స్థానిక సంగ్రామానికి.. సై
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:28 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణ ఖాయంగా ఉంటుందనే సంకేతాలతో పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నాయి.
పరిషత్ ఎన్నికలపై పార్టీల కసరత్తు
ప్రతి స్థానమూ దక్కించుకునేలా కాంగ్రెస్ వ్యూహం
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణ ఖాయంగా ఉంటుందనే సంకేతాలతో పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఈ దిశగా కార్యాచరణ మొదలుపెట్టాయి. వామపక్ష పార్టీల నాయకులు సైతం అవకాశమున్నచోట బరిలో దిగేందుకు ప్రయత్నిస్తుండగా, బీఆర్‌ఎస్ నాయకులు సైతం రిజర్వేషన్లు ఖరారయితే పోటీపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక ఎన్నికల పోరుకు రాజకీయపార్టీలు, నాయకులు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో క్షేత్రస్థాయిలో సందడి మొదలైంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ స్థానిక సంస్థల్లోనూ విజయబావుటా ఎగురవేయడమే ఏకైక లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది. ఓ వైపు ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సీరియ్‌సగా కొనసాగిస్తున్న ఆ పార్టీ ఉమ్మడి జిల్లాలో తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పట్టుని నిరూపించుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వంద శాతం విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా గురిపెట్టారు. తమతమ నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఏ రిజర్వేషన్ వస్తే ఎవరికి అవకాశమివ్వాలి....? బలమైన నాయకులకు అవకాశమివ్వలేకపోతే వారికి ఎలా నచ్చజెప్పాలనే అంశంలో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు కేడర్‌లో చర్చ సాగుతోంది. పార్టీకి, నాయకత్వానికి విధేయతగా ఉంటూ వచ్చిన నాయకులు, యువతకు ఈసారి అవకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలు సూచించిన వారికే అభ్యర్థిత్వాలు దక్కనుండడంతో ద్వితీయ, క్షేత్రస్థాయి నాయకులు వారిని ప్రస న్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మండలంలో, ఎంపీటీసీ స్థానం పరిధిలో తమ మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రుల ను కలుస్తూ వారి దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు.
పోటీకి సై అంటోన్న ప్రతిపక్షాలు..
ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల్లో పోటీచేసి సత్తా చాటేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సైతం సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రె్‌సతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుపై అధిష్ఠానంనుంచి స్పష్టత వస్తే దానికనుగుణంగా పోటీచేసే అంశంపై కార్యాచరణ రూపొందించుకునేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతుండగా, సీపీఎం తమకు పట్టున్న స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఆయా స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న నాయకులు ఇప్పటికే స్థానిక సమస్యలపైనా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు సైతం స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఎన్నికల ప్రకటన విడుదల చేసిన తక్షణమే అభ్యర్థుల ఎంపికచేసి ప్రచారంలోకి దిగుతామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. రిజర్వేషన్లు తేలితే అభ్యర్థుల ఎంపిక చేపట్టేందుకు పార్టీనేతలు సిద్ధంగా ఉన్నారు.
రంగం సిద్ధం చేసుకుంటున్న నేతలు ..
పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న స్థానిక నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలే కీలక పాత్ర వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ అదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే జిల్లాస్థాయిలో వర్క్‌షాపులు నిర్వహించింది. త్వరలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో వర్క్‌షాపులు నిర్ణయించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన ఎజెండాను ఖరారు చేస్తున్నారు. ఏ రిజర్వేషన్ వస్తే ఏ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే విషయంలోనూ పార్టీ ఆరా తీస్తుంది. ప్రతి స్థానం నుంచి ముగ్గురి పేర్లను పరిశీలించి అభ్యర్థిని ఎంపికచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్షాలు సైతం స్థానిక ఎన్నికల్లో బలంగా పోటీపడాలని భావిస్తుండడంతో స్థానిక సమరం రసవత్తరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Updated Date - Jul 23 , 2025 | 12:28 AM