సామాజిక గౌరవం దిశగా..
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:18 AM
సూర్యాపేటలో ఏర్పాటుచేసిన కుట్టుశిక్షణ కేంద్రం ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. బిక్షాటన, ఇతర పద్ధతుల ద్వారా ఉపాధి పొందుతున్న స్వయం ఉపాధితో వారు సమాజంలో గౌరవం పొందేలా కుట్టు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం 35 మంది శిక్షణ శిక్షణ తీసుకుంటున్నారు.
సూర్యాపేటలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత కుట్టుశిక్షణ
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట (కలెక్టరేట్): సూర్యాపేటలో ఏర్పాటుచేసిన కుట్టుశిక్షణ కేంద్రం ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. బిక్షాటన, ఇతర పద్ధతుల ద్వారా ఉపాధి పొందుతున్న స్వయం ఉపాధితో వారు సమాజంలో గౌరవం పొందేలా కుట్టు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం 35 మంది శిక్షణ శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ ద్వారా వారిలోని నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్‌లో మంచి స్థితిలో జీవించేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా శిక్షణ అనంతరం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ఆర్థికసాయం కూడా అందించనుంది. దీంతో వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉపాధి పొందుతూ గౌరవప్రద జీవితాన్ని గడపనున్నారు.
సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎన్నో అసమానతలు ఎదుర్కొంటున్నారు. సరైన జీవనోపాధి లేక ఇబ్బందికర జీవనం సాగిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపుకావాలని అందుకు జీవనోపాధి కల్పించాలని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అందుకు వారికి శిక్షణ సైతం ఇప్పించారు. అయితే ఇటీవల సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ నిర్వహించిన మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సమావేశానికి ట్రాన్స్‌జెండర్లను ఆహ్వానించారు. తమకు ఏదైనా ఉపాధి కల్పించాలని, భిక్షాటన, ఇతర పనులు చేయడం ఇబ్బందిగా ఉందని, తమకంటూ సమజాంలో గౌరవం దక్కాలని కలెక్టర్‌కు వివరించారు. తాము కూడా గౌరవప్రదంగా జీవించాలని అందుకు తమకు ఏదైనా చేయాలని కలెక్టర్‌ను కోరారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను విన్న కలెక్టర్ వెంటనే జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ద్వారా ట్రాన్స్‌జెండర్లకు కుట్టు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన నిధులను డీఎంఎ్‌ఫటీ నుంచి మంజూరు చేస్తానని తెలిపారు. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ సమీపంలో మహిళా సాధికారిత ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు కుట్టుశిక్షణలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఈశిక్షణ రెండు నెలలపాటు కొనసాగనుంది.
35 మంది హాజరు..
సూర్యాపేటలో ట్రాన్స్‌జెండర్లకు అందిస్తున్న ఉచిత కుట్టు శిక్షణకు ప్రస్తుతం 35 మంది హాజరవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిక్షణ అందిస్తున్నారు. ముఖ్యంగా జాకెట్లు, లంగాలు, పంజాబీ డ్రెస్‌లతో పాటు ఇతర దుస్తువులకు సంబంధించిన కటింగ్ చేసి కుట్టు విధానాన్ని నేర్పిస్తున్నారు. రెండు నెలల పాటు శిక్షణ అందించనున్నారు.
ఉపాధి అవకాశాలు
కుట్టుశిక్షణతో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి లభించనుంది. వారు నివసించే ప్రాంతాల్లో అయినా, ఇతరచోట్ల అయినా కుట్టుమిషన్ ద్వారా వివిధరకాల దుస్తులు కుట్టి ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కుట్టు విభాగంలో అనేక నూతన పద్ధతులు వచ్చాయి. అల్లికలు, బొటిక్‌తో పాటు ఇతర పద్ధతులను కూడా నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. శిక్షణ అనంతరం స్వయంఉపాధికి అవసరమైన సాయం కూడా ప్రభుత్వం నుంచి అందించనుంది.
పైలెట్ ప్రాజెక్ట్‌గా కుట్టుశిక్షణ
ట్రాన్స్‌జెండర్లకు సూర్యాపేటలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టుశిక్షణ రాష్ట్రంలోనే మొదటిది. ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం నుంచి చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటి వరకు లేవు. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ట్రాఫిక్ విధుల్లోకి తీసుకున్నారు. సమాజానికి స్ఫూర్తి కలిగించేలా ట్రాన్స్‌జెండర్లకు జీవనోపాధి అందించేందుకు ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం సూర్యాపేటలో కుట్టు శిక్షణను ప్రారంభించారు.
శిక్షణతో జీవనోపాధికి దోహదంతి : తనుశ్రీ, ట్రాన్స్‌జెండర్, సూర్యాపేట.
ప్రభుత్వం అందించే ఉచిత కుట్టు శిక్షణ జీవనోపాధికి దోహదపడనుంది. కుట్టు శిక్షణ అనంతరం స్వయం ఉపాధి పొంద ుతూ సమాజంలో గౌరవంగా జీవిస్తాం. ట్రాన్స్‌జెండర్లంటే సమాజంలో చిన్నచూపు ఉంది. కుట్టు శిక్షణ ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త ఆశాకిరణం. కుట్టు శిక్షణను ట్రాన్స్‌జెండర్లు సద్వినియోగం చేసుకోవాలి.
గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకే : నర్సింహారావు, సంక్షేమాధికారి, సూర్యాపేట జిల్లా
ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గౌరవప్రద మైన జీవితాన్ని అందించేందుకు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయించారు. ఈ శిక్షణతో వారు స్వయంఉపాధి పొందనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ట్రాన్స్‌జెండర్లు ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.
Updated Date - Jun 18 , 2025 | 12:18 AM