రెండుగంటల వర్షం..24గంటలు ఆగమాగం
ABN, Publish Date - May 03 , 2025 | 11:14 PM
గాలులు, వడగళ్లతో సుమారు రెండు గంటలపాటు కురిసిన వర్షంతో జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం 24 గంటల పాటు ఆగమాగం అయింది.
విద్యుత పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది బిజీ
కాల్వలను శుభ్రం చేసే పనిలో పారిశుధ్య కార్మికులు
భువనగిరి టౌన, మే 3 (ఆంధ్రజ్యోతి): గాలులు, వడగళ్లతో సుమారు రెండు గంటలపాటు కురిసిన వర్షంతో జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం 24 గంటల పాటు ఆగమాగం అయింది. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడి ఆ రాత్రంతా పట్టణం ఆంధకారంలోనే ఉంది. పలు ప్రాంతాల్లో రహదారులపై చెట్లు, విద్యుత స్తంభాలు నేలకొరిగాయి. మురికి నీటి కాలువలు వరదతో పొంగిపొర్లి బురదతో కూరుకుపోయాయి. దీంతో శుక్రవారం రాత్రి, వర్షం కురిసిన వెంటనే మునిసిపల్ పారిశుధ్య, పట్టణ ట్రాన్సకో విభాగాలు వేర్వేరుగా రంగంలోకి దిగాయి. విరిగిపడిన చెట్లను తొలగిస్తూ మురికి కాలువలను, వ్యర్థాలు పేరుకుపోయిన రహదారులను శుభ్రం చేశారు. తెగిపడిన విద్యుత వైర్లను, స్తంభాలకు మరమ్మత్తులు చేశారు. కార్మికులు, సిబ్బంది అధికారులు క్షేత్రస్థాయిలో శ్రమించిన తీరును పలువురు ప్రశంసించారు. మునిసిపల్ కమిషనర్ జి.రామలింగం, శానిటరీ ఇనపెక్టర్ రజిత, ట్రాన్సకో టౌన ఏఈ సాయికృష్ణ తదితర అధికారులు మరమ్మత్తు పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. దీంతో రెండు గంటల వర్షంతో ఏర్పడిన ఇబ్బందులు శనివారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చాయి. సుమారు 6 సంవత్సరాల క్రితం కేవలం ఆరు నిమిషాల పాటు గాలులతో కూడిన భారీ వర్షం ఆరోజు పట్టణాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం జరగడంతో పాటు ఇరువురు మృత్యువాత పడ్డారు. ఆ తరువాత సుమారుగా అదే తరహాలో వర్షం, గాలి శుక్రవారం రాత్రి పట్టణాన్ని భయపెట్టాయి. కానీ అప్పటితో జరిగిన నష్టంతో పోలిస్తే నేటి నష్టం కనిష్టంగా ఉండటం ఊరడింపుగా ఉన్నదని పట్టణవాసులు అంటున్నారు. అయితే అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రాత్రి అంతా అంధకారంలోనే..
గాలులతో కూడిన అకాల వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాలలో విద్యుత సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లావ్యాప్తంగా 11కెవి స్తంభాలు 52, ఎల్‌టి స్తంభాలు 41, మూడు ట్రాన్సఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత వైర్లు తెగిపడ్డాయి. వైర్లు తెగిపడిన వెంటనే విద్యుత సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మేరకు జిల్లా విద్యుత శాఖకు సుమారు రూ. 25 లక్షల ఆస్తినష్టం సంభవించింది. పల ప్రాంతాలలో విద్యుత వైర్లు, స్తంభాలపై కూలిన, వంగిన చెట్లను నరికి వేశారు. కాగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో ఉత్పన్నమైన సమస్యలతో జిల్లాలోని పలు ప్రాంతాలు ఆ రాత్రంతా అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత సిబ్బంది బృందాలుగా క్షేత్రస్థాయిలో శ్రమించి శనివారం సాయంత్రానికి విద్యుత సరఫరాను పునరుద్దరించారు. అయినప్పటికీ పలుసార్లు విద్యుత సరఫరాకు అంతరాయం కలిగింది. ఎస్‌ఈ సుధీర్‌తో పాటు అధికారులందరూ రోజంతా మరమ్మతు పనులలోనే గడిపారు. ఒకవైపు వర్షం, మరోవైపు అంధకారంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా