Vehicle Racing: ఓఆర్‌ఆర్‌పై అర్ధరాత్రి కార్లతో విన్యాసాలు!
ABN, Publish Date - Feb 10 , 2025 | 05:16 AM
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై అర్ధరాత్రి వాహనాలతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కార్లు, బైక్‌లను అతివేగంతో నడుపుతూ విన్యాసాలు చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై అర్ధరాత్రి వాహనాలతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కార్లు, బైక్‌లను అతివేగంతో నడుపుతూ విన్యాసాలు చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని తొండుపల్లి వద్ద రింగ్‌రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లతో విన్యాసాలు చేశారు. అతి వేగంతో వాహనాలను నడుపుతూ సడన్ బ్రేకులు వేసి గిరగిరా తిప్పారు.
దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లోనూ రికార్డయ్యాయి. దీనిపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్ల నంబర్ల ఆధారంగా బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నారు. బైక్, కార్ల రేస్‌లకు ఓఆర్‌ఆర్‌ను అడ్డా కానివ్వద్దని.. ఇప్పటికైనా పోలీసులు, ఓఆర్‌ఆర్ నిర్వహణ సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 05:16 AM