kumaram bheem asifabad- దేశానికి ఆదర్శంగా సంక్షేమ పథకాలు
ABN, Publish Date - Aug 01 , 2025 | 11:06 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలతో కలిసి నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు
కౌటాల, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలతో కలిసి నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు విషయంలో ప్రజా ప్రభుత్వం దేశానికి ఆదర్శకంగా నిలిచిందన్నారు. గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. నేడు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు వస్తాయన్నారు. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ప్రజా ప్రభుత్వం నిత్యం పాటు పడుతుందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ కల్పించామని తెలిపారు. మహిళలకు ప్రధాన్యత ఇస్తూ మహిళా సమాఖ్య సంఘాల ద్వారా మహిళలకు అద్దె బస్సులను ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, తహసీల్దార్ ప్రమోద్, ఏడీఏ మనోహర్, డీసీఎస్‌ఓ సాదీక్ తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ రైతే వేదికలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కల్టెర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలతో కలిసి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అన్నారు. అర్హులైన పేద వారికి రేషన్ కార్డులు అందించి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో భాగంగా చేపట్టిన సంక్షేమ పథకాలలో రేషన్ కార్డుల జారీ ఒకటి అని అన్నారు. సుదీర్ఘకాలం తరువాత రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే రాయితీ గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు అమలు చేస్తూ మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందిస్తామని, అర్హత కలిగిన రేషన్ కార్లుల్లో పేరు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే రెవెన్యూ సిబ్బంది ద్వారా సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతి, తహసీల్దార్ దౌలత్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, సహయ పౌర సరఫరాల అధికారి సాధీక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 11:06 PM