పకడ్బందీగా ‘భూభారతి’ అమలు చేస్తాం
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:25 AM
‘భూభారతి’ చట్టాన్ని పకడ్బందీగా అమ లు చేస్తామని, ధరణితో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. సోమవారం చందంపేట మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
‘ధరణి’తో నష్టపోయిన రైతులందరికీ న్యాయం
చందంపేటను పైలెట్ మండలంగా ఎంపిక చేస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి
దేవరకొండ/చందంపేట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ‘భూభారతి’ చట్టాన్ని పకడ్బందీగా అమ లు చేస్తామని, ధరణితో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. సోమవారం చందంపేట మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని నాలుగు మం డలాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని జూన్ 2 నుంచి ఇక్కడి భూసమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. చందంపేటను పైలెట్ మండలంగా ఎంపిక చేస్తామన్నారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వలేదని కంభాలపల్లి, పొగిళ్ల, తెల్‌దేవరపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులు, రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ధరణితో మోసం చేసిందన్నారు. ‘భూభారతి’తో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మంత్రి హామీ ఇచ్చిరు. గతంలో పట్టాలు ఇచ్చిన డీలిమిటేషన్ ఫారెస్ట్ భూములను పరిశీలించి సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి అవగాహన పెంచుకొని రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఏఎస్పీ మౌనిక, తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ మండలానికి సర్వేయర్‌ను నియమించాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ప్రతీ మండలానికి ఒక సర్వేయర్‌ను నియమించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణిని ప్రారంభించడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కొన్ని గ్రామాలు ధరణిలో బ్లాక్ చేశారన్నారు. క్షేత్రస్థాయిలో భూములు ఉన్నవారికి పట్టాలు ఇవ్వడం, ఆన్‌లైన్‌లో నమోదు వంటివి పూర్తిచేసి సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు.
డీఫారెస్ట్ భూములు ఇచ్చారు, పాస్‌పుస్తకాలు ఇవ్వలేదు: శేఖర్‌రెడ్డి, రైతు కంభాలపల్లి
నాగార్జునసాగర్‌లో ముంపునకు గురికాగా, చందంపేట మండలంలోని కంభాలపల్లిలో అప్పటి ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పటి నుంచి భూమిని సాగు చేసుకుంటున్నాం. కానీ అటవీశాఖ అధికారులు భూమిని సాగు చేసుకోనివ్వడంలేదు. భూమిపై హక్కులు, పత్రాలు, పాస్‌పుస్తకాలు అందజేసి న్యాయం చేయాలి. భూభారతితో సమస్య పరిష్కారం అవుతుందని ఆశతో ఉన్నాం.
గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి : ఎమ్మెల్సీ శంకర్‌నాయక్
గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణిని ఏర్పాటు చేసి రైతులను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి భూసమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
బ్లాక్‌లో ఉన్న ఆరు గ్రామాల్లో సమస్యల పరిష్కారం : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
2027లో వచ్చిన ధరణి లో చందంపేట మండలంలోని ఆరు గ్రామాలు బ్లాక్ లో ఉన్నాయని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భూభారతితో ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూభారతి ద్వారా తహసీల్దార్ మండల కేంద్రంలోనే అన్ని సమస్యలు 70శాతం పూర్తవుతాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని రైతులను కోరారు.
భూసమస్యలన్నీ పరిష్కరించాలి : ఎమ్మెల్యే బాలునాయక్
చందంపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి భూసమస్యలన్నీ పరిష్కరించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. భూభారతితో డీఫారెస్ట్, అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పూర్తయితే దేవరకొండ నియోజకవర్గంలోని 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.1,800కోట్లను డిండి ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 12:25 AM