ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt: రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:32 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం అమలులో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న తొలి విడత కింద రూ.లక్ష లోపు యూనిట్లను మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ...

  • దరఖాస్తులు ప్రస్తుతానికి నిలుపుదల

  • కలెక్టర్లకు సర్కారు మౌఖిక ఆదేశాలు!

  • రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు

  • రూ.లక్ష లోపు యూనిట్లు ఎక్కువగా ఇవ్వాలని

  • ప్రభుత్వ యోచన.. దరఖాస్తుదారుల అనాసక్తి

  • 3-4 లక్షల యూనిట్లకు 79ు దరఖాస్తులు

  • సిబిల్‌ ఉంటేనే లక్ష పైన రుణం: బ్యాంకర్లు

  • కొత్త మార్గదర్శకాలపై సర్కారు కసరత్తు

  • ఈ ప్రక్రియ పూర్తికి ఆగస్టుదాకా సమయం

హైదరాబాద్‌/వరంగల్‌/మహబూబ్‌నగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం అమలులో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న తొలి విడత కింద రూ.లక్ష లోపు యూనిట్లను మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో అనర్హులకు లబ్ధి చేకూరకూడదని పలువురు మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో దరఖాస్తుల పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజీవ్‌ యువ వికాసంపై నిర్ణయం తీసుకుంటారని భావించినా.. అలాంటిదేమీ జరగలేదు. పైగా, రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను హోల్డ్‌లో పెట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగస్టు వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరులో జాప్యం తప్పదని సమాచారం. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా కాంగ్రెస్‌ కార్యకర్తలకే ప్రాధాన్యమివ్వడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే, వెనక్కి తగ్గినట్లు ప్రచారం సాగుతోంది.

లక్షలాది దరఖాస్తులు..!

రాజీవ్‌ యువ వికాసం పథకానికి 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీలకు 1.55 లక్షల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకుంటే.. ఏకంగా 8.01 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీలకు 1.44 లక్షల యూనిట్లు ఉంటే.. 3.92 లక్షలు; ఎస్టీలకు 91 వేల యూనిట్లకు 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈబీసీలకు 51 వేల యూనిట్లు ఉంటే.. 37 వేల దరఖాస్తులే వచ్చాయి. క్రైస్తవులకు 5 వేల యూనిట్లు ఉంటే 4,604 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, 16 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో మల్లగుల్లాలు పడుతోంది. మొదటి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు ఈ నెల 2 నుంచి 9 వరకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని షెడ్యూల్‌ ప్రకటించింది. కేటగిరీ-1లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు యూనిట్ల కోసం దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాదాపు 2.8 లక్షల మందికి ఈ కేటగిరీ కింద యూనిట్లు మంజూరు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ, కేవలం 1,32,634 మందే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రూ.50 వేల లోపు యూనిట్‌కు పూర్తి రాయితీ ప్రకటించినా.. 39,401 దరఖాస్తులే వచ్చాయి. రూ.లక్షలోపు యూనిట్లకు 90 శాతం రాయితీ ప్రకటించినా 93,233 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 79 శాతం మంది రూ.3-4 లక్షల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు. లక్ష లోపు యూనిట్లకు మార్చుకోవాలని అధికారులు వారికి సూచించినా ఫలితం లేకపోయింది. ఇక రూ.50 వేల లోపు యూనిట్ల ఏర్పాటు కూడా సమస్యగా మారే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాన్ని విస్తరించుకోడానికి నిబంధనలు వర్తించకపోవడంతో అలాంటి దరఖాస్తులను తిరస్కరించారు. తక్కువ మొత్తంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించినా.. అందుకు భిన్నంగా దరఖాస్తులు రావడంతో పునరాలోచనలో పడింది.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో భారీగా..

ఈ పథకానికి 21-55 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి సర్కారు అవకాశం కల్పించింది. మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి గరిష్ఠ వయోపరిమితిని 60 ఏళ్లుగా నిర్ణయించడంతో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపారు. ముఖ్యంగా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. అయితే, వీటి ఏర్పాటులో గతంలో జరిగిన అక్రమాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో పారదర్శకంగా యూనిట్లు ఎలా ఏర్పాటు చేయించాలనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక బ్యాంకు లింకేజీ ఉండే యూనిట్లకు సిబిల్‌ స్కోర్‌ ఆధారంగానే రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. చాలా మందికి సరైన సిబిల్‌ లేకపోవడం వల్ల రుణాలు పొందే విషయంలో ఆందోళన నెలకొంది. ఈ పథకానికి, సిబిల్‌ స్కోరుకు సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రకటించినప్పటికీ సిబిల్‌ సరిగా లేనివాళ్లను బ్యాంకర్లు ఎంపిక చేయలేదు. పథకం దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత చాలా మందికి కొత్తగా రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. దీంతో ఈ పథకాన్ని తమకూ వర్తింపజేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలనే అంశంపైనా ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ జోక్యంతోనూ..

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారులే చేస్తారని నిబంధనల్లో పేర్కొన్నా.. తుది జాబితాకు ఇన్‌చార్జి మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేయడంతో ఎంపికలో రాజకీయ జోక్యం పెరిగింది. ఎమ్మెల్యేలు సూచించిన వారినే ఎంపిక చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితబంధుపై వచ్చిన వ్యతిరేకతే యువ వికాసానికి ఎదురవచ్చని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా జిల్లాల్లో నిర్ణీత గడువులోపు దరఖాస్తుల పరిశీలన కూడా చేయలేకపోయినట్లు సమాచారం. మరోవైపు పరిశీలన సమయంలో దరఖాస్తుదారులు లేకపోతే వారి దరఖాస్తులను తిరస్కరించారు. ఇలా రాజీవ్‌ యువ వికాసం పథకంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులతో కొత్త మార్గదర్శకాల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి ఆగస్టు వరకు పట్టే అవకాశం ఉందని, పథకం అమలు చేయడానికి నిధుల కొరత కూడా ఉందని ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 2 వరకు యూనిట్ల మంజూరు పత్రాలు అందించాల్సి ఉంది. కానీ, చాలా జాప్యం జరిగే అవకాశం ఉండడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 06:34 AM