Hyderabad: దిగొచ్చిన బీర్ల కంపెనీ
ABN, Publish Date - Jan 21 , 2025 | 04:10 AM
రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచాలని బెట్టు చేసి, బకాయిలు ఇస్తే తప్ప పనులు చేయలేమంటూ దాదాపు రెండు వారాల క్రితం ఉత్పత్తులు నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) ఎట్టకేలకు దిగొచ్చింది.
రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తి పునఃప్రారంభిస్తాం
యునైటెడ్ బ్రూవరీస్ వెల్లడి
ధరలు పెంచాలని, బకాయిలివ్వాలని
ప్రభుత్వానికి తొలుత యూబీ డిమాండ్
ఉత్పత్తులు నిలిపివేస్తున్నట్లు 8న ప్రకటన
ప్రభుత్వ కఠిన వైఖరితోనే వెనక్కి తగ్గిన సంస్థ
కొత్త కంపెనీలొస్తే వాటా పోతుందనే గుబులు
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచాలని బెట్టు చేసి, బకాయిలు ఇస్తే తప్ప పనులు చేయలేమంటూ దాదాపు రెండు వారాల క్రితం ఉత్పత్తులు నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) ఎట్టకేలకు దిగొచ్చింది. రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తిని వెంటనే పునఃప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సోమవారం సమాచారమిచ్చింది. యూబీ కంపెనీ బీర్ల ఉత్పత్తిని నిలిపివేసినా ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడం, పైగా రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడకుండా కొత్త మద్యం కంపెనీలకు అవకాశం ఇవ్వాలని ఆదేశించడంతో యూబీ కంపెనీ పునరాలోచనలో పడింది. 2019 నుంచి బీర్ల తయారీదారులకు ప్రభుత్వం చెల్లించే ధరను పెంచలేదని, ఫలితంగా నిర్వహణ వ్యయం భారీగా పెరిగిందని, అలాగే రూ. 659 కోట్ల బకాయిలు చెల్లించడంలో సర్కారు జాప్యం చేస్తోందని ఈనెల 8న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు యూబీ తెలిపింది. అదేరోజు.. తెలంగాణలో బీర్ల ఉత్పత్తిని వెంటనే నిలిపివేస్తున్నట్లూ సమాచారమిచ్చింది.
రాష్ట్రంలోని మొత్తం బీర్ల విక్రయాల్లో యూబీ కంపెనీ వాటా 70శాతం! బీరు ప్రియులు అమితంగా ఇష్టపడే కింగ్‌ఫిషర్ బీర్లు ఉత్పత్తిచేసేది ఈ సంస్థే. అయితే.. బీర్ల ఉత్పత్తిని యూబీ నిలిపివేసినా తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీబీసీఎల్) వద్ద మరో 20 రోజులకు సరిపడా యూబీ బీర్ల నిల్వలు ఉండటం, ఫలితంగా బీరు ప్రియులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. బీర్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లుగా యూబీ ప్రకటించిన తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విడతలవారీగా బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశిస్తూనే.. బీర్ల తయారీ దారులకు చెల్లించే ధర పెంపుపై కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడకుండా కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాలని, నెలరోజుల్లో కొత్త బ్రాండ్ల ఉత్పత్తి ప్రారంభించాలనీ ఆదేశించారు.
ప్రభుత్వ నిర్ణయంతో యూబీ అప్రమత్తమైంది. రాష్ట్రంలో 70శాతం వాటాను కోల్పోతే, మొత్తం వ్యాపారంపైనే తీవ్ర ప్రభావం పడుతుందని కంపెనీ భావించింది. తెలంగాణ మెజారిటీ వాటా ఉన్న కంపెనీ.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం బీర్ల విక్రయాల్లో తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. గతంలో అనేక రాష్ట్రాల్లో మెజారిటీ వాటా ఉన్నప్పటికీ.. క్రమక్రమంగా ఇతర కంపెనీలతో పోటీ పెరగటంతో యూబీ మార్కెట్ షేర్ భారీగా తగ్గింది. మెట్టు దిగకపోతే తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే రావచ్చునని ఆందోళన చెందిన కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు దిగింది. కంపెనీ ఉన్నతస్థాయి ప్రతినిధులు ఎక్పైజ్ శాఖ మంత్రితోపాటు టీజీబీసీఎల్ ఉన్నతాధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. బకాయిలు విడతలవారీగా చెల్లిస్తామని, ఉత్పత్తి నిలిపేయాలన్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన కంపెనీ.. ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించింది. రానున్న వేసవికి సరిపడా బీర్ల ఉత్పత్తికి టీజీబీసీఎల్ ప్రణాళికలు అమలుచేస్తోంది.
Updated Date - Jan 21 , 2025 | 04:10 AM