Andhra University: ఏయూలో అరాచకం
ABN, Publish Date - Jun 18 , 2024 | 06:25 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందారు. ఆయన 2022లో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో పీహెచ్‌డీలో చేరారు.
నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ పీహెచ్‌డీ ప్రవేశం
2022లో ఎగ్జిక్యూటివ్ కోటాలో
ప్రవేశాన్ని పొందిన ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్
50 కోట్లు టర్నోవర్ ఉన్న సంస్థలకు
మాత్రమే ఎగ్జిక్యూటివ్ కోటాకు అవకాశం
పీహెచ్‌డీ ప్రవేశం పొందే సమయానికి
ఏయూలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
మెంబర్‌గా స్టీఫెన్
అది కూడా మరో ఉల్లంఘన
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందారు. ఆయన 2022లో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో పీహెచ్‌డీలో చేరారు. కొద్దిరోజుల కిందట ప్రీ పీహెచ్‌డీ పరీక్షల కోసం దరఖాస్తు చేసినప్పుడు...విభాగాధిపతి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఎగ్జిక్యూటివ్ కోటాలో పీహెచ్‌డీ పట్టా పొందాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏ సంస్థ నుంచి అయితే ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీ ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ సంస్థ టర్నోవర్ కనీసం రూ.50 కోట్లు ఉండాలి. పీహెచ్‌డీ ప్రవేశం పొందే సమయానికి స్టీఫెన్ నగర పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆ సంస్థ టర్నోవర్ ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ ఎగ్జిక్యూటివ్ కోటాలో ఆయనకు పీహెచ్‌డీ ప్రవేశాన్ని కల్పించారు. అదేవిధంగా ఆ ప్రవేశం పొందే సమయానికే స్టీఫెన్ ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. వర్సిటీలోని కీలక పదవిలో ఉంటుండగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందకూడదు. కానీ, ఈ నిబంధనను కూడా ఉల్లంఘించి మరీ ఆయన ప్రవేశాన్ని పొందారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉన్నతాధికారి అండదండలతోనే పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా స్టీఫెన్ పీహెచ్‌డీ ప్రవేశం ప్రస్తుతం హెచ్‌వోడీగా ఉన్న ప్రొఫెసర్‌కు తెలియకుండా జరగడం గమనార్హం. ప్రీ పీహెచ్‌డీ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తును కూడా హెచ్‌వోడీకి తెలియకుండానే ముందుకు పంపించాల్సిందిగా రిజిస్ర్టార్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి.
నిబంధనలు ఉల్లంఘనే..
వర్సిటీలోకి ప్రొఫెసర్ స్టీఫెన్ వచ్చిన దగ్గర నుంచి అనేక ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు స్టీఫెన్ ప్రవేశమే నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఆయన అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్‌గా నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో చేరారు. ఆ తరువాత ఎంతో మందిని సీనియర్లను పక్కనపెట్టి మరీ ట్రాన్స్ డిసిప్లినరీ హబ్‌కు డీన్‌గా వర్సిటీ ఉన్నతాధికారులు నియమించారు. ఇదే టీడీఆర్ హబ్ నుంచి వందలాది మందికి అడ్డగోలుగా ప్రవేశాలు కల్పించారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆ తరువాత వర్సిటీలోని ఎంతోమంది రెగ్యులర్ ప్రొఫెసర్ల సీనియారిటీని పక్కనపెట్టి మరీ ఆయనకు ఉన్నతాధికారులు రిజిస్ర్టార్‌గా బాధ్యతలను అప్పగించారు. ఇది వర్సిటీ చరిత్రలోనే మరో అడ్డగోలు నిర్ణయంగా అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.
Updated Date - Jun 18 , 2024 | 08:15 AM