Bhu Bharati: ‘భూ భారతి’ భూములకే భరోసా
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:17 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతుభరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
సాగు యోగ్యమైతేనే పెట్టుబడి సాయం
రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతుభరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిని ఈ నెల 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. పథకానికి ఎవరు అర్హులు, ఎలా అమలు చేయనున్నామనే వివరాలు తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ భారతి (ధరణి) పోర్టల్‌లో నమోదై ఉండి, వ్యవసాయ యోగ్యమైన భూమికి.. దాని విస్తీర్ణం ఆధారం గా పట్టాదారులకు పెట్టుబడి సాయం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్వోఎ్‌ఫఆర్ పట్టాదారులకూ సాయం అందించనుంది. ఎకరానికి ఏటా రూ.12 వేల (సీజన్‌కు రూ.6 వేల) చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.
సాగుకు యోగ్యంకాని భూములు ఉంటే వాటిని ‘రైతు భరోసా’ జాబితా నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. కాగా, సాంకేతికంగా ఈ పథకం అమలు బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) నిర్వహించనుంది. ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటి పరిష్కారానికి జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియను వ్యవసాయ శాఖ పర్యవేక్షించనుంది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించనున్నామని ఉత్తర్వులో తెలిపింది. దీని ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతుకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతోపాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించేందుకు వీలు కల్పించవచ్చని పేర్కొంది.
Updated Date - Jan 13 , 2025 | 04:17 AM