Supreme Court: మణిపూర్‌లో ఏం జరిగిందో చూశారుగా?
ABN, Publish Date - Feb 22 , 2025 | 04:36 AM
దేశవ్యాప్తంగా ఆరె కటిక (ఖాతిక్) కులస్తులను షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
హైకోర్టును ఆశ్రయించినా నిరుపయోగమే
కులాల జాబితాను సవరించేది పార్లమెంటే
ఈ విషయమై పార్లమెంట్‌నే ఆశ్రయించండి:సుప్రీం కోర్టు
ఆరె కటికలను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న పిటిషన్‌పై వ్యాఖ్య
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఆరె కటిక (ఖాతిక్) కులస్తులను షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా మణిపూర్‌లో అల్లర్ల అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. కులాల జాబితాలో సవరణలు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని, ఈ విషయమై పార్లమెంట్‌నే ఆశ్రయించాలని సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక (ఖాతిక్) కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ ఆరె కటిక సంఘం జనవరి 8న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసి్‌హతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రహీమ్, రాజు సోంకర్ వాదనలు వినిపిచేందుకు సిద్ధమవుతుండగా.. ఈ పిటిషన్ విచారణకు ఎలా సమర్థనీయం? అని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. మణిపూర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా? అక్కడ మైతేయి కులానికి సంబంధించిన కేసులో హైకోర్టు నిర్ణయం తర్వాత ఎన్ని అల్లర్లు జరిగాయో చూశారు కదా? అని వ్యాఖ్యానించారు. ఈ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, హైకోర్టుకు వెళ్లడానికి అవకాశం కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా... దానికీ ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ మాత్రమే చేయగలదని, వెంటనే పార్లమెంట్‌ను ఆశ్రయించాలని సూచించింది. చివరకు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు రహీమ్ తెలపగా.. ధర్మాసనం అంగీకరించింది.
Updated Date - Feb 22 , 2025 | 04:36 AM