మరమ్మతులు చేసేదెప్పుడో?
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:54 AM
జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబా ద్ జంటనగరాలతో పాటు 516 గ్రామాలకు తాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాల్వలు శిథిలావస్థకు చేరుకోగా ఇరువైపులా కంపచెట్లు పెరిగి ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి.
మరమ్మతులు చేసేదెప్పుడో?
ఆనవాళ్లు కోల్పోతున్న ఏఎమ్మార్పీ కాల్వలు
మరమ్మతులకు రూ.442 కోట్లు మంజూరు
నిధులు మంజూరైనా టెండర్లు పూర్తికాని వైనం
పనులు చేపట్టాలంటున్న ఆయకట్టు రైతులు
దేవరకొండ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబా ద్ జంటనగరాలతో పాటు 516 గ్రామాలకు తాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాల్వలు శిథిలావస్థకు చేరుకోగా ఇరువైపులా కంపచెట్లు పెరిగి ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏఎమ్మార్పీ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. కాల్వల మరమ్మతులకు గాను రూ.442కోట్లు నిధులు కేటాయించినా టెండర్లు పూర్తికాకపోవడంతో మరమ్మతు పనులు ప్రారంభం కాలే దు. దీంతో ఆయకట్టుకు నీటి విడుదల చేసినా నీరు వృథా అయ్యే పరిస్థితి నెలకొందని ఆయకట్టు రైతు లుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్లు పిలిచి మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు కోల్పోతున్నారు.
ఆయకట్టుకు 1800 క్యూసెక్కులు విడుదల
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి వారబం దీ పద్ధతిలో ఆయకట్టు రైతులకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏఎమ్మార్పీ నుంచి ప్రధానకాల్వ ద్వారా ఉదయ సముద్రం వరకు జూలై 28 నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. దీంతో పాటు ఆయకట్టు పరిధిలో 90 చెరువులు, 57 డిస్ర్టీబ్యూటరీలు ఉన్నాయి. ఏఎమ్మార్పీ ద్వారా దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు ప్రధానకాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఏఎమ్మార్పీ నుంచి ప్రతీరోజు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాలకు 525 క్యూసెక్కులు, మిషన భగీరథకు 45 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
శిథిలావస్థలో కాల్వలు, ఏపుగా పెరిగిన కంపచెట్లు
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నీరు ఏకేబీఆర్ నుంచి ఉదయ సముద్రం వరకు ప్రధానకాల్వ 130 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రధాన కాల్వ ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగాయి. డిస్ర్టిబ్యూటరీలు, కాల్వలు శిథిలావస్థకు చేరుకొని ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు 2001లో ప్రారంభించారు. నాలుగు మోటార్ల ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని సాగు, తాగునీటి అవసరాలకు జిల్లాతోపాటు హైదరాబాద్ జంటనగరాలకు నీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యం. కానీ ప్రాజెక్టు ప్రారంభం నుంచి కాల్వల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం, కాల్వలు మరమ్మతులు చేపట్టకపోవడంతో కాల్వలు, డిస్ర్టిబ్యూటరీలు, కంపచెట్లు పెరిగి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. శ్రీశైలం సొరంగమార్గం, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల, ఏఎమ్మార్పీ, నక్కలగండి, పెండ్లిపాకల ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మూడేళ్లలో ప్రాజెక్టులను పూర్తిచేసి నల్లగొండ జిల్లా ప్రజలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అందులో భాగంగా కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఏఎమ్మార్పీ కాల్వలను మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను రూ.442 కోట్లు కేటాయించింది. కానీ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఏఎమ్మార్పీ నుంచి ప్రస్తుతం ఖరీఫ్ సీజనకు వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురవడం, శ్రీశైలం నుంచి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయడంతో సాగర్ నిండింది. దీంతో అధికారులు ముందస్తుగానే ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.
కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి
ఏఎమ్మార్పీ కాల్వలకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు తాగునీటికి నీరు విడుదల చేస్తున్నా వృథాగా పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్నేళ్లు గా అధికారులు ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. కంపచెట్లు తొలగించి మరమ్మతులు చేపట్టాలి.
- నామిరెడ్డి రవీందర్‌రెడ్డి, తిరుమలగిరి, పీఏపల్లి
రెండు పంటలకు సాగునీరు అందించాలి
ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నుంచి రెండు పంటలకు సాగునీరు అందించాలి. ప్రాజెక్టు కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి. ప్రాజెక్టుపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ప్రభుత్వం నిధులు కేటాయించి కాల్వలకు మరమ్మతులు చేసి కంపచెట్లను తొలగించాలి.
- అంతిరెడ్డి, రైతు, పీఏపల్లి
త్వరలో మరమ్మతు పనులు చేపడుతాం
ఏఎమ్మార్పీ కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. త్వరలో టెండర్లు పూర్తిచేసి మరమ్మతులు చేపడుతాం. ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తాం. నీటిని వృథా చేయవద్దు.
- సత్యనారాయణ, ఈఈ, ఏఎమ్మార్పీ డివిజన4
Updated Date - Aug 04 , 2025 | 12:54 AM