Osmania Hospital: ఉస్మానియా కొత్త ఆస్పత్రికి 31న శంకుస్థాపన
ABN, Publish Date - Jan 26 , 2025 | 03:32 AM
గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో ఉస్మానియా కొత్త ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
అధునాతన సౌకర్యాలతో గోషామహల్ స్టేడియంలో నిర్మాణం
బాధ్యతలు ఆర్‌అండ్‌బీ శాఖకే?
అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
రూ.2,150 కోట్ల వ్యయం అంచనా
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 31న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో ఉస్మానియా కొత్త ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్న వందేళ్ల అవసరాలకు తగ్గట్లుగా పూర్తి అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని సీఎం ఆకాంక్షించారు. నిర్మాణంలో ఏ విషయంలోనూ రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. ఆస్పత్రి భవన నిర్మాణాలతోపాటు బోధనా సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినులకు వేర్వేరుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఆస్పత్రి భవన నిర్మాణాలు, లే అవుట్, బిల్డింగ్ డిజైన్, ల్యాండ్ స్కేపింగ్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆస్పత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని, అవసరమైన చోట ఇతర మార్గాలను కలిపేలా అండర్‌పా్‌సలు నిర్మించాలన్నారు.
ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, పరామర్శకు వచ్చేవారి వాహనాలను నిలిపేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలన్నారు. డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటీన్, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలన్నారు. ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలుండాలని సీఎం ఆదేశించారు. అవయవాల మార్పిడి, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. ఆస్పత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలని, ఆస్పత్రికి వచ్చామనే భావన ఉండకూడదన్నారు. భవన నిర్మాణాల నమూనాల్లో పలు మార్పులను సీఎం సూచించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు పాల్గొన్నారు.
నిర్మాణ బాధ్యతలు ఆర్‌అండ్‌బీకే?
ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణ బాధ్యతలను తొలుత ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలె్‌పమెంట్ కార్పొరేషన్ (ఈడబ్ల్యూఐడీసీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ ప్రాజెక్టు చివరి నిమిషంలో రోడ్లు, భవనాల శాఖకు వెళ్లింది. తామే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ఆర్‌అండ్‌బీ కోరినట్లు, దాంతో సర్కారు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆస్పత్రి నిర్మాణ వ్యయ అంచనాలను ఆర్‌అండ్‌బీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు, రూ.2,150 కోట్ల వ్యయం అవుతుందని సర్కారుకు అంచనాలను సమర్పించినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 నూతన వైద్య కళాశాలల భవన నిర్మాణాల బాధ్యతలను ఈడబ్ల్యూఐడీసీ సర్కారు అప్పగించింది. తొలుత వీటిని కూడా ఆర్‌అండ్‌బీకే అప్పగించాలని నిర్ణయించినా.. చివరి నిమిషంలో కార్పొరేషన్‌కు అప్పగించాలని నిర్ణయించింది. గతంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ బాధ్యతలను ఆర్‌అండ్‌బీనే చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే వాటిని సకాలంలో పూర్తిచేయకపోవడం, ఎక్కువ రేట్లు కోట్ చేయడంతో పాటు ఇతర సాంకేతిక కారణాలతో నిర్మాణ బాధ్యతల నుంచి ఆర్‌అండ్‌బీని తప్పించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలను జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిల్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల్లో ఈ వైద్య కళాశాలలకు సంబంధించి స్థలాల గుర్తింపు కూడా ఇంతవరకు జిల్లా కలెక్టర్లు చేయలేదని సమాచారం.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 03:32 AM