Data Center: ఫోర్త్ సిటీలో.. ఏఐ డేటా సెంటర్
ABN, Publish Date - Jan 19 , 2025 | 03:49 AM
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు.. సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలీమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్‌పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
100 మెగావాట్ల సామర్థ్యంతో ముచ్చర్లలో ఏర్పాటు
రూ.3500 కోట్ల పెట్టుబడికి ఎస్టీ టెలీమీడియా సిద్ధం
సింగపూర్‌లో సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందం
ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రాజెక్టుకు సహకరిస్తామని
హామీ ఇచ్చిన ఆ దేశ వాణిజ్య మంత్రి గ్రేస్ ఫు హైయిన్
సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టండి
పారిశ్రామికవేత్తల భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు.. సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలీమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్‌పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేతృత్వంలోని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శనివారం ఎస్టీ టెలీమీడియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఎస్టీ టెలీమీడియాగ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగానే సంస్థ సీఈవో.. 100 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో రూ.3500 కోట్ల పెట్టుబడితో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈమేరకు.. సీఎం రేవంత్ సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సంస్థ బ్రూనో లోపెజ్ ఎంవోయూపై సంతకాలు చేశారు.
డేటా సెంటర్ల నిర్వహణలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఎస్టీ టెలీమీడియాకు ఇప్పటికే చైనా, యుకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్‌లో డేటా సెంటర్లు ఉన్నాయి. భారత్‌లోనూ హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో 8 మెగావాట్ల డేటా సెంటర్‌తోపాటు 10 నగరాల్లో డేటా సెంటర్లను కలిగి ఉంది. ముచ్చర్లలో నిర్మించబోయే డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్ద సెంటర్లలో ఒకటిగా ఉంటుందని.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా దాని సామర్థ్యాన్ని పెంచుతామని కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయటం గౌరవంగా ఉందని బ్రూనో లోపెజ్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని కొనియాడారు. ఇక.. ప్రపంచానికి హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగాల్లో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
పరస్పర సహకారం..
సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ఆ దేశ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్‌తో భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాల గురించి వివరించగా.. ప్రభుత్వానికి సహకారంపై ఆమె సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి వనరుల నిర్వహణ, తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృద్థి ప్రణాళికలపై ఆమె ఆసక్తి ప్రదర్శించారు. పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలిసి పని చేసేందుకు అంగీకరించారు.
పారిశ్రామికవేత్తలతో..
తెలంగాణలో భారీ వ్యాపార అవకాశాలున్న సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సింగపూర్ పారిశ్రామికవేత్తలను కోరారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ఆధునిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల విధానాల గురించి తెలిపేందుకు శనివారం ఆయన సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (ఎస్‌ఎ్‌సఐఏ)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎస్‌ఎ్‌సఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైౖర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సి.ఎ్‌స.చుహ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. ఈ ఏడాది చివర్లో సింగపూర్ నుంచి తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి, పరిశీలన జరుపుతుందని వారు తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్‌లో స్థిరపడ్డ ప్రవాస తెలంగాణ వాసులను కోరారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన.. మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ సాంస్కృతిక సంఘం ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. సింగపూర్ అభివృద్ధిలో తెలంగాణవాసుల భాగస్వామ్యం ఉండటం సంతోషంగా ఉందని పేర్కొన్న సీఎం.. పారిశ్రామిక అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
Updated Date - Jan 19 , 2025 | 03:49 AM