Greenfield Road: మంచిర్యాలకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు
ABN, Publish Date - May 26 , 2025 | 03:27 AM
హైదరాబాద్-మంచిర్యాల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి మూడు ప్రతిపాదనల్లో మూడోది సీఎం ఆమోదం పొందింది. ప్రస్తుత రాజీవ్ రహదారికి భద్రమైన ప్రత్యామ్నాయంగా కొత్త రహదారి రూపొందించనున్నారు.
ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మూడు ప్రతిపాదనలు
ఆర్‌ఆర్‌ఆర్ అవతల నుంచి మంచిర్యాల వరకు నిర్మాణం
శామీర్‌పేట వరకు రేడియల్ రోడ్డు నిర్మించేలా ప్రణాళిక
పీపీపీ విధానంలో నిర్మితమైన ప్రస్తుత హెచ్‌కేఆర్ రోడ్డు
ఆ కాంట్రాక్టు సంస్థతో చర్చించే ఆలోచనలో ప్రభుత్వం
త్వరలో నిర్ణయం.. కేంద్ర ప్రభుత్వానికీ నివేదిక
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి (హెచ్‌కేఆర్ రోడ్డు)కి ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాజీవ్ రహదారిగా పిలిచే ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా రెండు వైపులా కలిపి మూడు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుత రోడ్డు హైదరాబాద్ నగరంలోని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) దగ్గర 17వ నంబరు ఎగ్జిట్ వద్ద నుంచి నాలుగు వరుసలతో ఉంది. అయితే నగరం నుంచి శామీర్‌పేట వరకు వెళ్లేందుకు, ఆ తరువాత మంచిర్యాల వరకు వెళ్లేందుకు కూడా ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. పైగా ఈ రోడ్డు మలుపులు తిరిగి ఉండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దాంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), ఆర్‌అండ్‌బీ శాఖ కలిసి ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారికి మూడు ప్రత్యామ్నాయ మార్గాలతో రూట్‌మ్యాప్ సిద్ధం చేశాయి. ఆ మూడు ప్రతిపాదనలను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో వివరించారు. వాటిలో ఒకదానికి సీఎం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్టు తెలిసింది.
ప్రైవేటుకాంట్రాక్టర్ ఆధీనంలో ప్రస్తుత రోడ్డు
హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు 207 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలతో ఉన్న ప్రస్తుత రోడ్డు.. ప్రైవేటు కాంట్రాక్టర్ ఆధీనంలో ఉంది. ఉమ్మడి ఏపీలో 2010లో ఈ రోడ్డు నిర్మాణం, నిర్వహణ కోసం అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ టెండర్ పిలిచింది. పీపీపీ విధానం కింద ఈ పనులను ఓ సంస్థ దక్కించుకోగా.. ఉమ్మడి ఏపీలోనే 25 ఏళ్ల వరకు సదరు సంస్థకు రోడ్డు నిర్వహణను అప్పగించారు. దాని ప్రకారం 2036 ఫిబ్రవరి 14 వరకు టోల్ వసూలు, రోడ్డు మెయింట్‌నెన్స్ అంతా ఆ సంస్థే చూసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆ సంస్థ పరిధిలోనే రోడ్డును పర్యవేక్షిస్తున్నారు. కాగా, 2017-18 సంవత్సరంలో ఆ రోడ్డుపై టోల్ వసూలు ద్వారా రూ.114 కోట్లు వచ్చినట్టు ఆర్థిక సంవత్సర గణాంకాల్లో సదరు సంస్థ తెలిపింది.
ప్రస్తుతం వాహనాల సంఖ్య పెరగడంతో.. టోల్ వసూలు కూడా రెట్టింపు అయిందని ఆర్‌అండ్‌బీ అధికారులు అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిన మేరకు మంచిర్యాల వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించాలంటే ప్రస్తుత రోడ్డును మెయింట్‌నెన్స్ చేస్తున్న సంస్థతో కూడా చర్చించి, నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉందని తెలిసింది. ఈ మేరకు సదరు సంస్థతో చర్చించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు, అనంతరం పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రానికీ పంపనున్నట్టు తెలిసింది. ఈ రోడ్డుపై ప్రస్తుతం మూడు టోల్‌ప్లాజాలు ఉన్నాయి.
మూడో ప్రతిపాదనకు ఆమోదం.!
హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా నిర్మించదలచిన కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం 3 ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సమీక్షలో సీఎం రేవంత్‌కు నివేదించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి..
