బూతులే బంగారు బాతులు!
ABN, Publish Date - Feb 18 , 2025 | 04:36 AM
ఇంటి దగ్గరే ఉంటూ.. దోస్తులతో ఎంజాయ్ చేస్తూ.. అక్షరం ముక్క రాకపోయినా.. ఏ మాత్రం కష్టపడకుండా.. కొందరు ప్రతి నెలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.
అసభ్య, బూతు వీడియోలతో భారీగా ఆదాయం
నెలకు రూ.లక్షల్లో యూట్యూబర్ల సంపాదన
చట్టాలను పట్టించుకోరు.. ప్రైవసీనీ లెక్కచేయరు
సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం
రాష్ట్ర సర్కారు అడ్డుకోవచ్చు.. ఐనా పట్టించుకోదు!
మనం మామూలుగా మాట్లాడే భాషలో పదాలు.. కొందరు యూట్యూబర్ల దృష్టిలో పచ్చిబూతులకు పర్యాయపదాలు! సభ్యత ఉన్నవారికి రోతగా అనిపించే మాటల్ని మంచినీళ్ల ప్రాయంగా వాడేస్తూ వారు రూపొందించే వీడియోలు.. కాసులు కురిపించే బంగారు బాతులు!! అశ్లీల సంభాషణలు వినడానికి అంగలార్చే అథమస్థాయి అభిరుచి ఉన్నవారే వారికి మహరాజపోషకులు. ద్వంద్వార్థాలు ధ్వనించే థంబ్‌నెయిల్స్‌తో తమ వీడియోలకు వ్యూస్ పెంచుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వీడియోలతో నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్న యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా ఉన్నారు! చెక్‌పెట్టే చట్టాలున్నా.. పట్టించుకునే వారు లేకపోవడంతో బూతు వీడియోల దందా వేలల్లో షేర్లు.. లక్షల్లో లైకులుగా విరాజిల్లుతోంది!
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఇంటి దగ్గరే ఉంటూ.. దోస్తులతో ఎంజాయ్ చేస్తూ.. అక్షరం ముక్క రాకపోయినా.. ఏ మాత్రం కష్టపడకుండా.. కొందరు ప్రతి నెలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా? యూట్యూబ్ చానళ్ల ద్వారా!! అవును.. యూట్యూబ్ చానల్‌లో బూతు, అశ్లీల వీడియోలు పెట్టేసి.. సబ్‌స్ర్కైబర్లను పెంచుకుంటున్నారు. రోజుకో బూతు వీడియో అప్‌లోడ్ చేసేస్తున్నారు. అశ్లీలత ఎంత ఎక్కువగా ఉంటే.. ఆదాయం అంతగా పెరుగుతోంది!! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో కొనసాగుతున్న విపరీత పోకడ!! యూట్యూట్‌లోనే కాదు.. యువత ఎక్కువగా వినియోగించే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అశ్లీల, బూతు వీడియోలు, షార్ట్‌లు కోకొల్లలు. ఓ రియాల్టీ షోలో రణ్‌వీర్ అలహాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనం, విపరీతమైన స్వేచ్ఛ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీ్‌సతో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మన రాష్ట్రం సంగతేంటి..? తెలంగాణలో ఎప్పుడో హద్దులు దాటేసిన తెలుగు యూబ్యూబర్ల సంగతేంటి..? వీరి విచ్చలవిడితనాన్ని ప్రశ్నించేది ఎవరు..? వారికి అడ్డుకట్ట వేసేవారే లేరా..? రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వేల సబ్‌స్ర్కైబర్లు.. లక్షల ‘వ్యూస్’లు..
దేశంలో లక్షలాది మంది యూట్యూబ్ వేదికగా భారీగానే ఆర్జిస్తున్నారు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, మోటివేషన్, యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు రూపొందించి ప్రతినెలా లక్షల్లో ఆర్జిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. యూట్యూబ్ వీడియోలకు వ్యాపార సంస్థలు భారీ ప్రకటనలు ఇస్తుండడం, ఎంత ఎక్కువ లైక్‌లు, సబ్‌స్ర్కైబర్లు ఉంటే అంత ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఇప్పుడు ఆన్‌లైన్లో ఇదో పెద్ద వ్యాపారంగా మారింది. అనేకమంది ఉద్యోగాలు వదిలి పూర్తిస్థాయి యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్నారు. కానీ, ఇటీవలి కాలంలో ఈ వ్యాపారం పూర్తిగా గాడితప్పింది. తక్కువ సమయంలో భారీగా సబ్‌స్ర్కైబర్లను పెంచుకోవాలంటే, వీక్షకులు, ఫాలోవర్లను పొందాలంటే దేనికైనా తెగించే యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో ఉన్నారు. ఉదాహరణకు.. ‘శ్రీ..’ అనే మహిళ, గతంలో ఓ చానల్‌లో పనిచేసి, ఆనక ఓ పార్టీకి మద్దతుదారుగా మారిపోయి.. జననావయవాలకు సంబంధించిన పచ్చిబూతులను వాడుతూ అనర్గళంగా మాట్లాడే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి! ‘సా....’ అనే మరో యూట్యూబర్ ఆడపిల్లలను ఇంటర్వ్యూ చేసే పేరుతో.. ఆసాంతం బూతునే నమ్ముకుని రూపొందించే వీడియోలకూ భారీగా అభిమానులు ఉండడం విషాదం! విజయ్... పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ చానల్‌లో రాయడానికి వీల్లేని విధంగా భాష వినియోగిస్తారు. కొందరు మహిళలు, యువతులను ఇంటర్వ్యూలు చేస్తూ.. అసభ్య మాటలతో సమాధానాలు చెప్పిస్తారు. ఈ చానల్‌లో ఇలాంటి బూతు వీడియోలు 1300 ఉండగా, 5 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అలాగే ‘సూపర్ ---- స్టార్స్’ పేరుతో ఉన్న యూట్యూబ్ చానల్లో ఓ మహిళ వాడే భాష, ఆమె చేసే ఇంటర్వ్యూల్లో వేసే ప్రశ్నలు, ఆమె వ్యక్తిగత అనుభవాలు.. అన్నింటినీ సెన్సార్ చేస్తే అరగంట వీడియోలో ప్రసారానికి అర్హమయ్యే నిడివి అరనిమిషం కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈమె ఇప్పటివరకు 470 వీడియోలు అప్‌లోడ్ చేయగా.. 