TG Govt: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత
ABN, Publish Date - Mar 19 , 2025 | 05:31 AM
రాష్ట్రంలో ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన ప్రభుత్వం.. ఆ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించింది. ఇందుకు సంబంధించి సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ...
బిల్లుకు అసెంబ్లీ ఉభయసభల ఆమోదం
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు
చెప్పాం.. చేసి చూపించాం.. చరిత్రాత్మకం
నా మనసుకు దగ్గరి అంశం
వర్గీకరణ ఉద్యమంలో కన్నుమూసినవారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసంలో ప్రాధాన్యం: సీఎం
31 ఏళ్ల పోరాటానికి తెరదించిన కాంగ్రెస్ సర్కారు.. గవర్నర్ ఆమోదమే తరువాయి
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన ప్రభుత్వం.. ఆ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించింది. ఇందుకు సంబంధించి సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన ‘తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) బిల్లు-2025’ను మంగళవారం అసెంబ్లీ ఉభయసభలు ఆమోదించాయి. దీనిపై శాసనసభ, శాసనమండలిలో చర్చించిన అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలోని ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ప్రకటిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ పోరాటంలా.. ఎస్సీ వర్గీకరణ పోరాటం సైతం 30 ఏళ్లుగా సంక్లిష్టంగా మారుతూ వచ్చిందని, అనేక ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని అన్నారు. ఈ సమస్యకు సభ పరిష్కారం చూపడం చరిత్రాత్మకమైన సందర్భమని, ఇది వ్యక్తిగతంగా తన మనసుకు దగ్గరగా ఉన్న అంశమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినట్టుగా.. నేడు ఎస్సీ వర్గీకరణను ప్రకటించామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించిన గంటలోపే.. తమ ప్రభుత్వం విధానాన్ని స్పష్టంగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఇందుకు పార్టీలకతీతంగా మద్దతు పలికారంటూ ధన్యవాదాలు తెలిపారు.
దళితులకు పెద్దపీట వేసిన కాంగ్రెస్..
‘‘జడ్సీటీసీ నుంచి సీఎం వరకు నాకు ప్రతి అడుగులో సంపూర్ణ మద్దతు పలికిన వర్గాలివి. శాశ్వతమైన పరిష్కారం చూపించాలన్న ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. వర్గీకరణ చేయాలి, చట్టం చేయాలని వైఎస్సార్ ఇదే సభలో తీర్మానం చేశారు. 2007లో ఉషా మెహ్రా కమిషన్‌ను నియమించగా.. 2008 మే నెలలో కేంద్రానికి నివేదిక అందించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-341లో సవరణలు చేయడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది. కానీ, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దళితులకు పెద్దపీట వేస్తూ వచ్చిన పార్టీ కాంగ్రెస్. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా దళితులను నియమించిన పార్టీ. అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2018 శాసనసభ ఎన్నికల ప్రచారంలోనే రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. 2023 ఆగస్టు 26న చేవెళ్లలో జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో మల్లికార్జున ఖర్గే కూడా స్పష్టంగా చెప్పారు. వారందరి నిర్ణయాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈరోజు నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్ అన్నారు.
ఢిల్లీకి వెళ్లి అభిప్రాయాలు స్పష్టంగా చెప్పాం..
1996లో జస్టిస్ రామమచంద్రరాజు కమిషన్‌ను నియమించగా.. 1997లో ఇచ్చిన నివేదిక ఆధారంగా వర్గీకరణ చేస్తూ ఏబీసీడీ విభాగాల వారిగా జీవో 68, రోస్టర్ విధానం అమలుకు జీవో 69 ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. 2000 ఏప్రిల్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ అమలు చేశారని, ఆ తర్వాత విషయం కోర్టులకు చేరిందని అన్నారు. ‘‘ఏపీ వర్సెస్ చెన్నయ్య కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన ఽధర్మాసనం 3ః2 ప్రకారం తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలని కోరుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2005 డిసెంబరు-10న రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే గతంలో పంజాబ్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించారు. దీనిపై ఏడుగురు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఎస్సీ ఎమ్మెల్యేలతో ఓ కమిటీని నియమించాం. వీరందరు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
సుప్రీం తీర్పు ఇచ్చిన గంటలోనే చెప్పేశాం..
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోపే తెలంగాణలో వర్గీకరణ చేపడతామని ప్రకటించినట్లు సీఎం రేవంత్ గుర్తు చేశారు. ‘‘రాజకీయ ఉద్దేశంతో కాకుండా ఎంపీరికల్ డేటా ఆధారంగా చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. జనాభా, అక్షరాస్యత శాతం, అనుసరిస్తున్న వృత్తులు, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వర్గీకరణ చేయాలని చెప్పింది. దీనికోసం ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. ఈ ఉపసంఘం ఆరుసార్లు సమావేశమైన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వారి సూచనలతో జస్టిస్ షమీమ్ అక్తర్‌తో ఏకసభ్య కమిషన్ నియమించాం. ఆయన జిల్లాల్లో పర్యటించి మొత్తం 8681 దరఖాస్తులు స్వీకరించారు. అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. నివేదికను ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించగా మరుసటిరోజే మంత్రివర్గం సమావేశమై కమిషన్ చేసిన సిఫారసులన్నింటినీ అమలు చేశాం’’ అని సీఎం వివరించారు.
