పుడమితల్లికి పుట్టెడు కష్టాలు
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:01 AM
పంచ భూతాల్లో ప్రథమమైన భూతల్లి బోరున విలపిస్తోంది. ప్రపంచ మానవాళికి, జీవ పరిణామ అభివృద్ధికి దోహదమైన పుడమి తల్లికి పుట్టెడు కష్టాలు మొదలయ్యాయి.
సకల జీవులకు ప్రాణాధారం భూమి
ఎరువులు, ప్లాస్టిక్‌తో భూసారం కలుషితం
పంచ భూతాల్లో ప్రథమమైన భూతల్లి బోరున విలపిస్తోంది. ప్రపంచ మానవాళికి, జీవ పరిణామ అభివృద్ధికి దోహదమైన పుడమి తల్లికి పుట్టెడు కష్టాలు మొదలయ్యాయి. జీవ కణజలానికి ఆధారమైన పంచ భూతాలైన భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం కాలుష్యం కోరల్లో చిక్కుకుని జీవ వైవిధ్యానికి ఆటంకం కలిగేలా మానవుడు వ్యవహరిస్తున్న తీరుతో ధరణి అలమటి స్తోంది. అభివృద్ధి వైపు పయనించే మానవ వ్యవస్థ తీరుతో మూగ జీవులు, ధరిత్రి కలుషితమై భవిష్యత్తు జీవ వైవధ్యానికి ప్రశ్నార్థకంగా మారేలా మనిషి వ్యవహరిస్తున్న తీరుపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ/మిర్యాలగూడ రూరల్)
పర్యావరణ పరిరక్షణ దెబ్బతినడంతో వాతావరణంలో సమతుల్యం దెబ్బతింటోంది. రోజురోజుకూ భూవాతావరణం వెడేక్కుపోతోంది.ఆధునిక సాంకేతికరణ పెరుగుతూ నూతన ఆవిష్కరణలు చేపడుతున్నా పుడమి చల్లారకపోగా ఇంకా రాజుకుంటోంది. నియంత్రణ లేకుండా సహజవనరుల వాడకం సమస్యను మరింత జఠిలంచేస్తోంది. మనిషి స్వార్థంతో అవసరాలకు మించి పచ్చని అడవులను, నదీపరివాహక ప్రాంతాల్లోని నీటిని కాలుష్యం చేస్తున్నారు. దీంతో పాటు ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి నీటికొరత నెలకొంటుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసరాల్లోని రైస్‌మిల్లుల ద్వారా వచ్చే కాలుష్యంతో ఇక్కడి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో పాటు భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. కాలుష్యనియంత్రణ చేపట్టాల్సిన అధికారులు మామూళ్లతో చూసీచూడనట్లుగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రూ.కోట్లు వృథా
ప్రభుత్వాలు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మొక్కలను నాటినా నిరుపయోగంగా మారుతున్నాయి. ఒక ఏడాది నాటిన మొక్కలు మరో ఏడాదికి కనుమరుగవుతున్నాయి. ఉపాధిహామీ పథకం అధికారుల కాకి లెక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఒక్క మొక్క దర్శనమివ్వడం లేదు. ఆదర్శ గ్రామంగా నిలిచిన శ్రీనివా్‌సనగర్ గ్రామంలో పచ్చదనాన్ని మెరుగుపరిచి సుందరంగా తీర్చిదిద్దినా అక్కడి ఓ ఆయిల్ మిల్ యజమాని అవసరానికి అనుగుణంగా 5కిలోమీటర్ల మేర పచ్చని చెట్లను సోమవారం వేర్ల సహా పెకిలించి వేయడంపై స్థానికులు సంబంధిత విద్యుత లైనమన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధరిత్రి వారోత్సవాల్లో భాగంగా
పర్యావరణ ప్రేమికులు ధరిత్రి వారోత్సవాలు ఇప్పటికే మొదలుపెట్టారు. నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన సమయంలో 600మంది అధ్యాపకులకు ధరిత్రిని కాపాడుకునే విఽధానంపై సిరిధాన్యాలు, గోధారిత వ్యవసాయ పం టలను, పాస్టిక్ ఉత్పత్తులు వాడేసిన తరువాత చేయాల్సిన విధానం, చేనేత, ఖాదీ వసా్త్రలపైన, ఇంకుడు గుంతలు, ఇంటి పంట గురించి, కంపోస్టు ఎరువుల గురించి వివరిం చారు. స్టీలు బాటిళ్లు వాడేవారిని అభినందించి బహుమా నాలూ అందజేస్తా. ప్రతీ లెక్చరర్ విధిగా పర్యావరణ విద్య,మానవతా విలువలపై పాఠాలు బోధించి విద్యార్థుల్లో పర్యావరణ స్పహను పెంచేలా ఈ వారోత్సవాల్లో కృషి చేయనున్నారు. అదేవిధంగా రేలా చెట్ల పూలను, ఆ విత్తనాలను సేకరించి అవగాహన కల్పిస్తున్నారు.
