Bhatti Vikramarka: ఆదాయం వచ్చే పరిశ్రమలు రాష్ట్రం దాటొద్దు
ABN, Publish Date - May 26 , 2025 | 04:21 AM
తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
ప్రతి శనివారం ఇన్వె్‌స్టమెంట్ ప్రమోషన్ సబ్ కమిటీ భేటీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హ్యుందాయ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు ఆమోదం
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్, ఇప్పటికే చేసుకున్న ఎంవోయూల అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఒక పరిశ్రమ స్థాపిస్తే దానికి అనుబంధంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలని, వాటిని త్వరితగతిన ఆచరణలోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఇకనుంచి ప్రతి శనివారం ఇండస్ట్రియల్, ఇన్వె్‌స్టమెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహిద్దామని చెప్పారు. జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హ్యుందాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ సెంటర్ స్థాపనకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. 675 ఎకరాల్లో రూ.8528 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ రాష్ట్రానికి రావడం గొప్ప విజయంగా సబ్ కమిటీ అభిప్రాయపడింది. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో 4276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు సమావేశంలో వివరించారు.
Updated Date - May 26 , 2025 | 04:21 AM