ఏడాదిన్నరలో 80 సర్జరీలు..
ABN, Publish Date - Jan 28 , 2025 | 03:22 AM
కిడ్నీ దాత ఎవరో గ్రహీతకు తెలియదు.. వీరిద్దరూ ఎవరో ఆపరేషన్ చేసే వైద్యుడికి తెలియదు..!! కిడ్నీ మార్పిడి దందాలో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం తెలియదు!
జననిలో 54, అరుణలో 6, అలకనందలో 20
దాత, గ్రహీత, వైద్యుడు.. ఎవరికెవరూ తెలియదు!
అక్రమ దందా వ్యవహారాలన్నీ వాట్సా్‌ప ద్వారానే..!
కిడ్నీ రాకెట్‌లో వెలుగులోకి కీలక విషయాలు
అరెస్టులతో బయటకొస్తున్న విస్తుగొలిపే అంశాలు
సూత్రధారి పవన్‌ను విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కిడ్నీ దాత ఎవరో గ్రహీతకు తెలియదు.. వీరిద్దరూ ఎవరో ఆపరేషన్ చేసే వైద్యుడికి తెలియదు..!! కిడ్నీ మార్పిడి దందాలో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం తెలియదు! ఈ ముఠాలో ఎవరి పాత్ర వారు పోషించడమే తప్ప.. ఒకరికొకరు కనీస ముఖ పరిచయం కూడా ఉండదు! కిడ్నీ మార్పిడి ముఠా దందాలో వెలుగుచూసిన విషయాలివి!! నాలుగు రోజుల క్రితం 9 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ దందాలో ప్రధాన సూత్రధారి పవన్, కీలక డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వారిని విచారించిన క్రమంలో విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన సిద్దంశెట్టి అవినాష్ సైదాబాద్‌లో జనని ఆస్పత్రిని ఏర్పాటు చేశాడు. ఆస్పత్రి విజయవంతం కాకపోవడంతో దాన్ని ఆమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతనికి విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ పరిచయం అయ్యాడు. ‘ఆస్పత్రిని ఎలాగూ మూసివేస్తున్నారు కాబట్టి.. ఆపరేషన్ థియేటర్ మాత్రం వాడుకొని కిడ్నీ ఆపరేషన్లు చేసుకుంటాం. ఒక్కో ఆపరేషన్‌కు రూ.2.50 లక్షలు చెల్లిస్తాం’ అని లక్ష్మణ్ ఆఫర్ ఇవ్వగా.. అవినాష్ ఒప్పుకొన్నాడు. అయితే ఆపరేషన్లు చేసే డాక్టర్, రోగి, దాత ఎవరు? ఈ దందా మొత్తాన్ని నడిపించే వ్యక్తి ఎవరు? అనేది మాత్రం తెలియదు. ఏ సమాచారం కావాలన్నా.. వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడేవారు. అందులోనూ సూత్రధారుల ఫోన్ నంబర్లు కనిపించవు. కానీ, ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎవరి వాటా వారికి వెళ్తుందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
రూ.48 కోట్లు దండుకున్నారు..
జనని ఆస్పత్రిలో 2023 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు 54 అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతి ఆపరేషన్‌కు రూ.2.50 లక్షల చొప్పున అవినా్‌షకు రూ.1.35 కోట్లు ముట్టినట్లు తేల్చారు. 2024 జూన్‌లో జనని ఆస్పత్రిని మూసివేశారు. ఆ తర్వాత దగ్గరలోని అరుణ ఆస్పత్రిలో ఆరు ఆపరేషన్లు చేసినట్లు గుర్తించారు. అనంతరం అలకనంద ఆస్పత్రిలో ఈ దందాను కొనసాగించారు. తన కమీషన్ కింద రూ.లక్ష పెట్టుకున్న అవినాష్.. అలకనంద ఆస్పత్రి ఎండీ సుమంత్‌కు ఒక్కో ఆపరేషన్‌కు రూ.1.50 లక్షలు చెల్లించేలా మాట్లాడుకున్నాడు. గత జూలై నుంచి ఇప్పటి వరకు 20 ఆపరేషన్‌లు చేశారు. ఇన్ని శస్త్రచికిత్సలు చేసినప్పటికీ అవినా్‌షకు, సుమంత్‌కు దందా సూత్రధారులు ఎవరనేది తెలియదు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.60 లక్షలు వసూలు చేసిన నిందితులు రూ.48 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు. కిడ్నీ దాత, గ్రహీతను ఎంపిక చేయడం, ఆపరేషన్ ఏర్పాట్లను ప్రధాన సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ చూసుకుంటాడు. అన్నీ వాట్సా్‌పలోనే సెటిల్ చే సేవాడు. ఆపరేషన్‌కు అంతా సిద్ధమవగానే డాక్టర్ రాజశేఖర్ హైదరాబాద్ వస్తారు. నేరుగా ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేస్తారు. ఈ ప్రక్రియను ఆరు గంటల్లో పూర్తి చేసి వెళ్లిపోతారని విచారణలో తేలినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు వీలుపడకపోతే, కశ్మీర్ నుంచి షోహిబ్‌ను పిలిపించి ఆపరేషన్ చేయించేవారని విచారణలో గుర్తించారు.
నగరంలో ఎక్కడెక్కడ చేశారు..?
డాక్టర్ రాజశేఖర్‌ను పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రధారి పవన్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది. కాల్‌డేటా, వాట్సాప్ చాట్, ఇతర డేటాపై దృష్టి సారించినట్లు సమాచారం. జనని, అరుణ, అలకనంద ఆస్పత్రులతో పాటు నగరంలో ఇంకా ఎక్కడెక్కడ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు? హైదరాబాద్‌తో పాటు ఇంకా ఏయే రాష్ట్రాల్లో ఈ దందా నిర్వహించారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాను హైదరాబాద్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో చేశారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్
Updated Date - Jan 28 , 2025 | 03:22 AM