ఏ ఊరికి.. ఎంత దూరం..
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:33 AM
ప్రతీ ప్రయాణంలో రోడ్డు భద్రత నియమాలు పాటించకుంటే అపాయం పొంచి ఉన్నట్లే.. ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. అందుకే రోడ్డు భద్రతలో భాగంగా రోడ్లపై పలు సూచనల బోర్డులను ఏర్పాటు చేస్తారు.
మైలురాళ్లు.. సూచికబోర్డులు ఏవీ?
ఇబ్బందిపడుతున్న వాహనచోదకులు
రాజాపేట, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ప్రతీ ప్రయాణంలో రోడ్డు భద్రత నియమాలు పాటించకుంటే అపాయం పొంచి ఉన్నట్లే.. ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. అందుకే రోడ్డు భద్రతలో భాగంగా రోడ్లపై పలు సూచనల బోర్డులను ఏర్పాటు చేస్తారు. బోర్డుల పై ఉన్న సూచనలు పాటిస్తూ జాగ్రత్త వహిస్తే ఏ ప్రమాదం చోటు చేసుకోదు. నేడు రోడ్లపై ఎటువంటి సూచనల బోర్డులు కనిపించడం లేదు. వాటిని ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. సూ చిక బోర్డులు, మైలురాళ్లు లేక పోవడంతో రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాజాపేట మండలంలో మూడు డబుల్ రోడ్లు, 12 సింగిల్ రోడ్లు ఉన్నాయి. మండలంలో 59కిలోమీటర్లు డబుల్ తారు రోడ్లు, 90 కిలోమీటర్లు మేర సింగిల్ తారు రోడ్లు ఉన్నాయి.
ప్రయాణికులకు తిప్పలు
మైలురాళ్లు, సూచిక బోర్డులు లేక పోవడంతో రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై వెళుతుంటే బాటసారులను అడగాల్సి వస్తోంది. లేదంటే గూగుల్ మ్యాపు సాయంతో వెళ్లాల్సి వస్తుంది. నెట్ సరిగా పనిచేయక పోయినా, అప్పుడప్పుడు తప్పుగా చూపెట్టినా చుట్టూ తిరగాల్సి వస్తోంది. సూచిక బోర్డులు లేకపోవడంతో మూలమలుపుల వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మండలంలో ఇటువంటి సంఘటనలతో కొందరి ప్రయాణికులు తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. గతంలో మండలంలోని పారుపల్లి వాగు మూలమలుపు వద్ద ప్రమాదం జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోగా కొంత మందికి గాయాలయ్యాయి. యాదగిరిగుట్ట, కొమురవెళ్లి కి నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. ఈ రహదారిపై మూలమలుపులు అధికంగానే ఉంటాయి. ఎటువంటి సూచిక బోర్డులు లేక పోవటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మండలంలో బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో దాతలు బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మైలురాళ్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కల్వర్టులు..మూలమలుపులు తెలిసేది ఎలా?
ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ఎంత దూరం, ముందున్నది ఏ గ్రామం. ప్రయాణించాల్సింది ఎంత దూరం. ఎటువైపు వెళితే ఏగ్రామం వస్తుంది. ముందు మూలమలుపు ఉందా? కల్వర్టు, ఇరుకు రోడ్డు ఉందా? స్పీడ్‌బ్రేకరు ఉందా? ఇది ఏ రోడ్డు అంటూ ముందస్తు సూచనలు చేసేవే ఈ సూచికబోర్డులు, మైలురాళ్ళు. మైలురాళ్లను ఫర్లాంగ్‌కు ఒక చిన్న రాయి ని,కిలోమీటర్‌కు ఒక పెద్ద రాయిని ఏర్పా టు చేస్తారు. రాష్ట్రంలో నాలుగు రకాల రోడ్లు ఉండగా ఆ రోడ్ల పై ఉండే ఒక్కో మైలురాయి ఒక్కో రంగును కలిగి ఉండి అది ఏ రోడ్డో సూచిస్తుంది. మైలురాయి పై క్రింది భాగంలో తెల్లని రంగు పైభాగంలో పసుపుపచ్చ, ఆకుపచ్చ, నీలం, నలుపు, ఎరుపు ఆరెంజ్ రంగులతో కనిపిస్తాయి. పసుపు రంగు ఉంటే నేషనల్ హైవే రోడ్డును,ఆకుపచ్చ రంగు స్టేట్ హైవే రోడ్డును, నీలం, నలుపు రంగు జిల్లా, నగరం రోడ్డుగా, ఎరుపు ఆరెంజ్ గ్రామీణ ప్రాంతాల రోడ్లను సూచిస్తాయి.
సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి
రోడ్లపై మైలురాళ్లు, సూచికబోర్డులు కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలి.
-స్వామి, బొందుగుల గ్రామస్థుడు
ప్రమాదాల నుంచి కాపాడాలి
సూచిక బోర్డులు లేక పోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు ప్ర జలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. మండలంలో రహదారులపై మూలమలుపులు అధికంగా ఉన్నాయి. అక్కడక్కడా రోడ్డు పక్కన బావులున్నాయి. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
- జశ్వంత, రాజాపేట గ్రామస్థుడు
బోర్డులను ఏర్పాటు చేస్తాం
రోడ్లపై మైలురాళ్ళు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తాం. బోర్డుల ఏర్పాటుకు ప్రణాళికలు పంపాము.
- విజయ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఏఈ,
Updated Date - Apr 19 , 2025 | 12:33 AM