హారికను ఆదుకుంటాం
ABN, Publish Date - Apr 17 , 2025 | 11:47 PM
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో రెండేళ్ల కిందట పిచ్చికుక్కల దాడిలో గాయపడి అచేతనస్థితికి చేరిన బాలిక హారికను ఆదుకుంటామని సీఎం రేవంతరెడ్డి భరోసా ఇచ్చారు.
వైద్యసేవలు, ప్రభుత్వసాయంపై పరిశీలించండి
ట్విట్టిర్ వేదికగా అధికారులకు సీఎం రేవంతరెడ్డి ఆదేశాలు
నాగార్జునసాగర్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో రెండేళ్ల కిందట పిచ్చికుక్కల దాడిలో గాయపడి అచేతనస్థితికి చేరిన బాలిక హారికను ఆదుకుంటామని సీఎం రేవంతరెడ్డి భరోసా ఇచ్చారు. మంత్రి దామోదర రాజనర్సింహ ద్వారా బాలిక విషయం తెలుసుకున్న సీఎం గురువారం హారికకు వైద్యసేవలు అందించడంతో పాటు ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకోవాలని ట్విట్టర్(ఎక్స్) వేదికగా అధికారులను ఆదేశించారు. చిన్నారి తాత కోమ్ము రాందాసు, తల్లి సిద్వంతి తెలిపిన వివరాల ప్రకారం సిద్వంతి భర్త రెండున్నర ఏళ్ల కిందట మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి సాగర్‌లో తల్లిగారింట్లోనే ఉంటోంది. రెండేళ్ల క్రితం చిన్నకుమార్తె హారిక(7) ఇంటి ముందు ఆటుకుంటుండగా పిచ్చికుక్కలు దాడిచేశాయి. రోడ్డుపై కొంతదూరం లాక్కెళ్లాయి. చిన్నారిని వెంటనే స్థానిక కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా రెండు డోసుల కుక్కకాటు ఇంజక్షన్లు వేశారు. మూడో డోసు వేసే సమయంలో తీవ్ర జ్వరంతో ఆ చిన్నారి బాధపడుతోంది. జ్వరం ఎంతకి తగ్గకపోవడంతో హారికను హైదరాబాద్ ఫివర్ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగానే కాళ్లూ, చేతులు స్పర్శను కోల్పోయాయి. దీంతో అక్కడి నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా కోమాలోకి వెళ్లింది. 18 నెలల పాటు కోమాలో ఉన్న హారికను నల్లగొండ, హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో దాతల సహకారంతో వైద్యం చేయించారు. దీంతో కోమాలో నుంచి బయటకువచ్చింది. కానీ మాటలు రావడం లేదని తల్లి సిద్వంతి తెలిపింది. అమ్మా అని కూడా పిలవలేని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తన కుమార్తెను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వివిధ దినపత్రికల ద్వారా వేడుకుంది. పత్రికల కథనాల ద్వారా విషయం మంత్రి దామోదార రాజనర్సింహ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్పందించి చిన్నారికి మెరుగైన వైద్యం అందిచాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. అంతే కాకుండా నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో బుధవారం మునిసిపల్ సిబ్బంది చిన్నారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక తయారుచేసి వైద్య, ఆరోగ్య శాఖకు పంపించారు. హారిక పరిస్థితిని మంత్రి సీఎం రేవంత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన హారిక పరిస్థితిపై ఆరా తీశారు. అంతే కాకుండా బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం గురువారం ట్విట్టర్ వేదికగా ఆదేశించారు.
సీఎంకు రుణపడి ఉంటాం
మా పాపకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, తమ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని సీఎం రేవంతరెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. ఇందుకు సీఎంకు రుణపడి ఉంటాం.
సిద్వంతి, చిన్నారి తల్లి
నేడు నిమ్స్‌కు తీసుకెళ్తాం
నేడు(శుక్రవారం) హారికను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్తాం. మంత్రి రాజనర్సింహ ఆదేశాలతో హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాం. ఇంటికి వచ్చిన ఆరోగ్యమిత్రకు చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదని తెలిపాం.
రాందాసు, హారిక తాత
Updated Date - Apr 17 , 2025 | 11:47 PM