3.5 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వీరే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి యూట్యూబ్ చానళ్లు, ఇన్‌స్టా అకౌంట్ల సంఖ్య వందల్లో ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ యూట్యూబ్‌ను చూస్తారు. ఇలాంటి వీడియోలు నిత్యం అందరికీ తారసపడుతూనే ఉంటాయి. వీరంతా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా.. ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి వీడియోలకు పెరుగుతున్న జనాదరణ చూసి.. ఇదే తరహాలో, అంతకుమించిన బూతులు, అశ్లీలతతో యూట్యూబ్ చానళ్లు పెట్టేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు..
వ్యక్తిగత గోప్యత, దేశ సమగ్రత, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసభ్య, అశ్లీలతకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోకుండా కఠినమైన చట్టాలున్నాయి. ఈ విషయంలో యూట్యూబ్ కూడా ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తోంది. వీటిని ఉల్లంఘించేవారిపై ఫిర్యాదు చేస్తే విచారించి తొలుత యూట్యూబ్ సంబంధిత ఛానల్‌కు హెచ్చరికలు జారీచేస్తుంది. రెండోసారి ‘స్ర్టైక్’ చేస్తే వారంపాటు వీడియోలు అప్‌లోడ్ చేయకుండా, లైవ్ స్ర్టీమ్‌లు ఇవ్వకుండా నిషేధిస్తుంది. మళ్లీ అదే పని చేస్తే రెండువారాల పాటు నిషేధం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ చేస్తే చానల్‌ను శాశ్వతంగా తొలగిస్తుంది. అయితే రాష్ట్రంలోని అనేక యూట్యూబ్ చానళ్లపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నా.. స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లిష్, హిందీ భాషల్లోని వీడియో కంటెంట్‌పై యూట్యూబ్ స్పందిస్తున్నా.. తెలుగు, తమిళం, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల వీడియోలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పలు చానళ్లు ఇష్టారాజ్యంగా వీడియోలు పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిబంధనల ఉల్లంఘనలకు సంబంఽధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అయితే వాటిని మాత్రమే యూట్యూబ్ తొలగిస్తోంది. సదరు చానల్ మాత్రం కొనసాగుతోంది. బూతులు, అశ్లీలతే కాదు.. ఏఐ టూల్స్ సాయంతో.. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖుల ముద్దులు, కౌగిళ్ల డీప్ ఫేక్ వీడియోలు రూపొందించి వైరల్ చేసేవారి సంఖ్య కూడా భారీగా ఉంటోంది. ఐటీ చట్టం ప్రకారం ఇది నేరం అయినప్పటికీ పోలీసులు, ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు.
రాష్ట్ర ఐటీ శాఖ ఏం చేస్తోంది?
యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో దేశ సమగ్రత, మతాలు, ప్రాంతాలు మధ్య విద్వేషం, తప్పుడు వార్తలకు సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగించే అధికారం కేంద్ర ఐటీ శాఖకు ఉంది. కేంద్రప్రభుత్వం సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే చానళ్లపైనే చర్యలు తీసుకుంటోంది తప్ప బూతులు, అశ్లీల అంశాల జోలికి వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. ఓ రియాల్టీ షోలో ఇటీవలరణ్‌వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. కేంద్రం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. అయితే ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించే హక్కు రాష్ట్రాలకూ ఉంది. ఏదైనా వీడియో అభ్యంతరకరంగా అనిపిస్తే వాటిని తొలగించమని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం లాంటి సంస్థలను కోరవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిర్యాదు వస్తే వాటిని వెంటనే పరిశీలించి ఆ సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం, అశ్లీల, బూతు వీడియోలపై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలవిడితనం కొనసాగుతోంది. తమ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ గత మూడు నెలల్లో ఇద్దరు వ్యక్తులు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో యూట్యూబ్ సంబంధిత వీడియోలను తొలగించింది.
Updated Date - Feb 18 , 2025 | 04:36 AM