ఆసుపత్రితో సహా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. చార్జింగ్ లేకపోవడంతో పలువురి సెల్‌ఫోన్లు మూగబోయాయి. కాగా వర్షాలు కురుస్తున్నప్పుడు, గాలులు వీస్తున్నప్పుడు విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్లకు ప్రజలు దూరంగా ఉండాలని, ప్రమాదాలు జరిగినా, విద్యుతఘాతానికి అవకాశమున్న ప్రదేశాలపై సమాచారం ఇవ్వాలని ట్రాన్సకో అధికారులు పేర్కొంటున్నారు. ఇళ్లు, వ్యవసాయ బావుల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నేలరాలిన మామిడి కాయలు
భువనగిరి రూరల్: బలమైన ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో మామిడికాయలు నేలరాలాయి. భువనగిరి రూరల్ ట్రాన్సకో పరిధిలో 4విద్యుత స్తంభాలు విరిగి కిందపడ్డాయి. దీంతో ట్రాన్సకో అధికారులు నూతన విద్యుత స్తంభాల ఏర్పాటుకు, విద్యుత తీగల మరమ్మతు పనులను వేగవంతం చేశారు. కాగా రాయిగిరి , కేసారం, బాలంపల్లి, కూనూరు, రామచంద్రాపురం, వీరవెల్లి తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం వరకు విద్యుత సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు ట్రాన్సకో అధికారులు తెలిపారు. భువనగిరి మండలంలోని అనాజిపురం, బొమ్మాయిపల్లి, హుస్సేనాబాద్, ముత్తిరెడ్డిగూడెం, బస్వాపూర్, గౌస్‌నగర్, అనంతారం, హన్మాపురం, నాగిరెడ్డిపల్లి, బొల్లేపల్లి గ్రామాల్లో 30 మంది రైతులకు సంబంధించి 170 ఎకరాల్లో మామిడి నేలరాలినట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుభాషిని తెలిపారు. శనివారం ఉదయం ఆయా గ్రామాల్లో నేలరాలిన మామిడిని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. భువనగిరి మండల వ్యవసాయ అధికారి డి.మల్లేశ, ఏఈవో వెంకట్రావు, భువనగిరి ఉద్యానవన శాఖ అధికారి మాధవి పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. సుమారు రూ.17లక్షల విలువ గల మామిడి పంటకు నష్టం వాటిల్లిన్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
పగలు ఎండ....సాయంత్రం ఈదురు గాలులు
చౌటుప్పల్‌టౌన : చౌటుప్పల్ పట్టణంలో రెండు, మూడు రోజులుగా పగలు ఎండ, సాయంత్రం అయితే చాలు ఈదురు గాలులతో కూడిన చిటపట చినుకులు కురుస్తుండడంతో రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గత నెలలో రెండు పర్యాయాలు భారీ వర్షం కురియడంతో ధాన్యం రాశులు తడిశాయి. అష్ట కష్టాలు పడి ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు తూకాలకు సిద్ధం చేశారు. సీరియల్ కోసం ఎదురు చూస్తున్న రైతులకు అకాల వర్షాలు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాత్రి పూట చినుకులు కురియడం, ఈదురు గాలులు వీయడం వంటి పరిణామాలతో రైతులకు కంటి మీద కునుకు లేని పరిస్థితి ఏర్పడింది. ధాన్యం రాశులపై కప్పిన టార్ఫాలిన కవర్లు ఈదురు గాలులకు కొట్టుకు పోతున్నాయి. వాటిని రక్షించడం రైతులకు పెనుభారంగా మారిందని చెప్పవచ్చు. గత నెల 18వ తేదీ నుంచి ధాన్యం తూకాలను ప్రారంభించి శనివారం నాటికి 81 మంది రైతులకు చెందిన 24, 500 బస్తాల ధాన్యాన్ని తూకాలు వేశారు. ఇంకా 131 మంది రైతులకు చెందిన సుమారు 35వేల బస్తాల ధాన్యాన్ని తూకాలు వేయవలసి ఉంది. ఐదు కాంటాల ద్వారా 30 నుంచి 35 మంది హమాలీలు ధాన్యం తూకాలు వేస్తున్నారు. ఏఎంసీ చైర్మన ఉబ్బు వెంకటయ్య, సెక్రటరీ రవీందర్ రెడ్డి, పీఏసీఎస్ సెక్రటరీ వై.రమేష్ ఎప్పటి కప్పుడు తూకాలను పరిశీలిస్తున్నారు.
Updated Date - May 03 , 2025 | 11:15 PM