Passport Award: తెలంగాణ పోలీస్.. భేష్
ABN, Publish Date - Jun 25 , 2025 | 07:07 AM
పాస్‌పోర్టు దరఖాస్తుల ధ్రువీకరణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ పోలీసులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంస
పాస్‌పోర్టు ధ్రువీకరణలో‘వెరీఫాస్ట్’కు జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ, హైదరాబాద్, సికింద్రాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): పాస్‌పోర్టు దరఖాస్తుల ధ్రువీకరణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ పోలీసులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పురస్కారాన్ని ప్రదానం చేసింది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్టు సేవాదివస్ కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరిటా నుంచి ఈ పురస్కారాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరక్టర్ జనరల్ బి. శివధర్‌రెడ్డి స్వీకరించారు. 2024-25 లో తెలంగాణ పోలీసులు 8,06,684 పాస్‌పోర్టుల ధ్రువీకరణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ధ్రువీకరణలన్నీ 15 రోజుల లోపే జరిగాయి. ఈ క్రమంలో పాస్‌పోర్టు ధ్రువీకరణలకు తీసుకున్న సగటు సమయాన్ని ఏడు రోజుల్లోపు తగ్గించిన ఘనతను తెలంగాణ పోలీసులు సాధించారు. వారు అభివృద్ధి చేసుకున్న సత్యాపన్, వెరీ ఫాస్ట్ సాఫ్ట్‌వేర్ లు ఇందులో కీలకపాత్ర పోషించాయి. పాస్‌పోర్టు ధ్రువీకరణను వేగంగా చేయడంలో ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులకు ఆరు పురస్కారాలు లభించాయి.
హైదరాబాద్ పాస్‌పోర్టు ఆఫీసుకు జాతీయ పురస్కారం
పాస్‌పోర్టు సేవల్లో సంస్కరణలకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి జాతీయ పురస్కారం దక్కింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి పబిత్ర మార్గరిటా చేతులమీదుగా ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి (ఆర్పీవో) స్నేహా జొన్నలగడ్డ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రతీ గురువారం ప్రజా ఫిర్యాదుల దినం నిర్వహణ, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, సైబర్ నేరాలపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఈ పురస్కారాన్ని అందించారు. కొత్తగా ప్రారంభించిన ఫిర్యాదుల దినంతో పెండింగు సమస్యలు వేగంగా పరిష్కరిస్తున్నామని, ప్రజలకు సేవలు వేగవంతంగా అందుతున్నాయని ఈ సందర్భంగా స్నేహ జొన్నలగడ్డ తెలిపారు.
Updated Date - Jun 25 , 2025 | 07:09 AM