kumaram bheem asifabad- గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం
ABN, Publish Date - Jul 15 , 2025 | 10:49 PM
గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయమంత్రి హర్ష మల్హోత్రా అన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ నిధులు రూ. కోటి యాభై లక్షలతో నిర్మించిన కేంద్ర గ్రంథాలయాన్ని, ఎంపీడీవో కార్యాలయ అవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని, మండలంలోని తుంపల్లి గ్రామంలో జల్ జీవన్ మిషన్ కింద నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు.
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్, జూలై 15(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయమంత్రి హర్ష మల్హోత్రా అన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ నిధులు రూ. కోటి యాభై లక్షలతో నిర్మించిన కేంద్ర గ్రంథాలయాన్ని, ఎంపీడీవో కార్యాలయ అవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని, మండలంలోని తుంపల్లి గ్రామంలో జల్ జీవన్ మిషన్ కింద నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నిర్ణీత సమయంలో పథకాలు లబ్ధిదారులకు చేరే విధంగా అదికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలో అమలు చేసేందుకు, అర్హులకు లబ్ధి చేకూరే విధంగా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 117 అస్పిరేషనల్ జిల్లాలను గుర్తించిందని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా కూడా అందులో ఎంపికైందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పం ప్రకారం ప్రతి అస్పిరేషనల్ జిల్లాలో నీతి ఆయోగ్ ద్వారా గిరిజనులకు మౌలిక వసతుల కల్పనకు క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు కేంద్ర మంత్రులు పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో భాగంగా పీవీటీజీ గిరిజనుల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ జల్ మీషన్ కింద శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పనిని కూలీలకు కల్పించాలని ప్రదానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద మంజూరైన రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పోషణ్ అభియాన్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహరం అందించాలన్నారు. అంతకు ముందు గ్రంథాలయంఆవరణలో మొక్కలు నాటారు. సంక్షేమ పథకాల పని తీరుపై లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలోకలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఏఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్ల, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీష్‌బాబు పాల్గొన్నారు.
వినతుల వెల్లువ..
జిల్లాలో కన్జర్వేషన్ రిజర్వ్ టైగర్ కారిడార్ ఏర్పాటు కోసం తీసుకు వచ్చిన జీవో 49ని రద్దు చేయాలని, జిల్లాలో అటవీశాఖ అనుమతులు లేకుండా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వాటికి అనుమతులు ఇప్పించాలని వినతిపత్రాలు అందజేశారు. అస్పిరేషన్ ప్రాంతమైన తిర్యాణి మండలంలో వంతెనలు, కల్వర్టులు, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కేంద్ర మంత్రికి విన్నవించారు. కరోనా సమయం నుంచి జర్నలిస్టులకు నిలిపివేసిన 50 శాతం రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధంచాలని, టోల్‌టాక్స్‌లో మినహాయింపు ఇవ్వాలని జర్నలిస్టులు కేంద్రమంత్రికి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్టును ఏర్పాటును విరమించుకోవాలని జీవో 49 రద్దు చేయాలని సీపీఎం నాయకులు దినకర్, శ్రీనివాస్, రాజేందర్, మాలశ్రీ, కార్తీక్ వినతపత్రం అందజేశారు.
Updated Date - Jul 15 , 2025 | 10:49 PM