ఆప్షన్-1: ప్రస్తుత రోడ్డుకు ఎడమవైపున 188 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 17 దగ్గర శామీర్‌పేట నుంచి మొదలై తుర్కపల్లి- వర్గల్- ఎన్‌హెచ్-161ఏఏ- చెప్యాల- ఎన్‌హెచ్-765 డీజీ-దుబ్బాక- స్టేట్ హైవే-11 (హరిదా్‌సనగర్)- కోనాయిపల్లి- ఎన్ హెచ్-563 (కురిక్యాల)- దాతోజీపేట- అంతర్గాం మీదుగా మంచిర్యాల దగ్గరున్న ఎన్‌హెచ్-63 అనుసంధానమవుతుంది. మూల మలుపులు పెద్దగా ఉండవు. శామీర్‌పేట చెరువు, అప్పర్ మానేరు డ్యామ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో నిర్మించాల్సి ఉన్నందున నిర్మాణ వ్యయం అధికమవుతుందని అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా ఆప్షన్-1 మార్గం నిర్మాణానికి రూ. 4,700 కోట్లు కావాల్సి ఉంటుందని తెలిపారు.
ఆప్షన్-2: ఇది కూడా శామీర్‌పేట నుంచే ఉండగా.. నారాయణపూర్- ఎర్రవల్లి- ఎన్‌హెచ్-161ఏఏ- తిమ్మాపూర్- కొమురవెల్లి- ఎన్‌హెచ్-365బీ క్రాసింగ్- అంకుశాపూర్- నగునూర్- బస్వాపూర్ (ఎన్‌హెచ్-765 డీజీ)- నవాబ్‌పేట- చిగురుమామిడి- తడికాల (ఎన్‌హెచ్-563)- మానేరు రివర్ క్రాసింగ్- కొలనూర్- వెన్నంపల్లి- ఏదులాపురం- లక్కారం నుంచి పుట్టపాక (ఎన్‌హెచ్-163జీ)-కిస్టాపూర్- శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాల దగ్గరున్న ఎన్‌హెచ్-63కి అనుసంధానం చేస్తారు. గ్రీన్‌ఫీల్డ్ విధానంలో 160కి.మీ, జాతీయ రహదారుల అనుసంధానంగా మరో 46 కి.మీతో రోడ్డు నిర్మాణం ఉంటుంది. ఈ మార్గంలో కొంతమేర అటవీ భూమి కావాల్సి ఉండగా.. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు.
ఆప్షన్-3: ఈ రోడ్డు శామీర్‌పేట నుంచి మొదలై నారాయణపూర్-కొమురవెల్లి దగ్గర ఎన్‌హెచ్-365బీ వరకు ఆప్షన్-2లో ఉన్న విధంగానే ఉండగా.. చేర్యాల దగ్గరి నుంచి భైరాన్‌పల్లి - కన్నారం- ముల్కనూర్- ఎల్కతుర్తి (ఎన్‌హెచ్-765డీజీ)- ఎన్‌హెచ్-563 క్రాసింగ్- కమలాపూర్- మర్రిపల్లిగూడెం- టేకుమట్ల (ఇక్కడ జాతీయ రహదారి 163జీ కలుస్తుంది). ఆ తరువాత మానేరు డ్యామ్ క్రాస్ అయి.. ముత్తారం-పుట్టపాక (ఎన్‌హెచ్-163జీ)- కిస్టాపూర్- శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాలకు దగ్గర్లోని ఎన్‌హెచ్-63కి కలుపుతారు. దీని నిర్మాణానికి రూ.3వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుంద ని తెలిపారు. అదే విధంగా మూడు ఆప్షన్‌లలో ఇదే ఉత్తమంగా ఉందని కూడా పేర్కొన్నారు. దాంతో మూడో ఆప్షన్‌గా ఉన్న ఈ రూట్‌మ్యా్‌పకే సూత్రప్రాయ ఆమోదం లభించినట్టు తెలిసింది.
హెచ్‌కేఆర్-ఆర్‌ఆర్‌ఆర్ మధ్య నిర్మాణం!
ప్రస్తుత రోడ్డు.. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబరు 17 దగ్గరున్న శామీర్‌పేట-తూంకుంట నుంచి వెళ్తుండగా, తూంకుంట తరువాత వచ్చే గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పరిధిలో రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం రోడ్డు నిర్మాణం కానుంది. దాంతో ఈ రెండింటి నడుమ కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. మరోవైపు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-17 వరకు అంటే శామీర్‌పేట-తూంకుంట వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించాలని, తద్వారా ట్రాఫిక్ సమస్యకు స్వస్తి పలకవచ్చని సర్కారు భావిస్తోంది. మంచిర్యాల వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు సంబంధించి మొత్తం మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసిన అధికారులు.. ఏయే మార్గానికి ఎన్ని నిధులు అవసరమవుతాయి, అటవీ భూములు సహా వ్యవసాయ భూములు ఎంతమేరకు సేకరించాల్సి ఉంటుందనే అన్ని వివరాలను సీఎం రేవంత్‌కు వివరించారు. వాటిలో ఒకదానికి సీఎం సూత్రప్రాయ ఆమోదం తెలపగా.. మరికొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. కాగా, మంచిర్యాల వరకు నిర్మించబోయే ఈ రోడ్డును నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు పలు భాగాలుగా నిర్మితమవుతున్న జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 03:27 AM