Sridhar Babu: జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు:దుద్దిళ్ల
ABN, Publish Date - Feb 01 , 2025 | 04:13 AM
తెలంగాణను ‘స్కిల్స్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చిదిద్దేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ‘స్కిల్స్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చిదిద్దేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో ‘డార్క్ మేటర్ టెక్నాలజీస్’ పేరిట కెనడాకు చెందిన ‘‘కన్సల్టేషన్ సాఫ్ట్‌వేర్’’ ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీసీసీలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయని, ఈ ఏడాది వాటి విలువ 46 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లుగా ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారన్నారు.
వచ్చే ఏడాది 60 బిలియన్ డాలర్లు, 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జీసీసీలపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంలో వీటిని భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను జీసీసీల హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 400 జీసీసీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
Updated Date - Feb 01 , 2025 | 04:13 AM