kumaram bheem asifabad- మొక్కలు నాటి సంరక్షించాలి
ABN, Publish Date - Jul 25 , 2025 | 10:32 PM
భావితరాలకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం వైద్య విద్యార్థులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): భావితరాలకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం వైద్య విద్యార్థులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలన్నారు. ఆసుప్రతి ఆవర ణలో గల ఖాళీ స్థలంలో ఫలాలు అందించే మొక్కలు, పూజల మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ఉర్దూ మాధ్యమ ఉన్నత పాఠశాలను విద్యాశాఖాధికారులతో కలిసి సందర్శించారు. తరగతి గదులు, ఉపాధ్యాయులు అందిస్తున్న బోధన, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, భోజనం, విద్యార్థుల ఆరోగ్యం అంశాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. ఏమైన సమస్యలు ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుధ్య పనులు ప్రతి రోజు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అదనపు తరగతి గదులు, శుద్ధమైన తాగునీరు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులను పలు సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి వారి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్, ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి ఉదయ్‌బాబు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జిలాల్లో ఆదివారం నిర్వహించనున్న గ్రామ పాలన అధికారుల స్ర్కీనింగ్, లైసెన్స్‌డ్ సర్వేయర్ల అర్హత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై శుక్రవారం పోలీసు, రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఆర్టీసీ, మున్సిపల్ కమిషనర్లు, ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకులు, ఇన్విజిలేటరు, ముఖ గుర్తింపు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న నిర్వహించనున్న గ్రామ పాలన అధికారుల స్ర్కీనింగ్, లైసెన్స్‌డ్ సర్వేయర్ల అర్హత పరీక్షను జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నామని చెప్పారు. గ్రామ పాలన అధికారులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహంచనున్నామని తెలిపారు. సంబంధిత శాఖాధికారులు సమన్వ యంతో పని చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సీతారాం, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషరావు, డీఎం రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గజానన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 10:32 PM