Exam Results: మార్చి మొదటి వారంలో గ్రూప్-1 ఫలితాలు!
ABN, Publish Date - Feb 18 , 2025 | 04:01 AM
గ్రూప్-1, 2, 3 పరీక్షల ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) సిద్ధమైంది. లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలను మరో రెండు వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది.
ఆ వెంటనే గ్రూప్-2, 3 కూడా..
మొత్తం 2,734 పోస్టులకు 5,51,247 మంది పోటీ
గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 37 మంది పోటీ
గ్రూప్-2లో 1:329, గ్రూప్-3లో 1:196
ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1, 2, 3 పరీక్షల ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) సిద్ధమైంది. లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలను మరో రెండు వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. మార్చి మొదటి వారంలో గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి.. ఆ తర్వాత గ్రూప్-2, ఆపైన గ్రూప్-3 ఫలితాలను విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఒకే అభ్యర్థి రెండుమూడు పోస్టులకు ఎంపికై.. ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరో పరీక్ష ఫలితాలకు సిద్ధమైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో గ్రూప్-1 ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలు విడుదలవుతాయి. ఈ మూడు పరీక్షలకు సంబంధించి 2,734 పోస్టులకు గాను 5,51,247 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
రాష్ట్రంలో తొలి గ్రూప్-1
తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. ఎన్నో బాలారిష్టాలను దాటుకుని మొదటి సారి గ్రూప్-1 పరీక్షలు సజావుగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. నిజానికి 2022లో 503 పోస్టుల భర్తీకి తొలిసారి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలవ్వగా.. అదే ఏడాది అక్టోబరులో ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. జనవరిలో పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో.. ఆ పరీక్షను రద్దుచేసి, 2023 జూన్‌లో నిర్వహించారు. అయితే.. బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది. 2023 డిసెంబరులో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యాక.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా జాబ్‌క్యాలెండర్‌కు కసరత్తు జరిగింది. అయితే.. అప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దవ్వడంతో.. 2024 ఫిబ్రవరిలో మరో 63 పోస్టులను కలిపి.. మొత్తం 563 ఉద్యోగాలకు గాను తాజా నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా.. 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్‌కు 31,382 మంది అర్హత సాధించగా.. అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం.. అన్ని పరీక్షలకు హాజరైన వారి పత్రాలనే వాల్యుయేషన్‌కు పరిశీలిస్తారు. ఇలా 21,093 మంది మాత్రమే అన్ని పరీక్షలను రాశారు. అంటే.. పోటీ 1:50 నుంచి 1:37కు తగ్గినట్లయింది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి మొదటి వారంలో విడుదల చేసి.. 1:2 ప్రాతిపదికన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారని సమాచారం.
గ్రూప్-2లో తగ్గిన హాజరుశాతం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో గ్రూప్-2 పరీక్షలు జరిగినా.. ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. గత సర్కారు హయాంలోనే 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైనా.. పేపర్‌లీకేజీల గందరగోళంతో ఒకసారి.. నిరుద్యోగుల డిమాండ్‌తో మరోసారి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,358 కేంద్రాల్లో ఈ పరీక్షల(నాలుగు పేపర్లు)ను నిర్వహించారు. రెండేళ్లుగా వాయిదాలు పడడంతో.. 5,51,855 మందికి గాను 74.96ు మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే.. నాలుగు పరీక్షలకు 2,57,981(46ు) మంది మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన గ్రూప్-2లో మొత్తం 783 పోస్టుల్లో ఒక్కోదానికి 329 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వ హయాంలోనే విడుదలవ్వగా.. పరీక్షల తేదీలను వెంటనే ప్రకటించలేదు. గత ఏడాది నవంబరులో ఈ పరీక్షలు(మూడు పేపర్లు) జరగ్గా.. 6,15,503 మంది అభ్యర్థులకు గాను.. 2,72,173 మంది హాజరయ్యారు. ఈ లెక్కన 1,388 పోస్టుల్లో ఒక్కోదానికి 196 మంది పోటీపడుతున్నారు. గ్రూప్-1 తర్వాత.. వరుసగా గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలను విడుదల చేయనున్నారు.
వ్యూహాత్మకంగా ఫలితాలు
గ్రూప్స్ పరీక్షల్లో ప్రభుత్వం ప్రకటించిన కొలువులన్నీ భర్తీకావడం ఓ సవాల్‌గా ఉండడం ఆనవాయితీ. ఇందుక్కారణం గ్రూప్-4, 3 వంటి వాటి ఫలితాలను ముందుగా ప్రకటించి, ఆ తర్వాత పెద్ద కొలువుల ఫలితాలను ప్రకటించడమే..! తొలుత ప్రకటించిన ఫలితాల్లో చిన్న పోస్టుల్లో చేరిన వారు.. ఆ తర్వాత గ్రూప్-2 లేదా గ్రూప్-1కు ఎంపికై.. పాత కొలువలను వీడుతున్నారు. దీంతో.. మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ సారి ఆ సమస్య లేకుండా ఉండేందుకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందుకే.. తొలుత గ్రూప్-1 ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత గ్రూప్-2, 3 ఫలితాలను ప్రకటించడం వల్ల ఖాళీల సమస్య ఉండకపోవచ్చని భావిస్తోంది.
Updated Date - Feb 18 , 2025 | 04:01 AM