ముదిమాణిక్యం మేజర్.. చూస్తే బేజార్
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:32 AM
వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సాగుకు నాగార్జునసాగర్ ఆయకట్టులోని రైతులు సన్నద్ధమవుతున్నారు.
కూలిన రిటైనింగ్ వాల్
పలుచోట్ల పగుళ్లు, దెబ్బతిన్న లైనింగ్
పట్టించుకోని అధికారులు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సాగుకు నాగార్జునసాగర్ ఆయకట్టులోని రైతులు సన్నద్ధమవుతున్నారు. జలాశయం నిండితే సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయి తే ఎడమ కాల్వపై ఉన్న ప్రధాన మేజర్లు, కాల్వల పరిస్థితి చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లాలోని ముఖ్య మేజర్ల లో ఒకటైన నిడమనూరు మండలం ము కుందాపురం వద్ద ఉన్న ముదిమాణిక్యం మేజర్ అధ్వానంగా ఉంది. కాల్వలకు నీటి వి డుదల సమయం దగ్గరవుతున్నా ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి-నిడమనూరు)
ముదిమాణిక్యం మేజర్ కాల్వ అధ్వానంగా మారింది. మేజర్ తూము ద్వారా నీటిని విడుదల చేసే మొదట్లోనే రిటైనింగ్ వాల్ గత సీజనలోనే కూలింది. కొంతకాలంగా ఈ గోడ ధ్వంసమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా కూలి ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు కాల్వకు పలుచోట్ల పగుళ్లు ఏర్పడి లైనింగ్ దెబ్బతింది. నీటి విడుదల సమయంలోనే దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టలేదు. సీజన్ మొదలు కావడంతో పంటల సాగుకు రైతు లు సమాయత్తమవుతున్నా మరమ్మతుల ఊసే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం వేచి ఉన్న అధికారయంత్రాంగం కాల్వలకు నీటిని విడుదల చేసే సమయంలో మరమ్మతుల పనులు ఏదో మొక్కుబడిగా చేస్తుండటంతో పనుల్లో నాణ్యత లోపిస్తోంది. కొద్దికాలానికే మళ్లీ కాల్వలు దెబ్బతింటున్నాయి. కాల్వలు బాగులేని కారణంగా ఆయకట్టు చివరి భూములకు సాగునీరు సక్రమంగా అందడంలేదని రైతులు వాపోతున్నారు. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కిన సందర్భాలూ ఉన్నాయి.
ఆరు మండలాలు 25వేల ఎకరాలు
ముదిమాణిక్యం మేజర్ ద్వారా నిడమనూరు, త్రిపురారం, తిరుమలగిరిసాగర్, అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల్లోని 25వేల పైచిలుకు ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ మేజర్ కాల్వ ద్వారా ఆయకట్టుకు నిత్యం డిజైన్ డిశ్చార్జి మేరకు 410 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో 500 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసిన పరిస్థితులూ ఉన్నాయి. ఈ కాల్వ సుమారు 38 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది.
అసంపూర్తి పనులు
గతంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన సాగర్ ప్రధాన కాల్వ ఆధునికీకరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కట్టకు ఇరువైపులా సీసీ లైనింగ్ పనులు పూర్తిస్థాయిలో చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. అలా వదిలేసిన చోట్ల కాల్వ కట్టలు నీటి ఉధృతికి కోతకు గురయ్యే ప్రమాదం ఉందని రైతు లు వాపోతున్నారు. కాల్వ లు అధ్వానంగా చివరి భూములకు సాగునీరు ఎలా అం దుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాల్వ జీరో కిలోమీటర్ నుంచి 72వ కిలోమీటర్ వరకు వివిధ మరమ్మతు పనుల కోసం రూ.60 కోట్ల మేరకు అంచనాలతో ప్రతిపాదనలు పంపించినా ఇంతవరకు ఆమోదం పొందలేదు. ప్రధాన కాల్వ కట్టకు లైనింగ్ అస్తవ్యస్థంగా ఉండటంతో రెండేళ్ల క్రితం నిడమనూరు మండలం ముప్పారం వద్ద కాల్వ కట్ట తెగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనను గుర్తించుకుని అయినా అధికారులు సకాలంలో కాల్వకు మరమ్మతుల చేయించాలంటున్నారు.
సకాలంలో మరమ్మతులు చేపట్టాలి
ముదిమాణిక్యం మేజర్ కాల్వ రిటైనింగ్ వాల్ కూలిపోయి ప్రమాదకరంగా మారినా మరమ్మతులు చేపట్టకపోవడం శోచనీయం. గోడ కూలిపోవడంతో పాటు కాల్వలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. మరమ్మతుల పనులు నాణ్యతతో సకాలంలో పూర్తిచేసి ఆయకట్టుకు సక్రమంగా సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. కాల్వ చివరి భూములకు నీరందేలా చూడాలి.
- సీతారాంరెడ్డి, రైతు, నారమ్మగూడెం.
టెండర్లు ఖరారు కాగానే పనులు చేపడతాం
ముదిమాణిక్యం మేజర్ కాల్వ మరమ్మతుల కోసం రూ.10.10 లక్షల నిధుల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే టెండర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. టెండర్లు ఖరారు కాగానే రిటైనింగ్ వాల్ పునర్నిర్మాణంతో పాటు ఇతర మరమ్మతుల పనులు చేపడతాం. కాల్వకు నీటి విడుదలలోపే మరమ్మతుల పనులు పూర్తిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
- కంటిపూడి అశోక్, ఏఈ, ఎన్నెస్పీ.
Updated Date - Jun 24 , 2025 | 12:32 AM