Bhatti Vikramarka: సిబిల్ స్కోర్‌తో సంబంధం లేదు
ABN, Publish Date - May 14 , 2025 | 04:03 AM
రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ పథకం జూన్ 2న అమలులోకి రానుందని తెలిపారు.
యువ వికాసం ఎంపికలకు అది వర్తించదు: భట్టి
ఇల్లెందు, మే 13(ఆంధ్రజ్యోతి): రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్‌తో సంబంధం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు వరంగా రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ చూస్తారని కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ఈ ప్రచారాలను నిరుద్యోగులు నమ్మవద్దని సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్, ట్రాక్ రికార్డు, రికవరీ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. గతంలో ఎస్సీ, బీసీ, ఐటీడీఏ తదితర సంస్థల రుణాలు పొందిన వారు ఉన్నారని, రాజీవ్ యువ వికాసంలో కొత్త వారికి అవకాశం లభించాల్సి ఉందని భట్టి వెల్లడించారు.
Updated Date - May 14 , 2025 | 04:05 AM