Kristina Piskova : గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి
ABN, Publish Date - Mar 19 , 2025 | 06:05 AM
యాదిగిరి గుట్ట లక్ష్మీ నృసింహుడి ఆలయంలో శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతోందని ప్రపంచ సుందరి-2024 క్రిస్టినా పిస్జ్కోవా అన్నారు.
‘గుట్ట’ ఆలయ సందర్శన అనిర్వచనీయం: మిస్ వరల్డ్-2024 క్రిస్టినా పిస్జ్కోవా
వైభవంగా యాదగిరి ప్రదక్షిణ.. తరలివచ్చిన 18 వేల మంది భక్తులు
యాదగిరిగుట్ట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): యాదిగిరి గుట్ట లక్ష్మీ నృసింహుడి ఆలయంలో శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతోందని ప్రపంచ సుందరి-2024 క్రిస్టినా పిస్జ్కోవా అన్నారు. మంగళవారం హిందూ సంప్రదాయ రీతిలో అచ్చమైన చీర కట్టుతో వచ్చిన ఆమె.. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తిరువీధుల్లో అఖండ దీపారాధన చేశారు. ఆ తర్వాత వేద పండితులు ఆలయ ముఖ మండపంలో ఆశీర్వచనం చేయగా ఈవో భాస్కర్‌రావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదం అందజేశారు. సనాతన హిందూ ధర్మం, ఆలయ విశిష్టత, సంప్రదాయాలను ఈవో ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని, ఆలయ సందర్శన తనకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని అన్నారు. కాగా, స్వామి జన్మనక్షత్రం (స్వాతి) పురస్కరించుకుని మంగళవారం గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన 18 వేల మంది భక్తులు ప్రదక్షిణలు నిర్వహించారు.
వేకువజామున 3 గంటల నుంచే కొం దరు భక్తులు గిరిప్రదక్షిణ మొదలుపెట్టగా, ప్రత్యేక వేషధారణలో కళాకారుల భజనలు, నృత్యాలు, కీర్తనలతో కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్లు సుమారు 45 నిమిషాల పాటు స్వామివారిని తలుచుకుంటూ భక్తులు ప్రదక్షిణ పూర్తి చేశారు. ఆలయ ముఖమండపంలో వేకువజామున అర్చకులు స్వా తి నక్షత్ర పూజల్లో భాగంగా 108 కలశాలు ఏర్పాటు చేసి పవిత్ర నదీ జలాలు, పంచామృతాలు నింపి పంచసూక్త పఠనాలతో హోమం నిర్వహించారు.
Updated Date - Mar 19 , 2025 | 06:05 AM