ఆరుశాతమే అడవి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14.25లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉండగా అందులో ఆరు శాతం మేరకే అడవులున్నాయి. అంటే 83.859 హెక్టార్లలో మాత్రమే అడవి విస్తరించి ఉంది. ఇది కూడా గుట్టలు, బండలు రాళ్లతో కూడి ఉంది. అటవీ విస్తీర్ణంలో 41,569హెక్టార్లు నాగార్జునసాగర్ కేంద్రంగా ఉన్న వన్యప్రాణి విభాగ పరిధిలో ఉంది. అదేవిధంగా నల్లగొండ అటవీ ప్రాంత పరిధిలో 42,290 హెక్టార్లు ఉంది. సూర్యాపేట జిల్లా పరిధిలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో కొంతమేర అటవీప్రాంతం ఉండగా, యాదాద్రిభువనగిరి జిల్లాలో రాచకొండ గుట్టలు ఉన్నాయి.
నేను మీ భూమాతను...
జనులారా... నేను మీ భూమాతను, ధరిత్రి, పృథ్వీ, అవని ఇలా ఎన్నో పేర్లతో నన్ను మీరు పిలుస్తుంటారు. ఎన్నో యుగాలకు నేను సాక్షీభూతాన్ని. నాలో ముప్పావంతు నీరే... కేవలం నేను పావంతు భాగాన్నే. ఆ పావంతును కూడా క్రమంగా అదృశ్యం చేస్తున్నారు మీరు. మీ అవసరాల కోసం నా గర్భాన్ని విచ్ఛిత్తి చేస్తున్నారు. నన్ను కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నారు. నాపై ఉండే పచ్చని వాతావరణాన్ని మాయంచేస్తున్నారు. కాలుష్యాన్ని కొనితెస్తున్నారు. బోరు బావుల పేరిట నా తనువును నిలువునా తోడేస్తున్నారు. నా గుండెల్లో గునపాలు గుచ్చుతున్నారు. ప్రకృతి సంపదను కాదని హానికరమైన కృత్రిమ సంపదను దరిచేర్చుకుంటున్నారు. ప్లాస్టిక్‌ను వాడుతూ నన్ను కాలుష్య కోరలతో కాటేయిస్తున్నారు. స్వచ్ఛమైన మట్టి వాసన ఉట్టిపడే నాలో ఎరువులు, క్రిమిసంహారక మందులు చల్లుతూ నన్ను మీరే ‘కాలకూట’ విషపూరితం చేస్తున్నారు. ప్లాస్టిక్ భూతాలను వదిలి ప్రకృతిని నాశనం చేసుకుంటున్నారు. టన్నులకొద్దీ వ్యర్థాలను నింపి జలసంపదను కలుషితం చేస్తున్నారు. పర్యావరణం పచ్చదనం పేరిట మొక్కలు నాపై మొక్కలు నాటుతారు, నాగరికతకు మారుపేరైన రోడ్ల పేరిట చెట్లను నరుకుతారు. మీ ఆరోగ్యానికి నేనో చిరునామా అని తెలిసినా ఆసుపత్రికే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ భూమ్మీద ఉన్నామన్న సంగతి మరుస్తున్నారు. కూర్చున్న చెట్టుకొమ్మను నరుకుతున్న అమాయకత్వంలా ఉంది మీ ప్రవర్తన. సహనానికి నేనే ఉదాహరణ. విలయానికీ నేనే సోదాహరణ. ఏమో గుండ్రంగా ఉన్న నేను మీ వికృత చేష్టలతో రూపం మారుతానో, మీరు మారుస్తారో. ధరిత్రిని నేను ఎవరికి చెప్పుకోవాలి నా ఆర్తిని మీకు తప్ప!
Updated Date - Apr 22 , 2025 | 12:01 AM