ఉగ్ర దాడులను సహించేదిలేదు
ABN, Publish Date - May 21 , 2025 | 12:36 AM
ఉగ్ర దాడులను సహించేది లేదు.. దేశం వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదుల్లారా కబడ్దార్.. పాకిస్థాన్‌ను 23 నిమిషాల్లో భారత సైన్యం మట్టికరిపించిన విషయాన్ని మరవొద్దు అని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
23 నిమిషాల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత సైన్యం
ప్రధాని మోదీతో అన్ని రంగాల్లో అభివృద్ధి
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
ఉత్సాహంగా తిరంగా యాత్ర
భువనగిరి టౌన్, మే 20 (ఆంధ్రజ్యోతి): ఉగ్ర దాడులను సహించేది లేదు.. దేశం వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదుల్లారా కబడ్దార్.. పాకిస్థాన్‌ను 23 నిమిషాల్లో భారత సైన్యం మట్టికరిపించిన విషయాన్ని మరవొద్దు అని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో దాయాదిపై విజయాన్ని అందించిన భారత సైన్యానికి సంఘీభావంగా మంగళవారం భువనగిరిలో నిర్వహించిన తిరంగా యాత్రలో ఆయన మాట్లాడారు. మహిళల సిందూరాన్ని చెరిపిన పాకిస్థాన్‌కు మహిళా సైనిక అధికారులు సోఫియా కురేషి, వోయమికా సింగ్ ఆపరేషన్ సిందూర్‌తో భారత మహిళల పరాక్రమాన్ని చాటారని అన్నారు. వేల కోట్ల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దిన కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రదాడి చేసిన పాకిస్థాన్ ప్రేరేపిత టెర్రరిస్టులకు ప్రధాని మోదీ కోలుకోలేని రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. దేశం ఎల్లప్పటికీ సర్వేజనా సుఖినోభవంతు, ప్రపంచ శాంతిని కోరుకుంటుందని, కానీ ఏ ఒక్క భారతీయుడికి బాధ కలిగినా ప్రధాని నరేంద్రమోదీ ఊరుకోరని, ఆపరేషన్ సిందూర్ నిరూపించిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రపంచంలోని భారతీయులందరూ తలెత్తుకునేలా చేసిందని అన్నారు. దశాబ్దాల పాటు విదేశీ పాలనలో నలిగిన మువ్వన్నెల జాతీయ జెండాకు మరోమారు అపకారం జరిగితే క్షమించేందుకు నేటి భారతీయులు సిద్ధంగా లేరనే నిజాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలన్నారు. ప్రధాని మోదీ దేశంలోని రవాణా, మౌలిక వసతులు, సైనిక శక్తితో పాటు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూంటే కొన్ని శక్తులు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాని మోదీ నాయకత్వం శ్రీరామరక్ష లాంటిదని అన్నారు. పాకిస్థాన్‌ను ప్రేమించే వారు భారత్‌ను వదలి అక్కడికే వెళ్లాలని అన్నారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ దేశ భక్తి నినాదాలు పాటలతో సాగిన తిరంగా యాత్ర అందరిలో ఉత్సాహాన్ని నింపింది. పలువురు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొన్నారు. తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్ మాయ దశరథ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, పడాల శ్రీనివాస్, పాశం భాస్కర్, చందా మహేందర్‌గుప్త, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:36 AM