15 శాతం ఎస్సీ రిజర్వేషన్ల విభజన ఇలా..
59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించామని సీఎం వెల్లడించారు. ‘‘సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలను గ్రూప్-1 కింద తీసుకుని వీరికి 1శాతం రిజర్వేషన్ కల్పించారు. మద్యస్థంగా లబ్దిపొందిన ఎస్సీ కులాలు 18 ఉండగా.. వీరికి 9శాతం రిజర్వేషన్ గ్రూప్-2 కింద కల్పించారు. గణనీయంగా లబ్ధి పొందిన వారిని గ్రూప్-3గా విభజించారు. ఇందులో 26 కులాలుండగా.. 5శాతం రిజర్వేషన్ కల్పించారు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా ఉన్న 15శాతం రిజర్వేషన్లను ఇలా పంచడం జరిగింది. విద్య, ఉపాధితోపాటు, రాజకీయాల్లోనూ వీటిని పాటించాలని ఈరోజు నివేదిక తెచ్చాం. ఈ సందర్భంగా ఎస్సీ ఉద్యమంలో కన్నుమూసిన వారికి ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నా. ఎస్సీ ఉపకులాల కుటుంబాల్లో చదువుకున్న వారికి రాజీవ్ యువవికాసం పథకంలో రూ.4 లక్షల వరకు అందిస్తాం. ఏ నిర్ణయమైనా 51 శాతం తీసుకుంటే సరిపోతుంది. కానీ, ఇక్కడ వందశాతం మద్దతు పలికారు. రిజర్వేషన్లను దామాషా ప్రకారం ఎస్సీలకు 15 నుంచి 18,శాతానికి పెంచాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. 2026 జనాభా లెక్కలు పూర్తికాగానే ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్లను దామాషా ప్రకారం పెంచే బాద్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని సీఎం అన్నారు.
గవర్నర్ ఆమోదమే తరువాయి..
ఎస్సీలను వర్గీకరించాలన్న ఏళ్ల నాటి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపడంతోపాటు వర్గీకరణకు చట్టబద్ధత కూడా కల్పించింది. అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక గవర్నర్ వద్దకు వెళ్లనుంది. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ కింద గవర్నర్ దానికి ఆమోదం తెలిపిన తరువాత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత రావడంతోపాటు ఆయా కులాలకు కేటాయించిన రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం కానుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఎస్సీ వర్గీకరణ చేపట్టి, చట్టబద్ధత కల్పించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం.. ఇకపై ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లకు వర్గీకరణ ప్రకారం కేటాయుంచిన రిజర్వేషన్లు ఆయా వర్గాలకు వర్తించనున్నాయి. కాగా ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఎస్సీల రిజర్వేషన్‌ల అమలుకు పాటుపడగా, మళ్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీల వర్గీకరణ, రిజర్వేషన్ల అమలుకు కృషి చేసిన ఘనత దక్కించుకున్నారు.
వర్గీకరణ ఇలా..
రాష్ట్రంలో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజిస్తూ జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆయా వర్గాలు, జనాభా, సామాజిక, ఆర్థిక, విద్య అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించింది. దాని ప్రకారం గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 15 కులాలకు (3.288 శాతం జనాభా) 1శాతం రిజర్వేషన్ కేటాయించాలని సిఫారసు చేసింది. ఇక గ్రూప్-2లో మాదిగ, దాని ఉపకులాలుగా ఉన్న 18 కులాలకు (62.748 శాతం) 9శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉపకులాలుగా ఉన్న (33.963 శాతం జనాభా) 26 కులాలకు కలిపి 5శాతం చొప్పున రిజర్వేషన్‌ను కేటాయించింది. గ్రూప్-1లో 1,71,625 మంది, గ్రూప్-2లో 32,74,377 మంది, గ్రూప్-3లో 17,71,1682 మంది జనాభా ఉన్నారని తెలిపింది. ఎస్సీల వర్గీకరణ కోసం కులాలు, రిజర్వేషన్‌లతో పాటు క్రీమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలంటూ ఏక సభ్య కమిషన్ మొత్తం 4 సిఫారసులను చేసింది.2011 జనాభా లెక్కల ఆధారంగానే కమిషన్ ఈ సిఫారసులు చేసింది. అయితే వీటిలో క్రీమీలేయర్ మినహా మిగిలిన మూడు సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది.
Updated Date - Mar 19 , 2025 | 05:31 AM