కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ABN, Publish Date - May 08 , 2025 | 12:30 AM
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్ధామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపు నిచ్చారు.
నల్లగొండ రూరల్, మే 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్ధామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపు నిచ్చారు. స్థానిక దొడ్డికొమరయ్య భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పని చేస్తోందన్నారు. వందేళ్ల క్రితం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొస్తోందన్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కును కాలరాస్తున్నారన్నారు. 9గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కార్మిక ఐక్య పోరాటలను ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశ వ్యాపిత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మె విజయవంతానికి ప్రచారం నిర్వహించాలన్నారు. కార్మిక వాడల్లో, పని ప్రదేశాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు డి. మల్లేష్, ఎండి సలీం, అవుతా సైదయ్య, సహాయ కార్యదర్శులు నల్ల వెంకటయ్య, మల్లు గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 12:30 AM