యుద్ధప్రాతిపదికన పనులు చేయాలి
ABN, Publish Date - May 19 , 2025 | 12:14 AM
బేటీతండా, జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పథకాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
జానపహాడ్ ఎత్తిపోతల పథక పనుల ఆలస్యంపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి
పాలకవీడు, మే 18 (ఆంధ్రజ్యోతి) : బేటీతండా, జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పథకాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఎత్తిపోతల పథకాలను ఆయన పరిశీలించారు. రూ.34 కోట్లతో చేపట్టిన బేటీతండా ఎత్తిపోతల పథకం ద్వారా 2,041 ఎకరాలు సాగు చేయవచ్చని సుమారు 2,176 మంది రైతులు లబ్ధిపొందుతారన్నారు. బేటీతండా పథకం ద్వారా 90శాతం మంది బెట్టెతండా గిరిజనులకు లబ్ధిచేకూరుతుందన్నారు. అనంతరం జవహర్ జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. పనుల తీరును చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకానికి నిధులు మంజూరు చేయించానని, పనులు మాత్రం జరగడం లేదన్నారు. నవంబరులోగా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. భూసేకరణ కోసం కలెక్టర్‌కు రూ.2.59 కోట్లు నిధులు అం దించినట్లు తెలిపారు. పథకం ద్వారా పాలకవీడు మండలంలోని కోమటికుంట, జాన్‌పహాడ్, చెర్వుతండా, గుండ్లపహాడ్, గుండెబోయినగూడెం, అలింగాపురం, బొత్తలపాలెం, రాఘవాపురం, మీగడంపాడుతండాలకు సాగునీరు అందుతుందన్నారు. సుమారు 5,650 ఎకరాలకు సాగునీరందుతుందని, సుమారు 7వేల మంది రైతులకు లబ్ధిచేకూరుతుందన్నారు.
ఈ పథకం ద్వారా ఇంకా కొన్ని గ్రామాలకు సాగు నీరందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎన్నెస్పీ సీఈ రమే్‌షబాబు, కాంగ్రెస్ నాయకులు భూక్యా గోపాల్, మోతీలాల్, సుబ్బారావు, నర్సింహారావు, నీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 12:14 AM