ఈ సారైనా తెరుచుకునేనా?
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:51 AM
మండలంలో ఇప్పటివరకు 16 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.ఎందరో మేధావులను, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను, వ్యాపారవేత్తలను అందించిన ప్రభుత్వ పాఠశాలలు నేడు విద్యార్ధులు చేరక మరికొన్ని మూతబడే దశకు చేరుకున్నాయి.
ఈ సారైనా తెరుచుకునేనా?
మూతబడే దశలో మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు
ఇప్పటికే 16 పాఠశాలల్లో జీరో ఎనరోల్‌మెంట్
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
పెద్దఅడిశర్లపల్లి, జూన 22(ఆంధ్రజ్యోతి): మండలంలో ఇప్పటివరకు 16 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.ఎందరో మేధావులను, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను, వ్యాపారవేత్తలను అందించిన ప్రభుత్వ పాఠశాలలు నేడు విద్యార్ధులు చేరక మరికొన్ని మూతబడే దశకు చేరుకున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎనరోల్‌మెంట్ బాగా తగ్గడంతో మండలంలో పలు పాఠశాలలు మూతపడే దశకు చేరుకున్నాయి. పాఠశాలలు బలోపేతం చేయడానికి ఎన్నో రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నా విద్యార్థులు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. మండలంలో కేజీబీవీతో కలిపి నాలుగు ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, 33 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎర్రగుంటతండా కోట్టాలగడ్డ, మూనావతతండాలో 10 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. గడ్డమీదితండా, తూర్పుతండా, ఎస్సీ కాలనీ అజ్మాపురం, నేనావతతండా, పొగాకువారిగూడెం, వడ్డెరగూడెం, మదారిగూడెం, నర్లెంగతండా, పాలపాటితండా, నంబాపురం, ఎల్లాపురం, బానాలకుంట, బూడిదగట్టు, పుట్టంగండి, పావురాలగట్టు పాఠశాలలు మూతపడ్డాయి. గత సంవత్సరం పీఏపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల 70 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 30 మందికి చేరారు. అజ్మాపురం ఉన్నత పాఠశాలలో 86 మంది, వద్దిపట్ల ఉన్నత పాఠశాలలో 126 మంది విద్యార్థులు ఉన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో పిల్లల సంఖ్య తగ్గుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మండలంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో షిప్ట్ (ఇద్దరిలో ఒకరు మాత్రమే పాఠశాలకు వస్తారు) విధానం పాటిస్తున్నట్లు, సమయపాలన పాటించకుండా వారి ఇష్టానుసారంగా వచ్చిపోతుంటారని గ్రామాల్లో తల్లిదండ్రులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్, మిర్యాలగూడ నుంచి రోజు వచ్చిపోతున్న ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. దీంతో సమయపాలన పాటించకుండా ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా పాఠశాలలకు వెళ్లకుండా తన సొంత కార్యక్రమాలు చూసుకుంటున్నారు. దాదాపు అన్ని పాఠశాలలో సెలవులు పెట్టకుండా ఉపాధ్యాయులు డుమ్మాకొట్టి మరుసటి రోజు వచ్చి సంతకాలు చేసుకుంటారన్న విమర్శలు ఉన్నాయి. గత సంవత్సరం రాజకీయ అండతో మండలంలో నెల నెలా జీతం తీసుకుంటూ పట్టణాలకు దగ్గరలోని పాఠశాలలకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిరిగి చివరి రోజు పాఠశాలలకు వచ్చి సంతకాలు చేసినట్లు సమాచారం. విద్యావ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు. పర్యవేక్షణ లోపం ప్రభుత్వ పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. నిపుణులైన ఉపాధ్యాయులు, ఏకరూప దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అమలు చేసినా తల్లిదండ్రులను ఆకర్షించడం లేదు. ఒకరిని చూసి మరొకరు ప్రైవేటుకు పంపించడంతో ఏటికేడు పాఠశాలలు మూతపడుతున్నాయి. సకల వసతులు ఉన్నా చాలాచోట్ల ఉపాధ్యాయులు భారంగా భావిస్తున్నారే తప్ప బాధ్యత మరచి పోతున్నారనే విమర్శలున్నాయి.
ఇలా చేస్తే పూర్వ వైభవం
ఇప్పటివరకు మొత్తం 16 పాఠశాలలు మూతపడ్డాయి. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించాలి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా పర్యవేక్షించాలి. ఏకోపాధ్యాయులు ఉన్న చోట ప్రత్యామ్నాయంగా మరో ఉపాధ్యాయుని సర్దుబాటు చేయాలి.
వివరాలు కలెక్టర్‌కు నివేదించాం
విద్యార్థులు లేని ఉపాధ్యాయుల వివరాలను కలెక్టర్‌కు పంపించాం. ఆ ఉపాధ్యాయులను పక్క పాఠశాల లో సర్దుబాటు చేశాం. పాఠశాలలను మూసివేసే విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాం.
వెంకటయ్య, ఎంఈవో
Updated Date - Jun 23 , 2025 | 12:53 AM