మొదటి మంజూరు పత్రం ఆగవ్వకే
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:26 AM
గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మొదటి మంజూరు పత్రం ఆగవ్వకే ఇస్తున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం మండలంలోని వాసాలమర్రి గ్రామంలో ఆయన ఆకుల ఆగవ్వతో కాసేపు ముచ్చటించారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
తుర్కపల్లి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మొదటి మంజూరు పత్రం ఆగవ్వకే ఇస్తున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం మండలంలోని వాసాలమర్రి గ్రామంలో ఆయన ఆకుల ఆగవ్వతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్థులతో సహపంక్తి భోజనం చేస్తున్న సమయంలో కేసీఆర్ తనను పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం చేశారని తెలిపింది. ఆ సమయంలో తాను కేసీఆర్‌కు అల్లనేరెడు పళ్లు కూడ ఇచ్చానని తెలిపింది. రెండు రోజుల అనంతరం తాను అనారోగ్యానికి గురయ్యానని, అమ్మను బాగు చేయించాలని కేసీఆర్ చెప్పాడని అంతే తప్ప ఆయన తనకేమీ ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వవిప్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పత్రాలు మొదట తనకే ఇస్తానని, ఇంటి నిర్మాణానికి తనవంతుగా రూ.లక్ష ఇస్తానని ఆగవ్వకు హామీ ఇచ్చారు.
బంగారు చేస్తానని.. బంగాళఖాతంలో కలిపాడు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని బంగారు వాసాలమర్రి గ్రామాన్ని చేస్తానని చెప్పి గ్రామాన్ని బంగాళాఖాతంలో కలిపాడని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. ఈ నెల 19న గురువారం ఉదయం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి సభ ఏర్పాట్లను బుధవారం ప్రభుత్వ విప్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకురుల సమావేంలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్థులతో భోజనం చేసి, గ్రామాన్ని బంగారు వాసాలమర్రిని చేస్తానని చెప్పి తన ఫాం హౌస్‌కు నాలుగు లైన్ల రోడ్డు వేసుకున్నారే తప్ప వాసాలమర్రిలో ఒక్క ఇల్లూ కట్టివ్వలేదన్నారు. గ్రామంలో ఇళ్లన్నీ కూలగొట్టి, గ్రామస్థులను రోడ్డున పడేశారని అన్నారు. గ్రామస్థుల ఇక్కట్లను తీరుస్తానని తిర్మలాపూర్‌లో ఈ నెల 6న నిర్వహించిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామంలో 227 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేస్తారని తెలిపారు. సమావేశంలో ఆలేరు మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్యమహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధానావతు శంకర్‌నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు మోహన్‌బాబు, కానుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా మంత్రి శ్రీనివా్‌సరెడ్డి పర్యటనకు సంబంధించి సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీవో కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు.
నేడు బండసోమరానికి మంత్రి రాక
భువనగిరి రూరల్/భువనగిరి (కలెక్టరేట్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు గురువారం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు రావు, వస్తున్నట్లు భువనగిరి ఎంపీడీవో చిల్కూరి శ్రీనివాస్ తెలిపారు.
ఈనెల 21న యోగాడే సందర్భంగా జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన బ్రోచర్లను కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు లు ఆవిష్కరించారు. భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో ఈనెల 21న యోగా డే నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కే. ధనంజనేయు లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వీ.విజయకుమారి,రమాదేవి, కవిత, జయశ్రీ, గాయత్రి ఉన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 12:26 AM