రెండు గ్రామాల ఇసుక పంచాయితీ
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:01 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావల్సిన ఇసుక తరలింపు పంచాయితీ యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని ధర్మారెడ్డిగూడెం, మాసాయిపేట గ్రామాల మధ్య చిచ్చుపెడుతోంది.
తహసీల్దార్ కార్యాలయం వద్దే రెండు గ్రామాల ట్రాక్టర్ యజమానుల ఘర్షణ
పోలీస్‌స్టేషన్లలో పరస్పర ఫిర్యాదులు
యాదగిరిగుట్ట రూరల్, జూలై 8,(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావల్సిన ఇసుక తరలింపు పంచాయితీ యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని ధర్మారెడ్డిగూడెం, మాసాయిపేట గ్రామాల మధ్య చిచ్చుపెడుతోంది. తమ గ్రామానికి రావొద్దని ధర్మారెడ్డిగూడెం, ఎందుకు రావొద్దని మాసాయిపేట గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యజమానులు వాదించుకున్నారు. మంగళవారం యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘర్షణకు దిగారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మండలంలోని ఽధర్మారెడ్డిగూడెం గ్రామ శివారు ప్రాంతంలో గోదావరి జలాలతో వాగు రావడంతో స్పష్టమైన ఇసుక తరలివచ్చింది. దీంతో ధర్మారెడ్డిగూడెం, మాసాయిపేట గ్రామాల మధ్య పంచాయితీకి ఆజ్యం పోసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండలంలోని ఏగ్రామంలో ఇసుక ఉన్నా ఇళ్ల నిర్మాణానికి సంబంధిత రెవెన్యూ అధికారులతో ఇసుక తీసుకరావడానికి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ తమ గ్రామ రెవెన్యూ పరిధిలోనే ఇసుక ఉందని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తమ ట్రాక్టర్ల ద్వారనే తరలిస్తామని ఇతర గ్రామాలకు చెందిన వారు ఎవరూ రావద్దని అంటున్నారు. మరోవైపు మాసాయిపేట గ్రామానికి చెందిన గ్రామస్థులు తమ ట్రాక్టర్ల ద్వార ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తామని ఽఅనడంతో ఇరు గ్రామాల మధ్య వివాదం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ఇసుకకు ధర పలుకుతుండడంతో గ్రామస్థుల మధ్యపోటీ పెరిగింది. రెవెన్యూ అధికారులు , పోలీస్ అధికారులు సర్థిచెప్పినప్పటికీ ససేమిరా అంటున్నారు. మండలంలో ఏ గ్రామంలో ఇసుక ఉన్నా దానిని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు వాడుకోవచ్చునని ఏ గ్రామానికి సొంతం కాదని ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు, పోలీసు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఇరు గ్రామాలకు చెందిన ప్రజలు అమీతుమీ తేల్చుకుందామని పట్టుదలతో ఉన్నారు. ఈ సమస్య ఎంతవరకు వెళ్తుందోనని ఇరుగ్రామాల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ఇసుక తరలింపు అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెడతాం
ఽఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తరలించకుండా అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెడుతాం. మండలంలోని ఏగ్రామంలో ఇసుక ఉన్నా అందరూ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
Updated Date - Jul 09 , 2025 | 01:01 AM