ఈదురుగాలుల బీభత్సం
ABN, Publish Date - May 03 , 2025 | 12:00 AM
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
భువనగిరి టౌన, మే 2 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత తీగలు తెగిపడ్డాయి. స్తంభాలు ఒకవైపుకు ఒరిగాయి. దీంతో పట్టణంలో గంటల తరబడి విద్యుత సరఫరా నిలిచింది. రోడ్డుకు ఆడ్డంగా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు గృహాలు, డబ్బా దుకాణాల పైకప్పు రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. కొన్ని బస్తీల్లో వడగండ్లు కురవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రహదారులు, మురికికాలువలు, లోతట్టు ప్రాతాలు వరద నీటితో నిండాయి. మునిసిపల్ రెస్క్యూ టీమ్‌లు రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను తొలగించాయి. వరద నీటి ప్రవాహం వెళ్లేలా మురికి కాల్వలను శుభ్రం చేశారు. ట్రాన్సకో సిబ్బంది విద్యుత సరఫరా పునరుద్ధరణ పనులను చేపట్టారు.
తుర్కపల్లి : తుర్కపల్లి మండల కేంద్రంతో పాటు దత్తాయపల్లి, వేలుపల్లి, మాధాపూర్, వీరారెడిపల్లి, తిర్మాలాపూర్, వాసాలమర్రి తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి అన్నదాతలకు, మామిడి తోట యాజమానులకు భారీ నష్టం వాటిల్లింది. పంట చేతి కొచ్చే సమయంలో వడగళ్ల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. భారీ ఈదురు గాలులకు తోటల్లో కాయలు పూర్తిగా రాలిపోవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. ప్రధానంగా పలుగ్రామాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్లు పడ్డాయి. కచ్చకాయ పరిమాణంలో వడగండ్లు పడడంతో రెండు, మూడు రోజుల్లో చేతికొచ్చే పంట దెబ్బతిని రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఐకేపీ, పీఎసీఏస్ ధాన్యం కొనుగోలు కేంరద్రాల్లో ధాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి.
గౌరాయిపల్లిలో పిడుగు పాటుకు ఆవు మృతి...
యాదగిరిగుట్ట రూరల్:యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు బైర శ్రీనివా్‌సకు చెందిన ఆవు మృతి చెందింది. సుమారు రూ.70వేల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. పాడుఆవు మీద ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్థులు కోరారు. అదే విఽధంగా గుట్ట పట్టణంలో సుమారు గంటసేపు భారీవర్షం కురిసింది.
కూలిన చెట్లు, విద్యుత స్తంభాలు
దేవరకొండ/కొండమల్లేపల్లి/చింతపల్లి : నల్లగొండ జిల్లా దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లో శుక్రవారం సాయం త్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దేవరకొండలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత సరఫరా నిలిచింది. కొండమల్లేపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి నల్లగొండ రోడ్డు పాత ఊరిలో 33కేవీ విద్యుత స్తంభం కూలీ ఇంటిపై పడింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమా దం తప్పింది. చెట్లు విరిగి ఇళ్లపై పడ్డాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వరి పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడుతుండటంతో రైతులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలిన విద్యుత స్తంభాలకు మరమ్మతులు నిర్వహించి విద్యుత సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని కొండమల్లేపల్లి కాలనీవాసులు విద్యుత అధికారులను కోరుతున్నారు. అదేవిధంగా చింతపల్లి మండలంలోని ఎం.మల్లేపల్లి, ఉమ్మాపురం, సాయిరెడ్డిగూగెం, కుర్మపల్లి, పి.కే.మల్లేపల్లి, వింజమూర్, తక్కళ్లపల్లిలో ఉరుములతో కూడిన రాళ్ల వర్షం కురిసింది.
పెద్దఅడిశర్లపల్లి : పెద్దఅడిశర్లపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. స్థానిక పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై కప్పిన పట్టాలు ఎగిరిపోయి ధాన్యం తడిసింది. కొట్టాలగడ్డ గ్రామంలో పెరిక ముత్యాలు ఇంటి ఆవరణలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అకాల వర్షానికి అంగడిపేట స్టేజీ, ఘనపురం, గుడిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల చుట్టూ వరద చేరింది. కొన్నికేంద్రాల్లో ధాన్యాన్ని కాంటా వేసినా లారీల జాప్యంతో ఎగుమతులు నిలిచి వర్షానికి తడిసి ముద్దయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుకు శాపం
పీఏసీఎ్‌సలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాంటా వేసి బస్తాలలో లోడు చేసిన ధాన్యం సకాలంలో లారీలు రాకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. గుడిపల్లి మండంలో గత నెల 22న కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇంత వరకు మిల్లలకు ఎగుమతి చేయలేదు. లారీలు, హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లు కూడా మందగించిందని అధికారులు తెలిపారు. అప్పటినుంచి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తేమ చూడలేదని రైతులు ఆరోపించారు. ఒక్కసారిగా వాతావర ణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వేసి, ఎగుమతులు పూర్తిచేసేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
50 ఎకరాల్లో మామిడి పంట నష్టం
కోదాడరూరల్, మే 2 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వర్షానికి అనేకచోట్ల విద్యుత స్తంభాలు కూలిపోగా, పలుచోట్ల ఇంటి పైకప్పుల రేకులు ఎగిరిపోవడంతో పాటు మామిడితోటలకు తీవ్రనష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఇబ్బందులుపడ్డారు. రెడ్లకుంట, కాపుగల్లు, దోరకుంట, నల్లబండగూడెం,చిమిర్యాల గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో మామిడికాయలు రాలి తీవ్రనష్టం జరిగింది. చిమిర్యాల గ్రామానికి చెందిన రావూరి వెంకటేశ్వరరావుకు చెందిన ఐదుఎకరాల్లో మామిడి తోటలో కాయలు రాలి తీవ్రనష్టం జరిగింది. కాయ కొంత పగిలిందని, మార్కెట్‌కు తీసుకెళ్లినా రేటు వచ్చే అవకాశం లేదని రైతు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తోటను రూ.2 లక్షలకు కౌలుకు తీసుకున్నానని, ఈదురుగాలులతో తీవ్రనష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
కాపుగల్లులో ఈదురుగాలులకు రైతు బాలెబోయిన రాజు చెందిన 10 ఎకరాల మామిడితోటలో కాయలు రాలాయి. రూ.4 లక్షలకు కౌలుకు తీసుకుని సాగు చేశానని, రాలిపోయిన కాయలను విక్రయించినా కూలీల డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్లకుంటలో పిడమర్తి పెద్దసైదులు, అన్నెపంగు వెంకట్, నూకపంగు దిలీప్, సైదులుకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రెడ్లకుంట, నల్లబండగూడెం గ్రామాల్లో విద్యుత స్తంభాలు విరిగిపోయి విద్యుత సరఫరాకు నిలిచిందని గ్రామస్థులు తెలిపారు. రెడ్లకుంటతో పాటు నల్లబండగూడెం, కూచిపూడి గ్రామాల్లోనూ ఈదురుగాలులకు అనేక ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయని గ్రామస్థులు తెలిపారు. నల్లబండగూడెం, రెడ్లకుంట, దోరకుంట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని రైతులు తెలిపారు. రెడ్లకుంట గ్రామంలో ఇళ్లు కూలిపోయిన వారిని మాజీ సర్పంచ సాతినేని లీలా అప్పారావు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Updated Date - May 03 , 2025 | 12:00 AM