Weather Updates: ఎండ మంటలు
ABN, Publish Date - Feb 06 , 2025 | 03:17 AM
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి విజృంభిస్తున్నా పగటి పూట ఎండలు హడలెత్తిస్తున్నాయి.
రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
అధికమైన ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం
అమాంతం పెరిగిపోయిన విద్యుత్తు డిమాండ్
వారంలో మరింత పెరగనున్న ఎండల తీవ్రత
హైదరాబాద్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి విజృంభిస్తున్నా పగటి పూట ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రాబోయే వారం రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కనీసం 2-3 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని తెలిపింది. హైదరాబాద్‌లో రానున్న వారం రోజుల్లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 19-34 డిగ్రీల సెల్సియ్‌సగా ఉండవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఇన్‌చార్జి కే నాగరత్న పేర్కొన్నారు. మరోపక్క, ఎండల తీవ్రతకు తోడు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం మొదలవ్వడంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మంగళవారం రికార్డు స్థాయిలో 15,582 మెగావాట్లుగా నమోదయింది. గతేడాది ఇదే రోజున విద్యుత్ డిమాండ్ 13,276 మెగావాట్లుగా ఉండడం గమనార్హం.
గృహ వినియోగంతోపాటు వ్యవసాయ వినియోగం కూడా అధికమవ్వడంతో విద్యుత్ డిమాండ్ (ఏకకాలంలో రాష్ట్రంలో అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు వాడకంతో ఆయా పరికరాల సామర్థ్యం మేరకు రికార్డయ్యేది) గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇక, వినియోగం(రోజంతా వినియోగించే విద్యుత్ యూనిట్ల ఆధారంగా లెక్కక ట్టేది) కూడా భారీగానే ఉంది. విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం గతేడాది ఫిబ్రవరి 4న 248.74 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం ఈనెల 4న 286.01 మిలియన్ యూనిట్లుగా నమోదయుంది. గతేడాది కన్నా ఇది 14.98 శాతం అధికం. ఇక, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా 14 వేల మెగావాట్లకు తగ్గడం లేదు. ఫిబ్రవరి1న 14,822 మెగావాట్లు(276.64 మిలియన్ యూనిట్లు), 2న 14,826 మెగావాట్లు(270.54 మిలియన్ యూనిట్లు), 3న 15,262 మెగావాట్లు(280.59 మిలియన్‌యూనిట్లు) డిమాండ్ నమోదయింది. విద్యుత్ డిమాండ్‌లో గ్రేటర్ హైదరాబాద్ వాటా అధికంగా ఉంది. హైదరాబాద్ పరిధిలో గత ఫిబ్రవరి 4న 2,616 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ ఈ నెల 4న 3,320 మెగావాట్లుగా నమోదైంది. ఇది గతేడాదితో పోల్చితే 26.91 శాతం అధికం. ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 2న 60.13 మిలియన్ యూనిట్లు, 3న 58.06 మిలియన్ యూనిట్లు, ఈనెల 4న 54.28 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఎండలు పెరగనున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..
Updated Date - Feb 06 , 2025 | 10:44 AM