్పీ హైస్కూల్‌లో తల్లిదండ్రులపై పూలు చల్లుతూ, గులాబీలు అందించి సమావేశానికి ఆహ్వానించారు.
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల పాఠశాలకు ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.
కర్నూలులోని ఏ.క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్‌లో డ్రగ్స్ నివారణపై అవగాహన పోస్టర్లను మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం జడ్పీ హైస్కూల్‌లో హోంమంత్రి అనిత తన పక్కన కూర్చున్న తారా అనే విద్యార్థినికి అన్నం తినిపించి ఆత్మీయతను పంచారు.
నంద్యాల జిల్లా ఇల్లూరుకొత్తపేట జడ్పీ హైస్కూల్లో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
పల్నాడు జిల్లాలోని 1,586 పాఠశాలల్లో జరిగిన సమావేశాల్లో 1,53,229 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, గుంటూరు జిల్లాలోని 1,061 పాఠశాలల్లో 55వేల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చిన్నప్పుడు ఇక్కడే చదివా: ఫరూక్
నంద్యాల పట్టణంలోని కాదరబాద్ నరసింగరావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ భావోద్వేగానికి గురయ్యారు. ఇదే పాఠశాలలో చదివిన ఆయన చిన్నప్పుడు చేసిన అల్లరిని గుర్తుచేసుకుంటూ.. స్నేహితులతో సరదాగా గడిపారు.
తల్లిదండ్రులూ.. పిల్లల్ని గమనిస్తుండండి: అనిత
విద్యార్థుల తల్లిదండ్రులు గంజాయి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం జడ్పీ హైస్కూల్‌లో మెగా పీటీఎంలో ఆమె పాల్గొన్నారు. ఏడేళ్ల వయసున్న కుమారుడి స్కూల్ బ్యాగ్‌లో గంజాయి ఉందని ఓ తల్లి తనకు చెప్పారని, గంజాయిని చాక్లెట్ రూపంలోనూ అమ్ముతున్నారని తెలిపారు.
Updated Date - Dec 08 , 2024 | 05:01 AM