కల సాకారమయ్యే వేళ.. మృత్యుఒడికి
ABN, Publish Date - May 15 , 2025 | 12:23 AM
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆ యువతి అన్నింటా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. ఉన్నత చదువులు చదివి గ్రామానికి పేరుప్రతిష్ఠలు తీసుకువస్తానని తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. డిగ్రీ, పీజీ సైతం తనకు మక్కువైన వ్యవసా య కోర్సు చేసింది.
తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తానని అమెరికాకు
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా తీవ్ర అనారోగ్యం
తల్లిదండ్రుల మాట నెరవేరకుండానే మృత్యువాత
విగత జీవిగా వచ్చిన కుమార్తె పార్థి వదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు
పందెనపల్లి గ్రామంలో విషాదఛాయలు
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆ యువతి అన్నింటా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. ఉన్నత చదువులు చదివి గ్రామానికి పేరుప్రతిష్ఠలు తీసుకువస్తానని తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. డిగ్రీ, పీజీ సైతం తనకు మక్కువైన వ్యవసా య కోర్సు చేసింది. అమెరికా వెళ్లి ఉన్నత విద్య పూర్తిచేసింది. అనుకున్న లక్ష్యం సాధించిన ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా విధి వక్రించింది. తీవ్ర అనారోగ్యాని కి గురై ఆమెరికాలో మృత్యువాత పడింది. తమకు అండగా ఉంటానని మాట ఇచ్చి విగత జీవిగా వచ్చిన కుమార్తె పార్థివదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లి గ్రామానికి చెంది న కొండి వెంకట్‌రెడ్డి శోభారాణి దంపతుల కుమార్తె ప్రియాంక ది ఈ విషాధ గాధ.
- (ఆంధ్రజ్యోతి, కట్టంగూరు)
పందెనపల్లికి చెందిన కొండి వెంకట్‌రెడ్డి, శోభారా ణి దంపతులకు కుమారుడు, కుమార్తె ప్రియాంక (26) ఉన్నారు. వెంకటరెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రియాంక 10వ తరగ తి వరకు నకిరేకల్‌లోని ఏవీఎం పాఠశాలలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని గాయత్రి కళాశాలలో పూర్తి చేసింది. ఢిల్లీలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసి అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చేసేందుకు అమెరికాలోని అలబామా రాష్ట్రం యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో 2023 సంవత్సరం జనవరిలో చేరింది. పీజీ పూర్తిచేసి పార్ట్‌టైం వర్క్‌చేస్తూ కన్సల్టెంట్ ద్వారా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఈ నెల 4వ తేదీన తండ్రి కొండి వెంకట్‌రెడ్డి అలబామాలో ఉన్న కుమార్తె ప్రియాంకకు ఫోన్ చేయగా, దంత సంబంధిత అనారోగ్యంతో మూడు రోజులుగా అస్వస్థతగా ఉందని చెప్పింది. ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఈ అనారోగ్య సమస్య చికి త్సకోసం ఎక్కువ ఖర్చయిందని, ఇన్సూరెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నానని చెప్పింది. మరుసటిరోజే ఇన్సూరెన్స్ అప్రూవల్ కాపీని తీసుకుని అక్క డి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. ప్రియాంకను పరీక్షించిన వైద్యులు ఆమెకు బ్లడ్ ఇన్‌ఫెక్షన్ ఉందని, ఆసుపత్రిలో చేరాలని సూచించారు. తాత్కాలికంగా నొప్పి నివారణ కోసం మాత్రలు వేసుకుని స్నేహితుల ఇంటికి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 6వ తేదీన స్నా నం చేసేందుకు వెళ్లిన ప్రియాంక స్నానాల గదిలోనే అకస్మాత్తుగా పడిపోయింది. స్నేహితులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రియాంకకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సమీపంలోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించిన వైద్యులు ఆమె బ్రెయిన్‌డెడ్ అయిందని నిర్థారించారు. మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తం మెదడులో వ్యాపించిందని తెలిపారు. వెంటిలేటర్ అమర్చి ఒకరోజు వైద్యం అందించారు. తల్లిదండ్రులు, ప్రియాంక బంధువులతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం అక్కడి వైద్యులు వెంటిలేటర్ తీసివేయడంతో ప్రియాంక ఈ నెల 8వ తేదీన మృతిచెందింది.
పొలం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా
ఉన్నత చదువుల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లి చదివిన ప్రియాంక సెలవు రోజుల్లో స్వగ్రామం పందెనపల్లికి వచ్చి తండ్రితో పాటు పొలం పనులు చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేది. తాను ఉన్నత విద్యను అభ్యసిస్తున్నానన్న గర్వం లేకుండా పొలానికి వచ్చిన కూలీలతో కలిసి వరినాట్లు వేసేది. అంతేకాక తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండేది. 2023 మే 7న జరిగిన తన సోదరుడు గణే్‌షరెడ్డి వివాహానికి వచ్చిన ప్రియాంక 18 రోజులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడి స్నేహితులతో సరదాగా గడిపింది. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చదివేందుకు మంచి యూనివర్సిటీలో సీటు వచ్చిందని, ఖచ్చితంగా ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కోరిక నెరవేరుస్తానని చెప్పింది.
ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు
ప్రియాంక అంత్యక్రియలు పందెనపల్లిలో బుధవారం ముగిశాయి. అమెరికా నుంచి ప్రియాంక మృతదేహం గ్రామానికి చేరుకున్నాక గ్రామస్థుల సందర్శనార్థం ఆమె ఇంటి వద్ద ఉంచారు. ప్రియాం క మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరును చూసి గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రియాంక తమతో ఆప్యాయంగా ఉండే క్షణాలను గుర్తుచేసుకుని గ్రామస్థులు భావోద్వేగం చెందారు. అశృనయనాల మధ్య అంతిమయాత్ర సాగింది. వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు ప్రియాంక మృతదేహానికి తండ్రి వెంకట్‌రెడ్డి తల కొరివి పెట్టారు. గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
Updated Date - May 15 , 2025 | 12:23 AM