Seethakka: ఎంత ఎదిగినా జాతి వేష, భాషలు మరవొద్దు
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:17 AM
చరిత్ర పునాదుల మీదే జాతి నిర్మితమవుతుందని, ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి మూలాలు, వేష, భాషలను మరవకూడదని మంత్రి సీతక్క అన్నారు.
సేవాలాల్ జయంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): చరిత్ర పునాదుల మీదే జాతి నిర్మితమవుతుందని, ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి మూలాలు, వేష, భాషలను మరవకూడదని మంత్రి సీతక్క అన్నారు. శనివారం సంత్‌సేవాలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. సేవాలాల్ శాంతి బోధనలు, సమానత్వం, అహింస స్ఫూర్తితో ముందుకు నడవాలని, ఆయన చూపిన సమాజ శాంతి కోసం బంజారాలు పనిచేయాలన్నారు.
బంజారాలను సంచార జీవితాల నుంచి విముక్తి కల్పించి వారికి స్థిర నివాసాల కోసం తండాలను ఏర్పాటు చేసిన వ్యక్తి సేవాలాల్ అని తెలిపారు. ఆ మహానీయుడి ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించడమే ఆయనకు ఇచ్చే నివాళి అన్నారు. గత ప్రభుత్వంలో సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం రూ.17వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. తండాల అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. గిరిజనుల విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది ఎల్బీ స్టేడియంలో సేవాలాల్ జయంతిని నిర్వహించేలా సీఎంను కోరుతానన్నారు. సేవాలాల్ జయంతి నిర్వహణకు కోరినన్ని నిధులిచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Feb 16 , 2025 | 04:17 AM