Bhatti Vikramarka: నేడే అఖిలపక్ష భేటీ
ABN, Publish Date - Mar 08 , 2025 | 03:33 AM
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భట్టి అధ్యక్షతన ఎంపీల సమావేశం
ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం రేవంత్
విభజన సమస్యలు, ఇతర గ్రాంట్లపైనే ప్రధాన చర్చ
పార్లమెంట్‌లో రాష్ట్ర వాణిని వినిపించడమే లక్ష్యం
పార్టీతో చర్చించాకే హాజరుపై నిర్ణయం: కిషన్‌రెడ్డి
సమగ్ర కుల గణనపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి
సలహా కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి సూచన
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‌లో శనివారం ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు అన్ని పార్టీల ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి, సమావేశానికి రావాలని ఆహ్వానించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రం తరపున అన్ని పార్టీల ఎంపీలు గళమెత్తాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ప్లాంటు, గిరిజన వర్సిటీకి నిధులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ‘వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి’ కింద రూ.1800 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం అడుగుతోంది. మెట్రో రైలు రెండో దశ కింద రూ.24,269 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.14,100 కోట్లు, ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు మధ్య నిర్మించే 10 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు, ‘గోదావరి-మూసీ అనుసంధాన’ ప్రాజెక్టుకు రూ.7,440 కోట్లు ఇవ్వాలని కోరుతోంది. హైదరాబాద్‌లో సమీకృత మురికినీటి మాస్టర్ ప్లాన్(సీఎ్‌సఎంపీ)కు, వరంగల్‌లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికి నిధులివ్వాలని అడుగుతోంది. ఆయా అంశాలపై తాజా ఎంపీల సమావేశంలో చర్చించి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. తమ పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చించిన తర్వాతే డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడంపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి ఫోన్ చేశారని, ఈ విషయాన్ని తమ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పార్టీ ఎంపీలతోనూ చర్చించాక నిర్ణయం తీసుకుంటామని ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. మరోవైపు.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు భట్టి ఫోన్ చేసి ఆహ్వానించగా.. ఈ విషయంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా తాము నడుచుకుంటామని బదులిచ్చినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.
ఏ కులానికి ఎలా న్యాయం చేద్దాం?
సమగ్ర కుల గణనపై నెలలో నివేదిక ఇవ్వండి
సలహా కమిటీకి డిప్యూటీ సీఎం సూచన
‘సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే’ ఆధారంగా ఏ కులానికి, ఏ వర్గానికి ఎలా మేలు చేస్తే బాగుంటుందో అధ్యయనం చేసి చెప్పాలని ఈ సర్వేపై ఏర్పాటైన సలహా కమిటీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నెల రోజుల్లో ఓ నివేదిక ఇవ్వాలని అడిగారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్‌గా, ప్రొ.కంచ ఐలయ్య వైస్ చైర్మన్‌గా, ప్రవీణ్ చక్రవర్తి కన్వీనర్‌గా ఏర్పాటైన సలహా కమిటీ మంత్రి భట్టి విక్రమార్కతో శుక్రవారం భేటీ అయింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ుుఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన సర్వే వల్ల రాష్ట్రంలో ఏ కులం, ఏ వర్గం ఏ స్థాయిలో ఉందనే అవగాహన వచ్చిందని అన్నారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం మేలు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ దృష్ట్యా సలహా కమిటీ తగిన సూచనలతో నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 08 , 2025 | 03:33 AM